శ్రీమద్భగవద్గీత వ్యాసములు 19:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797

 అంశము--.శ్రద్ధ

శ్లో కము-:
సత్త్వాను రూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత!
శ్రద్ధామయోయం పురుషో యోయచ్ఛ్రద్ధఃస ఏవసః!
అర్జునుడు
ఓ శ్రీకృష్ణా! శాస్త్ర విధిని త్యజించి, భక్తిశ్రద్ధలతో యజ్ఞములను గాని, దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ట (వారివిధానము) ఎటువంటిది? అని అడిగెను.
శ్రీ భగవానుడు పలికెను."శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావ జమైన శ్రద్ధ. అనేక జన్మలలో చేసికొనిన కర్మల సంచిత సంస్కారముల నుండి ఉత్పన్నమైన శ్రద్ధను స్వభావజమైన శ్రద్ధ అని అందురు. ఇది సాత్త్వికము, రాజసము,  తామసము అని మూడు రకములు.(3 విధములు).
మనుష్యులందరికి శ్రద్ధ, వారి అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉండును. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధఉండనే ఉండును. అతని జీవన విధానమంతయు వాని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టిశ్రద్ధ కలిగి యున్నదియు తెలిసి కొనవచ్చును. 
సాత్త్వికులు--:దేవతలను 
రాజసులు-యక్షరాక్షసులను,
తామసులు-ప్రేత భూత గణములను! పూజించెదరు.
దంభము ,అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండు వారు, బల గర్వితులైన వారు, శాస్త్ర విరుద్ధముగా మనః కల్పితమైన ఘోరతపస్సులను ఆచరించుచు._
 అజ్ఞానులైన అసుర స్వభావం గల వారియందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడైన నన్ను కృశింపజేయువారు(శాస్త్ర విరుద్ధమైన ఉపవాసా ది ఘోరములైన ఆచరణముల ద్వారా శరీరమును కృశింపజేయుట, భగవదంశ యైన జీవాత్మను కష్ట పెట్టుట, భూత  సముదాయమును,  అంతర్యామి యైన పరమాత్మను క్లేశముల పాలు చేయుటయగును)
అజ్ఞానులైన అసుర స్వభావం గల వారిని యెరుంగుము.
* ఆహారము--:
మనుష్యుల స్వభావముననుసరించి వారి ఇష్టములైన ఆహారములు3 విధములుగా ఉండును.
సాత్త్వికుల ఆహారము
ఆయువు ,బుద్ధి , బలము, ఆరోగ్యము ,సుఖము, ప్రీతి మున్నగువానిని అభివృద్ధి పరిచేవి.
రస్యాః-పాలు ,చక్కెర మొదలగు రసపదార్ధములు..
స్నిగ్ధాః--వెన్న నెయ్యి
స్థిరాః--: శరీరమునందు చాలా కాలము స్థిరముగా ఉండు సారము గల భోజన పదార్థములు, ఓజస్సును అభివృద్ధి పరచేవి. అన్నము ,కూరలు, రొట్టె మొదలైనవి. 
హృద్యాః--: సహజముగా మనస్సుకు ప్రీతికరములైనవి..
2రాజస స్వభావము కలవారికి
చేదు, పులుపు, ఉప్పు, కారము, రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు ,దాహం కలిగించునవి. అట్లే దుఃఖము చింత రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్ధములు వీరికి ఇష్టము.
3 తామస స్వభావము గల వారికి
అర్థ పక్వాలు,(సరిగా ఉడకనివి ,పండనివి)., రసహీనములు, దుర్గంధ యుక్తములు, (చెడువాసనగలవి), ఎంగిలివి, అపవిత్ర పదార్థాలు  మొదలైనవి వీరికి ఇష్టము.
2 యజ్ఞము
1. సాత్వికము -
శాస్త్రోక్తం, ఈ యజ్ఞం నాకు కర్తవ్యం అని మనస్సున దృఢంగా నిశ్చయించుకొనబడినదిప్రతి ఫలాపేక్ష లేకుండా చేయునది.
2. రాజసము --: సరి యైన నిష్ట లేకుండ ఆడంబరము కొరకు ఆచరింపబడేది.
ప్రతిఫలాపేక్షతో చేయబడేది. 
3. తామసము--:, శాస్త్ర విధిననుసరింపనిది., అన్నదాన రహితం, మంత్ర హీనం, దక్షిణ లేనిది ,శ్రద్ధారహితం.
3 తపస్సు
1శారీరిక తపస్సు-: దేవతలను, బ్రాహ్మణులను, (వేదం చదివిన వారిని అనగా, వేదజ్ఞులను), గురుజనులను, మాతా పితరులు, ఆచార్యులు, వృద్ధులు, (తనకంటే పెద్దవారు), జ్ఞానులను, సేవించుట. 
శౌచము,( అంతర్, బాహ్య శుద్ధి) నిరాడంబరత్వం, బ్రహ్మచర్యం, అహింస, ఆర్జవము,ఋజుత్వం, మనోవా క్కాయ ములయందు సరళత్వము.
2. వాక్కునకు సంబంధించిన తపస్సు. 
ఉద్వేగం కల్పించనిది, ప్రియమైనది, హితము గూర్చేది, యదార్థమైనది, అగు  ప్రియభాషణం.
వేద శాస్త్ర పఠనం, పరమేశ్వర నామ, జప,సాధన. చదువు (మనంఏమి చదువుకున్నామో అదే.).
3మానసిక తపస్సు
మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవచ్ఛింతన , మనో నిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలైనవన్నియు మానసిక తపస్సులు.
4 సాత్త్వికం
ఫలా పేక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించేవి సాత్విక తపస్సులు. 
5రాజసం
ఇతరుల నుండి సత్కార్యాలు, గౌరవాలు, పూజలు అందుకొనుటకు చేయబడేవి., స్వార్థ ప్రయోజనముల కొరకు చేయబడేవి. క్షణిక ఫలము ఇచ్చునట్లు చేయబడేవి., కార్యసాఫల్యంలో అనిశ్చిత స్థితి. మొదలైన వి రాజస తపస్సులు.
6 తామసం
మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించేవి. ఇతరులకు కీడు కలిగించుటకై చేసేవి. మొదలైనవి తామస తపస్సులు.
4దానం
సాత్విక దానము:--
దానము చేయుటయే "కర్తవ్యం "అను భావముతో ఏ దానము దేశకాల పాత్ర ప్రకారము ప్రత్యుప కారం ఆశింపక నిస్వార్ధ భావముతో చేయబడేది.
దేశ --: తగిన ప్రదేశముల యందు అవసరమగు వస్తువులను సమకూర్చుట.
కాల--: దుర్భిక్షాదికాలముల యందు ఆకలి దప్పులతో బాధ పడేవారు (,పాత్రత), అంగవైకల్యం కలవారు, రోగులు , బలహీనులు, భిక్షువులు,-అన్నవస్త్రములు, ఔషధములు పొందగల పాత్రులు.
అట్లే శ్రీకృష్ణాచరణము గల విద్వాంసులు, వేదం చదివే బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు, వస్తురూప సహాయం పొందగల సేవలు స్వీకరించుటకు పాత్రులు. 
2 రాజసదానం--:
బలవంతము వలన, ఇతరులను భయపెట్టుట వలన, ఇయ్యబడు దానము,. ఇచ్చిన దానమునకు బదులుగా ఏదైనా లౌకిక కార్య లాభము కలుగునని ఆశతో చేసే దానం. గౌరవ ప్రతిష్టలకు, స్వర్గాదులను పొందుటకు, రోగాదుల నివృత్తికి, ఇయ్యబడు దానము.
3తామసదానము
సద్భావం లేకుండా దానం పుచ్చుకొని వారి యెడల గౌరవాదరములు చూపక, తృణీకార భావముతో, దేశ కాలోచితం కాని అయోగ్యులు, అపాత్రులు, చోరులు, జారులు మొదలైన వారికి చేయబడు దానము తామసదానము.
_______
,శ్రీమద్భగవద్గీత
అధ్యాయము
17లోని1నుండి22వ శ్లోకముల భావము వ్రాయబడినది
________

కామెంట్‌లు