చక్కని సాహితీ వేదిక:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
ఈ చక్కని వేదికపైన
ఆసీనులైన అతిధులెందరో
ఈ చల్లని సమయాన
హాజరైన కవివర్యులెందరో   

శ్రమకోర్చి ఏర్పాట్లుచేసిన
సభా నిర్వాహకులెందరో
శ్రద్ధపెట్టి పాల్గొంటున్న
సాహితీ ప్రియులెందరో           ||ఈ||        
     
తమ అద్భుత ప్రసంగాలతో
ఆకట్టుకున్న మహనీయులెందరో
తమ తీయని కవితాగానాలతో
అలరించే కవికంఠాలెన్నో

విభిన్న కవితాతీరులతో
కట్టిపడవేసే గొంతుకలెన్నో
వివిధ భావావేశాలతో            ||ఈ||
భ్రమలుకొలిపే కల్పనలెన్నో         

సరళమైన పదప్రయోగాలతో
శ్రోతలను మెప్పించేమహాశయులెందరో
పలులోతైన ఆలోచనలతో
పులకరింపజేసే ప్రావీణ్యులెందరో

ప్రాసలయల ప్రవాహంతో
పరవశపరచే ప్రముఖులెందరో
మెరిసే మాటలముగింపులతో
మైమరపించే మహాత్ములెందరో      ||ఈ||

వందనాలు వందనాలు
పెద్దవాళ్ళకి వందనాలు
దీవెనలు దీవెనలు
చన్నవార్లకు దీవెనలు

ప్రణామాలు ప్రణామాలు
ప్రావీణ్యులకు ప్రణామాలు
ధన్యవాదాలు ధన్యవాదాలు
ప్రోత్సాహకులకు ధన్యవాదాలు     ||ఈ||


కామెంట్‌లు