అంశము
ప్రకృతి -పురుషుడు
సర్వయోనిషుకౌంతేయ మూర్తయః సంభ వంతియాః!
తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా!. 14అధ్యాయములో4వశ్లోకం)
ప్రకృతి, పురుషుడు అనాది యైనవి. రాగద్వేషాధి వికారములు త్రిగుణాత్మకమైన పదార్థములన్నియును ప్రకృతి నుండియే ఉత్పన్నమైనవి.
కార్యములు (10-పృద్వి, వాయు, అగ్ని, జలం, ఆకాశం, శబ్ద, స్పర్శ,రూప రస, గంధములు).
కరణములు--(13. మనో బుద్ధి, అహంకారములు, చర్మము ,కళ్ళు ,చెవులు, నాలుక ,నాసిక, వాక్, పాణి, పాద పాయూప స్థలములు).
ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువు.!
సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువు.
పురుషుడు ప్రకృతి (త్రిగుణమంతా మాయా) స్థితుడై ,ప్రకృతి నుండి ఉత్పన్నమైన పదార్థములను అనుభవించును. ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమజన్మలకు కారణమగును.
సత్వగుణ సాంగత్యము --, దేవయోని జన్మ.!
రజో గుణ సాంగత్యము --మానవ యోని జన్మ.!
తమోగుణసాంగత్యము --పశుపక్ష్యాదులు, నీచయోనులందు జన్మ.!
ఈ దేహమునందున ఆత్మ వాస్తవంగా పరమాత్మయే!
(త్రిగుణమైన మాయకు అతీతుడైనవాడు.),
1. ఉపద్రష్ఠ+2. అనుమంత+3. భర్త+.4. భోక్త+5 మహేశ్వరుడు+6 పరమాత్మ (ఇవి అన్నియు దేహమునందున్న ఆత్మ).
1 ఉపద్రష్ఠ--సాక్షిభూతుడు (అగుట వలన).
2. అనుమంత,--, యదార్థ సమ్మతిని ఇచ్చువాడు. !
3. భర్త- అన్నిటినీ భరించి పోషించువాడు.!
4. భోక్త-- జీవ రూపంలో స్వీకరించేవాడు.!
5. మహేశ్వరుడు--
బ్రహ్మాదులకు స్వామి!
6. పరమాత్మ--: శుద్ధ సచ్చిదానంద ఘన. స్వరూపుడు!
ఈ పురుషుని తత్వమును, గుణ సహితమైన ప్రకృతి తత్వములను తెలిసి కొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికి పునర్జన్మను పొందడు. దృశ్యమాన జగత్తు అంతయు మాయా కార్యమగుట వలన క్షణభంగురము, నశ్వరము, జడము, అనిత్యము.
జీవాత్మ---: నిత్యుడు, చేతనుడు, నిర్వికారుడు శాశ్వతుడు ,మరియు శుద్ధ బోధస్వరూపుడైన సచ్చిదానంద ఘన పరమాత్మ యొక్క సనాతనాంశ!
ఈ విధముగా తెలుసుకొని సమస్త మాయామయ పదార్ధములసంగమము సర్వదా త్యజంచి, పరమ పురుషుడైన పరమాత్మ యందే ఏకీభావముతో నిత్య స్థితుడై ఉండుటచే అతన్ని తాత్ర్వికంగా తెలుసుకొనుట యగును. కొందరు పరమాత్మను సూక్ష్మ బుద్ధితో ధ్యానయోగము--: పరిశుభ్రమైన ప్రదేశమున దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును గాని పరచి స్థిరమైన స్థానమును ఏర్పరచుకొని ధ్యానము చేయుదురు.
ఇంకొందరు జ్ఞాన (సాంఖ్య) యోగము--: సుఖదుఃఖములను సమానమంగా చూచుచు, విషయేంద్రియ సంయోగములకు చలించక, పరమాత్మ అంతట ను వ్యాపించియున్నదని ఎరిగి శాశ్వతమైన నిత్యమైన మోక్షమును పొందెదరు.!
మరికొందరు కర్మయోగము--: నిశ్చయా త్మక బుద్ధి కలిగి, వేద వాక్యముల యొక్క భాహ్యార్ధముల యందు ప్రీతి కలిగి, క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములను త్యజించి, స్థితప్రజ్ఞుడై,నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తిని పొందెదరు.!
ఈసాధన మార్గములు ఎరుగని మందబుద్ధులు తత్వ జ్ఞానము గల ఇతరముల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణ పరాయణులును, మృత్యు రూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు.
ఈ స్థావరజంగమ ప్రాణులన్నియు క్షేత్ర --క్షేత్రజ్ఞ సంయోగము వలననే ఉత్పన్న ములగునని ఎరుగవలెను. శ్రీ లలితా సహస్రనామములు క్షేత్ర స్వరూపా! క్షేత్రేశి క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ! అని అంటూ ఉంటాము.
నశ్వరములైన చరా చర భూతములు (ప్రాణులు) యందు సమముగా స్తితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజమైన ద్రష్ట. అతడు పరమ గతిని పొందును.
సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవి
ఆత్మ ,అకర్త అని ఎరిగినవాడు వాస్తవంగా వాస్తవాన్ని చూచువాడు.
వేర్వేరుగా గోచరించుచున్న
ప్రాణులన్నియు ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నవని, అట్లే అవి అన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నట్లుగా ఎరిగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద ఘన పర బ్రహ్మను చేరును..
గమనిక--: అలలు, నురుగు, నీటి బిందువులు,-సముద్రంలోనే ఉన్నాయి. అవి అన్నియును అక్కడి నుండే విస్తరింస్తున్నాయి. నాశరహితమైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నా అనాది (సనాతనము) అగుట వలనను, నిర్గుణుడు అగుట వలనను, ఎట్టి కర్మలకు కర్తకాడు. కనుక కర్మలతనిని ఏమాత్రము అంటవు. సర్వత్ర ( ఇతర మహా భూతముల యందు), వ్యా
పించి యున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషాలు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణ మగుటవలన వాటి గుణ దోషములు దానికంటవు.
ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశవంత మొనర్చునట్లు, ఒకే ఆత్మ (అదే పరమాత్మ) సర్వప్రాణుల యందు స్థితమై వాటినన్నింటిని ప్రకాశింప (చైతన్యవంతముగా) చేయుచున్నవి. ఈ విధముగా క్షేత్ర --క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్య సహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాన నేత్రముల ద్వారా
ఎరిగిన మహాత్ములు పరమ గతిని పొందుదురు.
అటువంటి జ్ఞాన నేత్రములను ప్రసాదించమని ఆ గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముని నిత్యము (వేడుకుందాము )ప్రార్ధించి తరిద్దాము.
---------------------------------
శ్రీ మద్భగవద్గీత
ప్రకృతితో మమేకమైనపురుషుడుత్రిగుణాత్మకస్వరూపగుణములు.
-----------------------------
శ్రీమద్భగవద్గీత *వ్యాసములు 12: - పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి