కథ చెప్పవా? : సరికొండ శ్రీనివాసరాజు
 రాము 6వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ స్నేహితులను కూర్చోబెట్టుకొని వాళ్ల పెద్దలు చెబుతున్న కథలు చెబుతుంటాడు. వాసుకు ఆ కథలంటే చాలా ఇష్టం. వేసవి సెలవుల్లో వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వాసు, "అమ్మమ్మా! కథ చెప్పవా?" అని అమ్మమ్మను అడిగాడు. "నాకు తీరిక ఎక్కడిదిరా? రోజంతా ఎంత పని చేస్తున్నానో చూస్తున్నావు కదా?' అన్నది అమ్మమ్మ. అమ్మమ్మ తీరిక సమయాలలో టీవీలో డైలీ సీరియల్స్ చూడటంతోనే సరిపోతుంది. ఇక తనకు కథలు చెప్పే తీరిక ఎక్కడ? ఇంటికి వచ్చాక నాయనమ్మనూ బతిమాలినాడు "నాయనమ్మా! కథ చెప్పవా?" అని. ఫలితం లేదు. నాయనమ్మకూ తీరిక సమయాలలో టీవీ సీరియల్స్ చూసే అలవాటు. తానూ రోజూ రాము ఇంట్లోనే ఉంటే ఎంత బాగుంటుంది? అనుకున్నాడు వాసు. అంత స్వేచ్ఛ తనకు ఎక్కడిది? వాసు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు.
      ఒకరోజు వాసు స్నేహితురాలు వాణి వాసు వద్దకు వచ్చి వాసు తరచూ దిగులుగా ఉండటానికి కారణం అడుగుతుంది. వాసు కారణం చెప్పాడు. తనకు ఎన్నో కథలు తెలుసని అంటుంది వాణి. ఎలా తెలుసు అంటాడు వాసు. ఊరి బయట ఉన్న జామచెట్టు మీద కథలు చెప్పే చిలుక ఉందని, ప్రతిరోజూ ఆ చిలుక దగ్గర ఎన్నో కథలు వింటానని వాణీ చెబుతుంది. వాసు అందరూ నిద్రపోయిన సమయంలో ఊరి బయట జామచెట్టు వద్దకు వెళ్ళాడు. వాసు రామ చిలుకను బతిమాలి ఎన్నో కథలు చెప్పించుకుంటున్నాడు. చిలుక ఆపకుండా చెబుతుంది. వాసు ఆసక్తిగా వింటున్నాడు. ఇంతలో కుక్కల గుంపు అక్కడకు వచ్చాయి. భయంకరంగా మొరుగుతూ వాసూను తరుముతున్నాయి. వాసును దొరికించుకున్నాయి. వాసు భయంతో పెద్దగా అరుస్తున్నాడు. "ఏమైందిరా వాసూ!"అంటూ వాళ్ల అమ్మ కంగారుపడి అడిగింది. ఇదంతా కలనా? అనుకున్నాడు వాసు. 
      తనకు వచ్చిన కలను గురించి అమ్మకు చెప్పాడు. వాళ్ల అమ్మ తీరిక సమయంలో వాసూకు కథలు చెప్పడం? మొదలుపెట్టింది. ఇంటికి కథల పుస్తకాలు కూడా తెప్పిస్తుంది. వాసు ఆనందానికి అవధి లేదు.

కామెంట్‌లు