సంపూర్ణ మహాభారతము* సరళ వ్యావహారిక భాషలో...!

 * 52వ రోజు:- నారద మహర్షి రాజులకు ఉపయుక్తమైన విధుల
ఆయుధాగారానికి, ధనాగారానికి సమర్ధులు, నీతి మంతులను నియమించావు కదా !
 వృద్ధులైన శిల్పులను, గురువులను, వర్తకులను పేదరికం లేకుండా పోషిస్తున్నావు కదా ! 
మంత్రులూ సేనానులూ అధికంగా ఉండగా కొలువు తీరుతున్నావు కదా ! 
బయట ఉన్న వారి వలన కాని లోపల ఉన్న వారి వలన కానీ శత్రురాజుల వలన కానీ ముప్పురాకుండా నిన్ను నీవు వేగులను నియమించి కాపాడు కుంటున్నావు కదా ! 
మంచి విద్వత్తు కలిగిన ప్రముఖలతో రాగద్వేష రహితంగా ధర్మం పాటిస్తూ వ్యవహారాలు చక్కపెడుతున్నావు కదా ! 
నీ పరి రక్షణలో ఉన్న ప్రాంతాలు, కోటలు, రాజ్యాలు అన్నీ ధనదాన్య సమృద్ధిగా ఉన్నాయి కదా ! 
ఉప్పు, పులుపు, కారము కలిగిన ఆహార పదార్ధాలు వివిధ పానీయాలు వంటసామాగ్రి, వంటచెరుకు సమృద్ధిగా ఉన్నాయి కదా ! 
నీ కోటలన్నీ శత్రువులకు అభేద్యంగా ఉన్నాయి కదా ! 
నీవు నీ అంతఃశత్రువులను జయించి పాలిస్తున్నావు కదా ! 
మదాంధులైన శత్రువులను జయిస్తున్నావు కదా !
 నీ శత్రురాజులు నీపై దండెత్తకుండా వారిపై సామ, దాన, బేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నావు కదా! 
అని నారద మహర్షి రాజులకు ఉపయుక్తమైన విధులన్నీ ప్రస్తావించాడు.
రాజులు చేయకూడని పనులు
అలాగే ధర్మజా ! రాజు చేయకూడని పనులు చెప్తాను విను అన్నాడు. రాజు నాస్తికుడిగా ఉండకూడదు. అబద్ధం ఆడకూడదు. ప్రమాదాలను ఆలస్యంగా గుర్తించ కూడదు. తెలివి తక్కువ వాళ్ళతో సమాలోచన చెయ్యకూడదు. ఎక్కువగా కోపగించ కూడదు. చేయవలసిన పనులను నాన్చకూడదు. ఆలస్యం చేయకూడదు. తెలివి కలిగిన వారిని ఆలస్యంగా గుర్తించ కూడదు. ప్రయోజకమైన విషయాలు తప్ప అప్రయోజక ఆలోచనలు చేయకూడదు. నిర్ణయించిన పనులు ఆపకూడదు. ప్రభుత్వ రహస్యాలను బయటపడనీయ కూడదు. ప్రజాహితకార్యాలు చేయకుండా జాగు చేయకూడదు. ఇంద్రియ సుఖాలకు ముఖ్యత్వం ఇవ్వకూడదు. సోమరితనం, నిర్లిప్తత, నిష్క్రియా తత్వం రాచకార్యాలలో తగదు. నారద మహర్షి మాటలను శ్రద్ధగా ఆలకించిన ధర్మరాజు " మహర్షీ ! నా యధాశక్తిన అధర్మాన్ని వదిలి ధర్మ మార్గంలో పాలన సాగిస్తున్నాను. తమరు మయ సభను చూసారా ఎలా ఉన్నది " అని అడిగాడు.
రాజసూయ యజ్ఞానికి నాంది
నారదుడు " ధర్మరాజా ! నేను దేవేంద్ర, యమ, వరుణ , కుబేర, బ్రహ్మదేవుల దివ్యసభలే కాక ఇంకా ఎన్నో సభలు చూసాను. అన్నింటి కన్నా మయసభ అపూర్వంగా ఉంది " అన్నాడు. ఒక సారి నేను బ్రహ్మ సభను చూసాను. దాని రూపం అద్భుతం. మరీచి, మనువు, సూర్యచంద్ర గ్రహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు, అశ్వినీ దేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు, ధర్మార్ధ, కామ మోక్షాలు, శబ్ధ, గంధ, రూపాలు, తపస్సు, దమం, ధృతి, శ్మృతి, మేధ, క్షమ, బుద్ధి, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, క్షవం, లవం, తృటి, కాష్ఠ, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణేతిహాసాలు, సాకారంగా బ్రహ్మదేవుని సేవిస్తుండగా సరస్వతీ సమేతుడై పద్మాసనంపై కూర్చుని జీవసృష్టి చేస్తుంటాడు. ఇది వింటున్న ధర్మరాజుకు ఒక సందేహం కలిగింది. నారదుడు వివిధ సభలను వర్ణిస్తూ కృతవీర్యుడు, జనమేజయుడు, పాండురాజు యమసభలో ఉన్నట్లు చెప్పాడు. కానీ మహారాజు హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నట్లు చెప్పాడు. " మహర్షీ ! పరమ ధర్మాత్ముడైన నా తండ్రిగారు యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్రసభలో ఎలా ఉన్నాడు " అని అడిగాడు. " ధర్మరాజా ! త్రిశంకు మహారాజు పుత్రుడైన హరిశ్చంద్రుడు అందరు రాజులను జయించి రాజసూయ యాగం చేసాడు. అందువలన ఇంద్రసభలో ఉన్నాడు. నీ తండ్రిని యమసభలో సందర్శించినప్పుడు పాండురాజు నాతో " రాజసూయ యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉంటారు. కనుక నా కుమారుడు ధర్మరాజుని రాజసూయ యాగం చేయమని ఆజ్ఞాపించానని చెప్పండి " అని అడిగాడు. కనుక ధర్మజా నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయ యాగం చేసి నీవు నీ పూర్వీకులను ఇంద్రసభకు వెళ్ళేలా చెయ్యి. అయితే ఈ రాజసూయ యాగానికి ఎన్నో ఆటంకములు వచ్చే అవకాశం ఉన్నది. యాగవినాశకులైన బ్రహ్మ రాక్షసులు ఎన్నో విఘ్నాలను కల్పిస్తారు. ఈ యాగం చేయడం వలన ఈ భూమండలంపై సర్వక్షత్ర వినాశకమైన యుద్ధం సంభవించేందుకు కారణమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆలోచించుకుని నీకు ఏది మంచిది అనిపిస్తే దానిని ఆచరించు. " అని చెప్పి నారద మహర్షి నిష్క్రమించాడు.ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుడు ఇతర మంత్రులతో రాజసూయయాగం గురించి చర్చించాడు. అందుకు ధౌమ్యుడు " ధర్మరాజా నీ తండ్రి కోరిక తీర్చడం నీకర్తవ్యం. ఈ యాగం వలన సమస్త రాజులు సామంతులు ఔతారు. నీవు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం " అని అన్నాడు. ధర్మరాజు తన తమ్ములతో కూడా చర్చించి రాజసూయ యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడు తగిన సమర్ధుడు అని శ్రీకృష్ణుని తీసుకు వచ్చేందుకు ద్వారకకు ఆప్తులను పంపాడు. ధర్మరాజు సందేశం అందుకుని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్తానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని తగిన రీతిని సత్కరించాడు.

*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు