సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 * 53వ రోజు - జరాసంధుడు
శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజుతో " ధర్మనందనా ! నీ నిర్ణయం ప్రశంశనీయం. పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు. అప్పుడే ఇక్ష్వాకు, ఇల అనే రెండు వంశాలు మిగిలాయి. అవి రెండే సహజ వంశాలు. మిగిలినవి మిశ్రమ వంశాలే. ఆ రెండు వంశాలు నూటొక్క వంశాలుగా వృద్ధి చెందాయి. యయాతి, భోజ, వంశాల వలన మరో పదునాలుగు వంశాలు ఏర్పడ్డాయి. ఈ రాజవంశాలనన్నింటిని జరాసంధుడు జయించాడు. ఛేది భూపాలుడు శిశుపాలుడు జరాసంధునికి సైన్యాధి పతి. హంసఢింబకులు అనే మహా బలవంతులు జరాసంధునికి ఆప్తులు. కౌశిక చిత్రసేనులు జరాసంధునికి కుడి ఎడమ భుజాలు. ఛేది రాజులలో పురుషోత్తముడు, అంగ, వంగ, పుండ్ర, కిరాత రాజులు పౌండ్రక వాసుదేవుడు జరాసంధుని సేవిస్తున్నారు. తూర్పు దక్షిణదేశాల రాజులు పురుజితుడు, కరూశుడు, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు జరాసంధుని కొలుస్తున్నారు. ఉత్తర దిక్కున పద్దెనిమిది మంది రాజవంశాలు భయంతో జరాసధుని కొలుస్తున్నారు. నేను వధించిన కంసుని భార్య జరాసంధుని కూమార్తె. అందు వలన జరాసంధుడు నా పై పగబూని ఉన్నాడు. ధర్మరాజా! ఆ హంస ఢింబకులు మూడు లోకాలను జయించగలరు. ఒకసారి హంసఢింబకులతో మధురమీద దండెత్తారు.యుద్ధంలో హంసఢింబకులను చంపాను . ఇప్పుడు జరాసంధుడు నిస్సహాయుడు. మేము జరాసంధునితో విరోధం వలన రైవతకాద్రిలో కోట కట్టుకుని ఉన్నాము. మనం ముందు జరాసంధుని వధించాలి. అప్పుడు రాజసూయం సాధ్యపడుతుంది. నీ రాజ్యం స్థిరపడుతుంది. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కనుక పతనం తప్పదు " అని శ్రీకృష్ణుడు
జరాసంధ జననం
అప్పుడు భీముడు ధర్మరాజుతో " అన్నయ్యా ప్రయత్నంతో అన్ని విజయములు సమకూడుతాయి శ్రీకృష్ణుని దయ అర్జునిని సహాయం నీ అనుమతి ఉంటే జరాసంధుని సంహరిస్తాను " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా రాజులందరిని జయిస్తాము. రాజసూయం నిర్వహిస్తాము. లేకపోతే రాజసూయం, మయసభ, గాండీవం ఎందుకు " అని అన్నాడు . భీమార్జునుల మాటలు విని శ్రీ కృష్ణుడు సంతోషించాడు. ధర్మరాజు " కృష్ణా !అసలు జరాసంధుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు ? " అన్నాడు. శ్రీకృష్ణుడు " ధర్మనందనా ! మగధరాజైన బృహధ్రధుడు కాశీరాజు పుత్రికలను వివాహమాడాడు. వారికి సంతానం కలుగలేదు. అతడు భార్యలిద్దరితో అరణ్యాలకు పోయి ఛండకౌశికుడు అనే మునిని భక్తితో సేవించారు. వారి సేవలకు ఛండకౌశికుడు సంతోషించి వారిని చూసి " ఏమి వరం కావాలి కోరుకో " అన్నాడు. అందుకు బృహద్రదుడు " మహాత్మా నాకు పుత్రసంతానం ప్రసాదించండి " అని కోరాడు. అప్పుడు ఒక మామిడి చెట్టు మీద నుండి ఒక మామిడి పండు ఆ మహర్షి తొడమీద పడింది. మహర్షి ఆ పండును మంత్రించి బృహద్రదునికి ఇచ్చాడు. ఈ పండుని తిన్న వారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంతో ఆ పండును ఇద్దరు భార్యలకు కోసి ఇచ్చాడు. ఇద్దరు గర్భం ధరించి ప్రసవించారు. ఇరువురికి నిలువుగా సగం చీలిన శరీరంతో రెండు శిశువులు జన్మించారు. ఆ శిశుఖండాలను చూసి భార్యలిరువురు భయపడ్డారు. బృహధ్రధునికి చూపించటానికి సిగ్గుపడి పరిచారికలకు ఇచ్చి బయట పారేయించారు. వారు వాటిని నాలుగుదారుల కూడలిలో పారవేసారు. అర్ధరాత్రి జర అనే రాక్షసి వాటిని తినాలని పట్టుకుని రెండు ముక్కలను పట్టుకుని చూడగా ఆశ్చర్యంగా రెండూ కలిసి ఒక బాలుని రూపంగా మారింది. ఆ బాలుని ఏడుపు విని అంతఃపురం లోని స్త్రీలు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి రాక్షసి పారి పోయింది. ఇంలో అక్కడికి వచ్చిన బృహధ్రధుడు బాలుని చూసి సంతోషించాడు. ఇది గమనించిన రాక్షసి బృహధ్రధుని వద్దకు వచ్చి " మహారాజా ! నేను జర అనే రాక్షసిని. ఆ శిశుఖండాలు నా చేతిలో బాలుని రూపం ధరించాయి . ఇతడు వజ్రశరీరం కలవాడు. ఇతనిని స్వీకరింపుము " అని చెప్పింది. బృహధ్రధుడు జరతో " నీ దయ వలన నా వంశం ఉద్దరింప బడింది. కనుక ఈ బాలునికి జరాసంధుడు అని నామకరణం చేస్తాను. నీవు నాపాలిట పుణ్య దేవతవు " అన్నాడు. ఒకసారి ఛండకౌశికుడు బృహధ్రధుని వద్దకు వచ్చాడు . బృహధ్రధుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుని చూపించాడు. ఛండకౌశికుడు బృహధ్రధునితో " వీడు పరాక్రమవంతుడౌతాడు. ఎలాంటి ఆయుధములు, అస్త్రములు, ఇతనిని చంప లేవు. ఇతడు రాజులందరిని జయిస్తాడు. ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు. ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు " అన్నాడు. అందువలన జరాసంధుడు అసమాన బలాడ్యుడు అయ్యాడు. బృహధ్రధుడు జరాసంధునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. ధర్మరాజా ! భీమసేనుడు ఒకడే జరాసంధుని చంపగల సమర్ధుడు. అందుకని భీమార్జునులను నాతో పంపు " అన్నాడు. " కృష్ణా ! నీ అండ ఉండగా మాకు పొంద లేనిది ఏమున్నది. ఇక జరాసంధుడు మరణించినట్లే . నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే " అని భీమార్జునులను దీవించి శ్రీకృష్ణునితో పంపాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు