అంశము:-అసుర లక్షణములు
మనకు ఉండకూడనివి, ఉంటే క్రమేపి తగ్గించుకొని, లేకుండా చేసికోవలసినవి. అసుర లక్షణములు ఇవి ఉన్నవారు
1 కర్తవ్యా కర్తవ్యములను ఎరుగరు. బాహ్యాభ్యంతర శుచిత్వం పాటించరు. శ్రేష్టమైన ప్రవర్తన కలిగి ఉండరు. సత్యభాషణము చేయరు. దంభము (కపటము), దర్పము (మొండితనం), అభిమానము, క్రోధము, పౌరుష్యము, (మాటలు, చేతల యందు కఠినత్వం), అజ్ఞానము మొదలగునవి అసుర స్వభావము గల వారి లక్షణములు.
2. వారి భావన.--: ఈ జగత్తునకు ఆధారమైనది ఏది యునులేదు. ఇది అసత్యము. భగవంతుడనెడి వాడు లేనేలేడు, కామ ప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారు. సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదు.
3. వారు మందబుద్ధులు. ఆత్మ యొక్క అస్తిత్వం విశ్వసించరు. అందరికిఅపకారం చేసే క్రూరులు. వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచ వినాశనానికే వినియోగ పడతాయి.
4. దంభము, దురభిమానము, మదము లతో కూడిన వీరుయుక్తాయుక్తములను మరచి తమ వాంఛలను ఏదో ఒక విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుదురు. అజ్ఞాన కారణముగా మిధ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచార్యులై ప్రవర్తింతురు.
5. మరణించువరకును వారు అంతులేని చింతలోనే మునిగి పోవుచుందురు. విషయ భోగా నుభవముల యందే తత్పరులై అదియే నిజమైన సుఖమని భావింతురు.
6. వారు ఆశాపాశా. పరంపరలచే ఎల్లప్పుడు ను బంధింపబడుచుందురు. కామ క్రోధ పరాయణులై ప్రవర్తింతురు. విషయ భోగముల నిమిత్తమై అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు.
7. వారు తలచేది నేను మిక్కిలి పురుషార్దినికనుక ఈ అభీష్ట వస్తువు ను పొందితిని. ఇంకనూ నామనోరధములన్నింటినిసాధించుకొనగలను. ఇప్పటికే నాకడ ఎంతో ధనం ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతో ధనము సంపాదించగలను.
8. నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులను గూడ వధింపగలను. నేనే సర్వాధిపతిని. (ఈశ్వరః) సమస్త భోగములను అనుభవించగలవాడను నేనే. సిద్దులన్నీ నా గుప్పిటలోనే యున్నవి. నేనే గొప్ప బలవంతుడిని "సుఖిని"
9. ""నేనే గొప్ప ధనవంతుడను. మిక్కిలి పరివారం గలవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములు చేయగలను. దానములు ఇయ్యగలను. యధేచ్ఛముగా వినోదింపగలను." ఇలాతలంచుచు, అనుచు, అనేక విధములుగా అజ్ఞానులై, చిత్తభ్రమణమునకులోనై, మోహజాలమునందు చిక్కుకొని అసుర లక్షణములు గలవారు. విషయ భోగములయందే మిక్కిలిఆసక్తులై ఘోర నరకముల యందు పడిపోవుచుందురు.
10. వారు తమకు తామే గొప్ప వారమని భావించుకొనుచు, గర్వోన్మత్తులై ధన దురహంకారములతో కన్ను మిన్ను గానక ప్రమత్తులై, శాస్త్రవేత్తముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞములనా చరించు చుందురు.
11. అహంకారము, బలము ,దర్పము, కామము, క్రోధము,లకు వశులై, ఇతరులను నిందించుచు తమ శరీరముల యందును ఇతరుల శరీరముల యందును అంతర్యామిగానున్న నన్ను (పరమాత్మను)ద్వేషించెదరు.
12. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారం నందు అసురీయోనులోనే నేను (,భగవానుడు) పడవేయుచుందును
13. అర్జునా!
ఈ అసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మయందును అసురీ యోనులనే పొందుచు చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందెదరు. అనగా ఘోరమైన నరకముల యందు పడెదరు.
గమనిక--: ప్రాణులు భగవత్.ప్రాప్తిని పొందుటకు మానవ జన్మ లభించుట ఒక సువర్ణ అవకాశము. అజ్ఞానులు ఈ అవకాశము జారవిడుచుకొని ఘోర నరకము పాలయ్యెదరని తెలిసి కొనవలెను.
అసురీ సంపద బంధహేతువు .కనుక కూడనిది.
భగవంతుని వైపు వెళ్లేలా చేసే ఏ కార్యమైనా సత్కార్యమే అవుతుంది. అదే మన ధర్మం .మనల్ని అధోగతికి చేరేలా చేసే ఏ కార్యమైనా దుష్కార్యమే. అది మన ధర్మం కాదు.
ఎప్పుడుమనం నేను, నాది అనే భావన లేకుండా పని చేస్తామో, అప్పుడే అత్యుత్తమంగా పని చేయగలుగుతాము. ఇతరుల మీద అంత ఎక్కువ ప్రభావాన్ని చూపగలుగుతాము. ప్రపంచం చూసిన గొప్ప గొప్ప మేధావులు అందరూ ఈ నిజాన్ని గ్రహించి పనిచేసి నవారు.
సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు.
-------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము
16లోని4, నుండి 20వ శ్లోకముల భావము వ్రాయబడినది
--------------------------,
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 18:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-944108797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి