మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయనిగా పనిచేస్తున్న అమ్మల కామేశ్వరి జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచారు. ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొట్టమొదటి సాహిత్య సంస్థ ఐన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కవితల పోటీల్లో కామేశ్వరి పాల్గొని విజేతగా నిలిచారు. ఆ అపూర్వ బాల్యం అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో వందలాదిమంది పాల్గొనగా, అందులో కామేశ్వరి పంపిన సౌగంధిక పుష్పాలు అనే కవిత విజేత స్థానాన్ని సొంతం చేసుకుంది. శ్రీశ్రీ కళావేదిక 36 ప్రపంచ రికార్డులను సాధించిన ఏకైక సాహిత్య సంస్థ గత పదేళ్లుగా వివిధ ప్రత్యేక పర్వదినాల్లో ఆయా సందర్భాలననుసరించి కవితలు కథలు వ్యాసాలు వంటి సాహిత్య ప్రక్రియల పోటీలు నిర్వహిస్తూ వేలాది మందిని ప్రోత్సహిస్తున్నారు. కామేశ్వరి పంపిన రచనలో బాల్యపు జ్ఞాపకాల దొంతరలో తరగని కావ్యపు ఊసులెన్నో, అవి కనుమరుగవ్వని ప్రేమ తత్వాలంటూ రచించారు. జామురాతిరి ఆమని పాడే సందళ్ళలనే బాల్యం ఉందంటూ రచించారు. ఎప్పటికప్పుడు జీవన క్రాంతిని తలపించే గురుతులే బాల్యం అని చాటి చెప్పారు.
ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వం వహించగా, జి.ఈశ్వరీ భూషణం, నూక సంపత్ కుమార్, నల్లా భాగ్యలక్ష్మి, మళేకర్ నాగజ్యోతి, సాహూ సంధ్య, తాటి హరీష్, సువర్ణ జోషి, ఎస్.మహాలక్ష్మిరెడ్డి, పి.సాయిసంతోషిలు సమన్వయకర్తలుగా, నిర్వాహకులుగా, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి, సౌగంధిక పుష్పాలు అను కవితను అభినందిస్తూ కామేశ్వరికి విజేత ప్రశంసాపత్రాన్ని పంపారు.
కామేశ్వరి ఆనాటి తీపి గురుతుల సువాసనను నింపి, అపూర్వ క్షణాలను అక్షరాల రూపంలో మలచి కాలం తుడిచేయలేని బాల్యపు పరిమళాలను తన కవిత ద్వారా చాటిచెప్పారని, ఆమె భాషా మాధుర్యాన్ని అభినందిస్తూ టాప్ టెన్ లో నిల్పి, విజేత ప్రశంసాపత్రాన్ని పంపారు. కొత్తూరు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి ఐన అమ్మల కామేశ్వరి రచన, స్వరకల్పన, గానం, సేవారంగాలలో ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ, నేడు జాతీయ స్థాయి కవితల్లో విజేతగా నిలుచుట పట్లపలువురు సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యావంతులు హర్షం వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి