ప్రజాదరణతో దేశాధినేతయ్యాడు!!:- - యామిజాల జగదీశ్
 అది 1848 వేసవికాలం, లూసియానాలోని బాటన్ రూజ్‌.
స్థానిక పోస్ట్‌మ్యాన్ చాలా ముఖ్యమైన లేఖతో ఒక నిరాడంబరమైన తోట వద్దకు వచ్చాడు.
ఆ లేఖకు పోస్టేజీ కింద కేవలం పది సెంట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంటి యజమాని ఆ డబ్బు చెల్లించడానికి నిరాకరించాడు. ఆ ఉత్తరం సాధారణమైనదని భావించి, ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చూడకుండా తనకక్కర్లేదని పోస్ట్ మ్యాన్ కి ఇచ్చేశాడు. 
అయితే అది సామాన్యమైన ఉత్తరం కాదు. వాస్తవానికి అతను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా నామినేట్ అయ్యాడన్న విషయాన్ని అధికారికంగా తెలిపే నోటిఫికేషన్ అది. కానీ ఆ విషయం అతనికి తెలీదు. అతని పేరు జాకరీ టేలర్.
అమెరికన్ ప్రజలు అతనిని "ఓల్డ్ రఫ్ అండ్ రెడీ" అని పిలిచేవారు.
అతను దేశ సరిహద్దును రక్షించడానికి  మెక్సికన్ - అమెరికన్ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. అతను దాదాపు నలభై సంవత్సరాలు సైనికుడిగా కొనసాగాడు.
అతను గడ్డి టోపీలు ధరించేవాడు. ఎప్పుడూ పొగాకు నమిలేవాడు.
కానీ అతని గురించి చెప్పుకోవడానికి ఒక విషయం ఉంది. అతను ఎప్పుడూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగిం చుకోలేదు. 
అటువంటి వ్యక్తికి వచ్చిన ఉత్తరం మేయర్ పదవి కోసమో లేదా గవర్నర్ పదవి కోసమో కాదు. దేశాధ్యక్షుడి కోసం నామినేట్ చేస్తున్నట్లు తెలిపే ఉత్తరం.
టేలర్ తనను తాను దేశం కోసం సేవలందించే ఓ సైనికుడిగా భావించాడు. రాజకీయ గొడవలు లేకుండా స్వతంత్రంగా ఉన్నాడు.
అతను వాషింగ్టన్‌లోని రాజకీయ నాయకులను విశ్వసించలేదు. వారి విషయాల నుంచి దూరంగా ఉండేవాడు. కానీ "విగ్ పార్టీ" (whig party) విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించిన సందర్భాలున్నాయి. అతనికి రాజకీయ చరిత్రంటూ ఏమీ లేదు. ఏ సభలోనూ ప్రసంగించిన అనుభవమూ లేదు. కానీ అతని పేరును అధ్యక్షుడి పదవికి నామినేట్ చేయడానికి గల ఏకైక కారణం, దేశ ప్రజలు అతన్ని ప్రేమించడం. ప్రజల నుంచి ఏ రాజకీయ నాయకుడికీ లేనంత ఆదరణ ఉండటం. అతనిని కబురంపి సంప్రతింపులు జరిపారు.
తాను పార్టీకి అధ్యక్షుడిని కాబోనని, మొత్తం ప్రజల అధ్యక్షుడినైతే ఉంటానని అతను స్పష్టం చేశాడు. 
చివరికి ఎన్నికల రోజు వచ్చినప్పుడు, ఆ మాజీ జనరల్ టేలర్ ఓ అపూర్వమైన పని చేశాడు. అతను తన సొంత జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌ కు వెళ్ళాడు. అతను తన అరవై నాలుగు సంవత్సరాల జీవితంలో మొదటిసారిగా బ్యాలెట్ అందుకున్నాడు. అతను తన కోసం తన మొదటి ఓటు వేశాడు. అతనేమీ దానిని కీర్తి కోసం చేయలేదు. అతను అధికారం కోసమూ చేసింది కాదు. డబ్బు కోసమూ చేసింది కాదు. దేశం కోసం సేవ చేయమని కోరబట్టీ అతను ఓటు వేశాడు. ఈ క్రమంలో

పదవి కోసం తమ జీవితాలను వెచ్చించిన అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను ఓడించి టేలర్ ఎన్నికల్లో గెలిచాడు. విగ్ పార్టీ నుండి వచ్చిన చివరి అధ్యక్షుడిగా చరిత్ర పుటల్లో మిగిలిపోయాడు.
జాకరీ టేలరు 1784 నవంబరు 24న జన్మించాడు. సైనికాధికారిగా, దేశాధ్యక్షుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. అమెరికాకు 12వ అధ్యక్షుడు.1849 నుండి 1850లో మరణించే వరకు దేశాధ్యక్షుడిగా సేవలందించాడు.  యునైటెడు స్టేట్సు ఆర్మీలో కెరీరు ఆఫీసరు‌ స్థాయి నుంచి మేజరు జనరల్ స్థాయికి ఎదిగాడు. మెక్సికను-అమెరికను యుద్ధంలో విజయుడిగా "జాతీయ హీరో" గా మారాడు. అనారోగ్యం బారినపడి కేవలం పదహారు నెలలు మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగి తుదిశ్వాస విడిచాడు. టేలరు అమెరికా చరిత్రలో అతి తక్కువ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగిన మూడవ వ్యక్తి. అతనికి ముందు విలియమ్ హెన్రీ హారిసన్, జేమ్స్ కె. పోల్క్ కూడా తక్కువ కాలమే దేశాధినేతగా కొనసాగారు.
కామెంట్‌లు