అలల మీది తామరలు
అందమైన ఉయ్యాలలు
ఆగమించు దైవానికి
ఆహ్వాన లాంఛనాలు
తటాకాన త్రోవ చేసి
ఆటంకము లేక చూసి
ఆవాహన చేసికొని తరణికి
ఆతిథ్యము ఇచ్చినట్టు....
కనుచూపు సోకునంతవరకు
కమలముల శ్రేణితో
కరములు జోడించి నిలిచి
కిరణమాలికి జోతలు అర్పించ..
రేకురేకున సోకు నింపి
రేయంతా ఎదురుచూసి
రేపటి వెలుగును చూడ
రెప్పలు విప్పనెంచి....
నింగిని పొంగే రంగులకు
మించిన అరుణ వర్ణముతో
నీటిని విరిసిన అంబుజపు
నిర్మల కాంతి పరచుకోగా..
పసిడి వెలుగు ధారలతో
పరిధి లేని తీరున పృధ్వీ
పరిసరాలన్నీ ప్రకాశింప ఏతెంచు
ప్రభాకరునికి ప్రణామములిడుతూ
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి