అంశము
అన్వేషణ-- భగవత్ ప్రాప్తికి ఉపాయాలు
ఊర్ద్వమూల మధ శ్శాఖమ్ అశ్వత్థం ప్రాహుర వ్యయమ్!
ఛందాంసి యస్యపర్ణానియస్తం వేదసవేదవిత్!
ప్రపంచం ఒక వృక్షంతో పోల్చబడింది.*
శ్రీ భగవానుడు పలికెను.---: ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలముగా బ్రహ్మ ముఖ్య శాఖ (కాండము గా) వేదములే పర్ణములు (ఆకులు) గల ఈ సంసార అశ్వత్థవృక్షము (రావి చెట్టు) శాశ్వతమైనది. ఈ సంసార వృక్ష తత్త్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థముల ను ఎరిగిన వాడు. ఈ వృక్షమునకు మూల కారణమైన పరమాత్మ అవ్యయుడు. ఇది అనాదికాలము నుండి అవి చ్ఛిన్నముగా వచ్చుచున్నది. కనుక ఈ సంసారవృక్షమును అవ్యయం అని పేర్కొనుట జరిగెను.
ఈ వృక్షమునకు శాఖారూపమైన బ్రహ్మ వలన ప్రకటితమైనవి వేదములు. అవి యజ్ఞాది కర్మల ద్వారా, ఈ వృక్షము రక్షించి వృద్ధి చేయును. మరియు దాని శోభను పెంచును. కనుక వేదములను పర్ణములని పేర్కొనుట జరిగినది.
భగవంతుని యోగ మాయ వలన ఉత్పన్నమైన సంసారము క్షణభంగురం, నశ్వరం, దుఃఖ రూపము. దీని చింతనమాని, పరమేశ్వరునే నిత్యము, నిరంతరము, అనన్య భక్తితో చింతన చేయుట వేదసారమును ఎరుంగుట అగును.
ఈ సంసార వృక్షమును త్రిగుణములనెడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్ళే విషయ భోగములు. ఈ శాఖలు, చిగుళ్ళు, సర్వత్ర వ్యాపించి ఉన్నవి. మనుషులకు కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసన లనెడివేర్లు, ఊడలు అన్ని లోకములలో క్రింద పైన వ్యాపించి ఉన్నవి. ఇతర ప్రాణులు కేవలము పూర్వకృత కర్మల ఫలములను అనుభవించును. మనుష్యులు మాత్రమే నూతన కర్మలు ఆచరించుటకు అధికారులు.
ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు.ఏలనన ఇది ఆదియు, అంతము, సరియైన స్థితియు లేనిది. కనుక అహంకార, మమకార ,వాసనా రూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమను శస్త్రముతో ఖండించి, అనంతరం ఆ పరమ పదరూపుడైన పరమేశ్వరుని సర్వతో ముఖముగా అన్వేషించవలెను.
నిద్ర నుండి మేల్కొకొని న పిదప స్వప్న ప్రపంచము గోచరము కానట్టే, తత్త్వజ్ఞానము కలిగిన పిదప ఈ సంసార స్వరూపము శాస్త్రంలో వర్ణింపబడిన రీతిగా, కనపడిన విధంగా, వినపడిన ప్రకారంగా గోచరింపదు.
దీనికి ఆది లేదు. అంతము లేదని పేర్కొనబడినది. వాస్తవంగా ఇది క్షణభంగురం ,నశ్వరం, కావున సరి యైన స్థితి లేదు. బ్రహ్మ లోక భోగములు కూడా క్షణికములు. అని భావించి ఈ సంసారము నందలిసమస్త విషయ భోగముల యందు అస్తిత్త్వం, సుఖము ,ప్రీతి, రమణీయత మున్నగునవి లేవని భావించుటయే దృఢవైరాగ్య రూప శస్త్రము.
స్థావర జంగమరూపమైన సంసార చింతనను అనాది కాలము నుండి యు అజ్ఞానము ద్వారా దృఢమైన అహంకార, మమకార ,వాసనా రూపములైన మూలములను త్యజించుటయే సంసారవృక్షమును సమూలముగా ఛేదించుట అగును.
పరమేశ్వరుని నుండి యే ఈసంసార వృక్షము విస్తరించినది. ఆయననే మనన, నిధి ధ్యానాదులు చేయవలెను.
ద్వంద్వములనుండి విముక్తులైన వారు జ్ఞానులు. వారు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. అని భగవానుడు తెలియజేసెను.
నిర్మానమోహా
జితసంగ దోషా అధ్యాత్మ నిత్యా విని వృత్తకామాః!
ద్వం ద్వైర్వి ముక్తాఃసుఖదుఃఖసం జ్ఞైః గచ్ఛంత్య మూఢాః పదమ వ్యయం తత్!
_______
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము*15. లో ని1 నుండి6 శ్లోకముల భావము వ్రాయబడినది
_______
శ్రీమద్భగవద్గీత *వ్యాసములు*14:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి