చాయ్ తాగితే....:- - యామిజాల జగదీశ్
 చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడి వేడి టీ తాగితే వ‌చ్చే మ‌జాయే వేరు కదా. అవునంటారా కాదంటారా... అలాటి టీ తాగ‌డం వ‌ల్ల అల‌సిసొల‌సిన శ‌రీరానికి ఉత్సాహం ల‌భిస్తుంది. మెదడు చురుగ్గా ప‌నిచేస్తుంది. శ‌రీరానికి ఉల్లాసం క‌లుగుతుంది. అందుకే చాలా మంది టీని ర‌కర‌కాల ఫ్లేవ‌ర్ల‌లో తాగి ఎంజాయ్ చేస్తుంటారు.
నిత్యం టీ తాగే అల‌వాటు ఉన్న‌వారికి ఇప్పుడు సైంటిస్టులు ఒక శుభ‌వార్త చెబుతున్నారు. అదేమిటంటే నిత్యం టీ తాగే వారి ఎముక‌లు దృఢంగా ఉంటాయ‌ట‌. అస‌లు ఎముక‌లు విరిగిపోయే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ఈ విషయాన్ని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. చైనాలోని పెకింగ్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌బ్లిక్ హెల్త్ స్కూల్ ప‌రిశోధ‌కులు ఇటీవ‌లే ప‌రిశోధ‌న చేశారు. నిత్యం గ్రీన్ టీ లేదా సాధార‌ణ టీని 30 ఏళ్లుగా తాగుతున్న వ్య‌క్తుల‌పై సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేశారు. దీంతో తేలిన విష‌యం ఏమిటంటే గత 30 ఏళ్లుగా టీ తాగుతున్న వ్యక్తుల‌లో కీళ్లు విరిగిన సందర్భాలు చాలా తక్కువని తేల్చారు. ఈ ప‌రిశోధ‌న‌లో భాగంగా దాదాపు 4 లక్షల 53 వేల 625 మందిని ప్రశ్నించారు. టీ తాగే అలవాటు లేని వారిలో కంటే టీ తాగే వారిలో కీళ్ల ఎముకలు విరిగిన సందర్భాలు అతి తక్కువ అని పరిశొధకులు తేల్చారు. క‌నుక నిత్యం టీ తాగే అల‌వాటు ఉన్న‌వారికి ఈ అంశం ఎంతో మేలు చేస్తుంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కామెంట్‌లు