62 వ రోజు:-పదికి సభలో అవమానం
ఇదంతా చూస్తున్న భీష్మునకు నోట మాటరాలేదు. విదురుడు దుఃఖిస్తున్నాడు. కర్ణుడు, సైంధవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. " విదురా! ఏమైంది? ఎవరెవరు ఏ పందాలు ఒడ్డారు?" అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి " ఇల్లు తుడవటానికి దాసి ద్రౌపదిని పిలుచుకురా " అని ఆజ్ఞాపించాడు. విదురుడు " ఛీ నీవంటి మూర్ఖుడు లేడు. ఇలాంటి పనికి నన్ను పంపుతారా. ద్రౌపది ఎవరు ? సమస్త భూమండలానికి పట్టమహిషి. ఆ సాధ్విని అవమానిస్తారా ! ఒక మేక ఒక బాణాన్ని మ్రింగిందట. అది మ్రింగుడు పడక పోయేసరికి తలను నేలకేసి కొట్టుకున్నదట. దానితో ఆ బాణం దాని కంట్టంనే తెగకోసిందట. పాండుపుత్రులతో వైరం అటువంటిదే." అని ఊరకున్నాదు. సుయోధనుడు ప్రాతిగామి అను సూతనందనుని పిలిచి " నీవు పోయి ద్రౌపదిని సభకు తోడ్కొని రా " అన్నాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి " అమ్మా ! ధర్మరాజు జూదంలో సమస్త సామ్రాజ్యాన్ని, తమ్ములను, తనను, నిన్ను ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు. పదమ్మా పోదాము " అన్నాడు. అప్పుడు ద్రౌపది " అయ్యా! ఏ యుగంలోనైనా ఇలాంటి చెడ్డ జూదగాడు ఉంటాడా ? ధర్మరాజు ఇలా చేసాడా? తనను కూడా ఓడాడు అంటున్నావు. తన్నోడి నన్నోడెనా ? నన్నోడి తన్నోడెనా ? తెలుసుకుని వచ్చి నన్ను తీసుకు పో " అన్నది. ప్రాతిగామి తిరిగి వచ్చి ఇదే విషయం అడిగాడు. " ఇది సమాధానం చెప్ప వీలులేని విషయం. ఇక్కడికే వచ్చి అడగమను. నీవుపోయి ద్రౌపదిని తీసుకు రా " అన్నాడు. ప్రాతిగామి ద్రౌపది కోపానికి భయపడి అక్కడే ఉన్నాడు. దుర్యోధనుడు దుశ్శాశనుని చూసి " వీడు భీముడిని చూసి భయపడుతున్నాడు.నీవు పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకు రా " అన్నాడు.దుశ్శాసనుడు పాండవుల భవనంలో ప్రవేశించి " ద్రౌపదీ! జూదంలో నేన్ను మేము గెలుచుకున్నాం. కౌరవులను సేవించు కునేందుకు సభలోకి రా" అంటూ దగ్గరికి వచ్చాడు. " అయ్యా నేను రజస్వలను. ఏకవస్త్రను. నన్ను ముట్టవద్దు. సభకు రాలేను " అన్నది. దుశ్శాసనుడు నవ్వి " ఏకవస్త్రవైనా విగత వస్త్రవైనా రాక తప్పదు. నేను నిన్ను తీసుకు పోతాను " అంటూ దుశ్శాసనుడు ద్రౌపది దగ్గరకు రాగా అంత ద్రౌపది భయపడి ధృతరాష్ట్రుని అంతఃపుర కాంతలున్నవైపుకు పరిగెత్తగా దుశ్శాసనుడు ఆమెను వెంబడించి ద్రౌపది కురులు పట్టుకుని ఈడ్చుకుంటూ సభకు తీసుకు వచ్చాడు. ద్రౌపది దుస్థితి చూడలేక పాండవులు తలలు వంచుకున్నారు. ద్రౌపది కురువంశ పెద్దలను చూసి " అయ్యా! దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకు వస్తున్నాడు, మీరందరూ చూస్తుండగా అవమానిస్తున్నాడు, అధర్మం పెరిగి పోయింది. ధర్మానుసరంగా నన్ను గెలుచుకున్నారా! నా ఈ ప్రశ్నకు సమాధాన మివ్వండి " అన్నది. అంతదుశ్శాసనుడు "దాసి, దాసి" అని పెద్దగా నవ్వుతూ ఈడుస్తున్నాడు. కర్ణుడు ఆనందంతో సమర్ధిస్తూ దుశ్శాసనుడిని అభినందిచాడు. ఈడ్వపడుతున్న ద్రౌపదిని చూసి భీముడు అవమానం భరించలేక ధర్మరాజుని చూసి " ఓ ధర్మజా! ఈ రాజ్యం, నీ తమ్ములు నీ వశంలో ఉన్నాము కనుక జూదంలో ఒడ్డావు. దృపదరాజ పుత్రిని జూదంలో పెట్టడం తగునా ? అందు వలన ద్రౌపది అవమానాల పాలైంది. జరుగుతున్నది అధర్మ జూదమని తెలిసి నువ్వు జూదం ఆడావు. ఈ నా బహులని కాల్చుకుంటా (నీలకంఠ దీక్షిత వ్యాఖ్యనం) . సహదేవా ! అగ్నిని తీసుకురా" అన్నాడు . అర్జునుడు " అన్నయ్యా ! స్నేహంగా ఆడుకునే జూదానికి , ధర్మయుద్ధానికి పిలిస్తే పోవడం రాజధర్మం. అందుకనే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు కాని విధి వైపరీత్యానికి ఏమి చేస్తాం ? " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి