శ్రావణి ముచ్చట : సరికొండ శ్రీనివాసరాజు
 శ్రావణి ఆకాశంలో ఎగురుతున్న పక్షులను ప్రతిరోజూ తదేకంగా చూస్తుంది. వాటి క్రమశిక్షణ ముచ్చట గొలుపుతుంది. ఆకాశంలో కొంగల గుంపు పోతూ ఉంటే, చిలకల గుంపు పోతూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. ఒక హారం ఆకాశంలో ఎగిరిపోతుందా అన్నట్లు ఉంటుంది. ఉదయం పూట రామచిలుకలు గుంపులు గుంపులలుగా ఒకవైపే వెళ్తుంటాయి. ఎంతసేపు చూసినా ఒక గుంపు తర్వాత మరొక గుంపు ఇలా ఎన్నో చిలుకలు ఒకే వైపు వెళ్తుంటాయి. సాయంత్రం సమయంలో ఆ వైపు నుంచి ఈ వైపుకు తిరిగి వస్తుంటాయి. మళ్ళీ ఎంతసేపు చూసినా ఇదే పరిస్థితి. 
     శ్రావణి వాళ్ల అమ్మా నాన్నలతో రోజూ జామపండ్లు కొనిపించుకుంటుంది. ఆ పళ్ళను కొన్నిటిని తాను తిని, మరి కొన్నింటిని ముక్కలుగా కోసి తన ఇంటి ప్రహరీ గోడ మీద పెడుతుంది. ఆకాశంలో ఎగురుతున్న చిలుకలు వచ్చి తింటుంటే ఎంత బాగుంటుందని శ్రావణి అనుకునేది. మరి అవి వచ్చి తింటున్నాయే లేదో శ్రావణికి తెలియదు. కానీ ప్రతిరోజూ జామకాయ ముక్కలను ప్రహరీ గోడ మీద ఉంచుతుంది. 
     కాలం గడుస్తున్నది. శ్రావణి పుట్టిన రోజు వచ్చింది. కొత్త దుస్తులు ధరించి, మేడ మీద నిలబడి ఫోటోలు తీయించుకుంటుంది. స్నేహితురాలు మధుగీతిక ఫోటోలు తీస్తుంది. "తీసిన తర్వాత నేను తీసిన ఫోటోలు ఎలా వచ్చాయో వెంటనే చూస్తే నా మీద ఒట్టు. నేను మా ఇంటికి వెళ్లిన తర్వాత చూసుకో" అన్నది. మధుగీతిక ఇంటికి వెళ్లిపోయింది. శ్రావణి తన ఫోటోలు చూసుకుని ఆశ్చర్యానందాలకు లోనైంది. తన భుజం మీద రామచిలుక వాలింది. పోటోలకు ఫోజులిచ్చే అత్యుత్సాహంలో ఇది అస్సలు గమనించలేదు. తన ప్రయత్నం ఫలించింది. రామచిలుక తనకు పుట్టిన రోజు బహుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆ రామచిలుక ఎక్కడున్నా పట్టుకుని చిలుకకు మంచి విందు పెట్టాలని ఉంది. 
 

కామెంట్‌లు