*సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము అష్టమాశ్వాసము- 46 వ రోజు*
విదురుడు దృపదుడి వద్దకు వెళ్ళుట
విదురుడు దృపదునితో " దృపద మహారాజా ! మీతో బంధుత్వం కలసినందుకు భీష్ముడు, ద్రోణుడు, కృపా చార్యాదులు సంతోషిస్తున్నారు. పాండవులను, కుంతీదేవిని, కోడలైన ద్రౌపదిని చూడాలని దృతరాష్ట్రుడు కుతూహల పడుతున్నాడు. మీరనుమతిస్తే పాండవులను నా వెంట హస్థినకు పంపగలరు " అన్నాడు. దృపదుడు విదురునితో " విదురా ! నీవు, భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు పాండవుల శ్రేయస్సును కోరుతుంటారు. మీరి ఏది చేసినా అది వారికి క్షేమమే " అన్నాడు. శ్రీకృష్ణుడు " మనం ఆలోచించనవసరం లేదు. విదురుడు సదా పాండవుల క్షేమం కోరుతుంటాడు. పాండవులు కోరుకున్నది సిద్ధిస్థుంది " అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి " భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి వారి మాట మాకు శిరోధార్యం " అని అన్నాడు. దృపదుని అనుమతి తీసుకుని తల్లీ కుంతీ దేవి, భార్య ద్రౌపది, సోదరులతో సహా విదురుని వెంట హస్థినకు పయనమైయ్యాడు. దుష్టద్యుమ్నుడు శ్రీకృష్ణుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపా చార్యుడు ఎదురేగి పాండవులకు స్వాగతం పలికారు. హస్థినాపుర ప్రజలు పాండవులకు ఉన్న దైవ బలం వారిని ఆపదలనుండి రక్షించిందని ఇక ధర్మరాజు మనల్ని పరిపాలిస్తాడని సంతోషించారు. పాండవులు అంతఃపురంలో ప్రవేశించి భీష్మునికి, దృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. ఇలా ఆనందంగా అయిదు సంవత్సరాలు గడిచాయి.
అర్ధరాజ్యాభిషేకం
ఒక రోజు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోదనాదులు సమావేశమై ఉండగా శ్రీకృష్ణుని సమక్షంలో ధృతరాష్ట్రుడు పాండవులతో " ధర్మరాజా పెద్దల ఎదుట శ్రీ కృష్ణుని సాక్షిగా మీకు అర్ధ రాజ్యం ఇస్తున్నాను. మీ తండ్రి ఐశ్వర్యం మీకిస్తున్నాను స్వీకరించండి. ఖాడవప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని మీ రాజ్యాన్ని పాలించుకోండి " అని చెప్పి ధర్మరాజుని అర్ధ రాజ్యాభిషిక్తుని చేసాడు. భీష్ముడు, ద్రోణుడు ఇందుకు అంగీకరించారు. పాండవులు తల్లిని, భార్యని, తమ్ములను తీసుకుని ఖాండవప్రస్థానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిపించి పాండవులకు రాజధాని నిర్మించి ఇవ్వమని చెప్పాడు. ఇంద్రుడు దేవశిల్పి విష్వకర్మ సహాయంతో విలాస వంతమైన నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. పాండవులు శ్రీకృష్ణుడు, వ్యాసుని అనుమతితో నగర ప్రవేశం చేసారు. ధర్మరాజు పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.
నారద మహహర్షి రాక - సుందుడు ఉపసుందుల వృత్తాంతం
ఒక రోజు ఇంద్ర ప్రస్థానానికి నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆయనను సాదరంగా ఆహ్వానించి " మహర్షీ ! మాపూర్వ జన్మ సుకృతంగా మీ దర్శనభాగ్యం లభించింది " అన్నాడు. నారదుడు పాండవులను ఏకాంతానికి పిలిచి " మీకు అన్ని ధర్మాలు తెలుసు. మీకు తెలియని ధర్మం లేదు. ద్రౌపది మీ ఐదుగురి భార్య. ఇది లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం. కనుక ఈమె వలన మీలో మీకు విరోధం రాకూడదు. స్త్రీ వలన విరోధం రావడం సహజం. సుందోప సుందులనే రాక్షసులకు ఒక స్త్రీ వలన వివాదం వచ్చి వారిలో వారు కొట్టుకుని మృతి చెందారు. నికుంభుడు అనే రాక్షసునికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిరువురు బ్రహ్మను గురించి గోరమైన తపమాచరించారు. బ్రహ్మ దేవుని వద్ద వారు కామ గమనం, కామ రూపం, మరణమే రాకుడదని వరాలు కోరారు. బ్రహ్మదేవుడు మిగిలిన వరాలు ఇచ్చి మరణమే రాకుండా వరమివ్వడం మాత్రం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు వారు వేరే వారి చేతిలో చావు రాకూడదని అడిగారు. బ్రహ్మదేవుడు అందుకు సరేనని అంగీకరించాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు