అంశము --*జీవాత్మవిషయము
(శ్లో)"మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః
మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి!
భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగాఅంటున్నాడు!
ప్రాణి లోకము న ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నాఅంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. దేహస్థితుడైన జీవాత్మను భగవానుడు తన సనాతన "అంశ"గా పేర్కొనెను.
వాయువు వాసనలను ఒక చోట నుండి మరియొక చోటికి తీసుకొని పోయినట్లుగా, జీవాత్మ ఒక శరీరమును త్యజించి నప్పుడు మనసు ఇంద్రియములను గ్రహించి వాటి తో కూడా మరియొక శరీరమును పొందును. అనగా దానిలో ప్రవేశించును.
ఈ జీవాత్మ త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనెడి పంచేంద్రియములను, మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును.
జీవాత్మ శరీరమును త్యజించి నప్పుడును, శరీరమునందు స్థితుడై యున్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడు ను, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును, అజ్ఞానులు తెలిసి కొనలేరు. కేవలం వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన స్వ స్వరూపమును తెలుసుకొనగల్గుదురు.
అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మ తత్త్వమును ప్రయత్నశీలురై తెలిసికొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధిలేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు ఈ ఆత్మను తెలుసుకొన జాలరుఅని-భగవానుడు జీవాత్మ విషయము తెలియజేసెను
భగవానుడు
ఇంకా ఇలా పరమేశ్వరుని ప్రభావ స్వరూప విషయమును వర్ణిస్తూ పలుకుతున్నాడు
సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును, నా తేజస్సేఅని ఎరుంగుము.! పృథ్వి యందు
ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రస స్వరూపుడనై అనగా-- అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికిని పుష్టిని చేకూర్చుచున్నాను. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.
అహం వైశ్వానరో భూత్వా, ప్రాణి నాం దేహమా శ్రితః!
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్!
సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నా నుండి యే స్మృతి, జ్ఞానము, అపోహనము కలుగుచున్నవి. బుద్ధి యందుండు సంశయ విపర్యాది దోషములను వివేచన ద్వారా తొలగించుటను అపోహనము అని అందురు. అంటే క్లుప్తంగా సంశయనివారణం.
వేదముల ద్వారా తెలిసికోనదగిన వాడను నేనే. సర్వ వేదముల సారము పరమేశ్వరుని గురించి ఎరుంగుటయే. కావున సకల వేదముల ద్వారా తెలుసుకునదగినవాడు పరమేశ్వరుడే అని పేర్కొనబడెను. వేదాంత కర్తను, వేదజ్ఞుడను కూడా నేనే.
అని భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మతెలియజేశాడు.
--------------------------------
శ్రీమద్భగవద్గీత
15వ అధ్యాయము లోని
7నుండి15వ శ్లోకముల భావము వ్రాయబడినది
దీని వలన ప్రతి వ్యక్తిలోనూ దివ్యత్వం అవ్యక్తంగా ఉంది. అంతర ప్రవృత్తిని, బాహ్య నడవడిని నియంత్రిస్తూ అంతరాళాల్లోని ఆత్మ శక్తిని వెలికితీయడమే మన లక్ష్యం
_______
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 15: - పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797.!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి