శ్రీమద్గవద్గీత వ్యాసములు--13.:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797
 

అంశము--
త్రి గుణాలు

ఊర్ధ్వంగచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః!
జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః!!
ఓ అర్జునా!--
ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజ స్తమోగుణములు నాశములేని జీవాత్మను శరీరము నబంధించును.
 ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది. కనుక ప్రకాశమును ( జ్ఞానము) ఇచ్చునది. వికార రహితమైనది. అది సుఖసాంగత్యము వలన, జ్ఞానాభిమానమువలన మనుజుని బంధించును.
రజోగుణము రాగాత్మకము అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని యెరుంగుము. అది జీవాత్మ నుకర్మల యొక్కయు, కర్మఫలముల యొక్క యు సాంగత్యము తో 
 బంధించును.
తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయను. అది అజ్ఞానము వలన జనించును. జీవాత్మను ప్రమాద, ఆలస్య, నిద్రాదులతో బంధించును.
ప్రమాదము,---: ఇంద్రియాంతఃకరణముల వ్యర్ధ చేష్టలను ప్రమాదము అని అందరు.
ఆలస్యము---:, కర్తవ్యా కర్మల యందు ప్రవృత్తుడు కాకుండా ప్రయత్నింపక ఉండుటను ఆలస్యము అందురు. 
సత్వగుణముజీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మల యందు నిమగ్నునిగా చేయును.
 తమో గుణము   జ్ఞానమును కప్పివేసి ప్రమాదములలో ముంచి వేయును.
సత్వగుణము--: రజ, తమోగుణము లనణచి వృద్ధి చెందును. 
రజోగుణము --: సత్త్వ, తమో గుణములనణచి వృద్ధి చెందును. 
తమోగుణము--; సత్త్వ, రజో గుణముల నణచి వృద్ధి చెందును.
శరీరేంద్రియముల యందును, అంతఃకరణమునందును, చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్త్వగుణము వృద్ధి చెందినదని తలచవలెను..
రజోగుణము వృద్ధి యైనపుడు లోభము, ప్రవృత్తి ( ప్రాపంచిక విషయములందు ఆసక్తి) స్వార్థ బుద్ధితో సకామ భావముతో కర్మాచరణము అశాంతి, విషయ భోగముల యందు లాలస, అనునవి ఉత్పన్నములగుచుండును.
తమో గుణము అధికమైనప్పుడు అంతః కరణమునందును ఇంద్రియముల యందును, వివేక శక్తి నష్టమగును. కర్తవ్య కర్మల యందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్ధ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును.
సత్త్వగుణ మువృద్ధి చెందినపుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరెడి నిర్మలములైన నిర్మాణములైన స్వర్గాది దివ్యలోకములను పొందును. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మరణించిన చో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. తమోగుణం వృద్ధి చెందినపుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించును.
శ్రేష్టమైన కర్మాచరణము వలన సాత్విక ఫలం--సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజసకర్మలు--దుఃఖము., తామకర్మలకు ఫలం అజ్ఞానం..
భగవత్ ప్రాప్తికి ఉపాయము త్రిగుణాతీతుని లక్షణాలు అర్థం చేసుకోవడం. ద్రష్ట యైనవాడు సమిష్టి చేతన యందు ( ఏకీభావముతో సాక్షీభూతుడైన పురుషుడు) గుణములే గుణముల యందు వర్తించుచున్నవనియు, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేవని తెలుసుకుని త్రిగుణములకు అతీతముగా నున్న సచ్ఛిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్త్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపము నేపొందును.
మనో బుద్ధి అహంకారము లు.3,. జ్ఞానేంద్రియములు 5., కర్మేంద్రియములు 5,. మహా భూతములు 5,. ఇంద్రియ విషయాలు 5,., ఈ 23. తత్వాల పిండరూపమైన శరీరము ప్రకృతి గుణముల కార్యము కాబట్టి ఈ త్రిగుణములే ఉత్పత్తి కారణములు. దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ గుణములను అధిగమించిన పురుషుడు జన్మ ,మృత్యు ,జరా, దుఃఖములనుండి విముక్తుడై పరమానందము పొందును.
త్రిగుణాతీతుని లక్షణములు
అర్జునుడు--ఓప్రభూ
ఈ త్రిగుణములకు అతీతుడైన వాని లక్షణములు, వాని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడుఅగుటకు ఉపాయమేమి? అని ప్రశ్నించగా!.
భగవానుడు ఈ విధముగా తెలియజేస్తున్నాడు. 
ఓ పాండవా!,
సత్వగుణ కార్య, రూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు. అనగా ఎల్లప్పుడూ ఓకే స్థితిలో ఉండును.
గమనిక--: సచ్చిదానంద ఘన పరమాత్మ యందు నిత్యము ఏకీభవ స్థితుడై ఉన్న పురుషుడు మాయారూపమైన జగత్తునకు సర్వదా అతీతుడై యుండును. అట్టి గుణధీరుడైన పురుషుని అభిమానులహితమైన అంతఃకరణమునందు త్రిగుణములు కార్యరూపములైన ప్రకాశ ప్రవృత్తి మోహదులవృత్తులు ప్రకటితములైనను కాకున్నను ఏ కాలమునందైనను ఇచ్ఛా,ద్వేషాది, వికారములు కలుగవు. త్రిగుణాతీతుడైన వాని ప్రధాన లక్షణములు ఇవియే.!--:1 త్రిగుణాతీతుడు
నేను నీ వలె (సాక్షి వలె) ఉండును.2. పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై ఆ స్థితి నుండి ఎన్నడును చలించడు.3. స్వస్వరూపమునందే నిరంతరము స్థితిడైయుండును. సుఖదుఃఖములను సమానముగా భావించును.4. మట్టి, రాయి ,బంగారం లయందు సమ భావమునే కలిగి ఉండును అనగా వాటి యందు గ్రాహ్యత్యాజ్య భావములను కలిగి యుండడు. అతడు ధీరుడైన జ్ఞాని. ప్రియా ప్రియములకు గాని, నిందా స్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటి యందు సమస్థితిలోనే ఉండును. 
మానవ మానముల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, సమ భావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కతృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడనబడును. అనన్య భక్తి యోగము  ద్వారా నన్ను (,భగవంతుని)భజించును. ఈ త్రిగుణములకు పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తికి అర్హుడగును.ఏలనన! అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును, సనాతన ధర్మమునకును, ఆఖండానందమునకును నేనే (భగవంతుడే)ఆధారము. అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు..
_______
 శ్రీమద్భగవద్గీతలోని ఈ అంశము ద్వారా సందేశం
నీవు కూడా అనంతశక్తి, అనంత జ్ఞానం, అప్రతిహతమైన ఉత్సాహం నీలో ఉన్నాయని తలుస్తూ నీ శక్తిని బహిర్గతం చేయగలిగితే నీవు కూడా నాలాగే(భగవంతునిలా) అవగలవు అని ఈనాటి యువతరానికి స్ఫూర్తి సూక్తి.
_______
శ్రీమద్భగవద్గీత 14వ అధ్యయములోని శ్లోకముల భావము వ్రాయబడినది
________
కామెంట్‌లు