సుప్రభాత కవిత - బృంద
కనుపాప  కమ్మగా కన్న 
కలలు సాకారమవుతాయని 
కిరణాలలో వర్ణాలు నింపి 
కురిపించి మురిపించె భానుడు!

కలతల వెంట కనపడని 
కరుణని  చేరవేయాలని 
కదిలి వచ్చి కనువిందుగా 
కనికరించే  కశ్యపాత్మజుడు!

నొచ్చుకున్న మనసును
మరపించే ప్రయత్నంగా
రంగులు చూపించి
అబ్బురపరచే ఆత్మీయుడు!

రంగులెన్ని పొంగినా 
కొంగున నిలిచేది 
కొత్త వెలుగు మాత్రమేనని
మెత్తగా మందలించు మిత్రుడు!

ఆటుపోట్లు తట్టుకుని
ఆచి తూచి అడుగేసి 
ఆనందం పోగేసుకొమ్మని 
అందంగా చెప్పే ఆదిత్యుడు!

దేహమే దేవాలయమని 
ధర్మం నిలబెట్టే సాధనమని 
స్వచ్ఛతే దైవమని భావించి
స్వస్థతతో జీవించమనే భాస్కరుని...

స్వాగతిస్తూ...

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు