అంశము *:త్యాగం
శ్లోకము--:,కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః!
సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహు స్త్వాగం విచక్షణాః!
అర్జునుడు భగవానుని
ఓం మహా బాహూ!అంతర్యామీ! వాసుదేవా!
"సన్న్యాస తత్త్వమును, త్యాగతత్వమును వేర్వేరుగా తెలిసికొనగోరెదను."అని పలికెను.
శ్రీ భగవానుడైన కృష్ణ పరమాత్మ*ఈవిధంగా వివరిస్తున్నాడు
కామ్య కర్మల త్యాగమునే సన్న్యాసమని కొందరు పండితులు తలంతురు.
స్త్రీ ,పుత్ర ,ధనాది ,ప్రియ వస్తుప్రాప్తికిని, సంకటములు, రోగములు మున్నగువాని నివృత్తికి చేయబడు యజ్ఞ ,దాన, తపక్రియలు, ఉపాసనలు మొదలగునవి కామ్యకర్మలు.
కాని విచక్షణా శీలురైన మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను త్యజించుట త్యాగమని పేర్కొందురు.
కాబట్టి త్యాగంలో ఓ భాగం సన్న్యాసం.
భగవద్భక్తి ,దైవ సేవలు, తల్లిదండ్రులను, గురుజనులను, సేవించుట ఇదే దాన తపశ్చర్యలు, వర్ణాశ్రమ ధర్మా చరణములు, శరీర నిర్వహణమునకై ఆచరింపబడిన కర్తవ్యకర్మలు మొదలగు వానివలన లభించునట్టి పరలోక సుఖాసక్తులను త్యజించుట సర్వకర్మ ఫల త్యాగము అందురు.
కొందరు విద్వాంసులు కర్మలన్నియు దోష యుక్తము లే కావున వాటిని త్యజింపవలెనని అందురు. కాని యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యాజ్యములు కావని మరికొందరుఅందురు.
ఓపురుష శ్రేష్టా! అర్జునా,!
సన్న్యాసము త్యాగము అని రెండు విషయములలో మొదట త్యాగం గూర్చి నా నిశ్చయము వినుము.
త్యాగము--: సాత్త్వికం, రాజసం , తామసం అని మూడు విధములు. యజ్ఞ,దాన,త పశ్చర్యాది కర్మలు త్యజింపదగవు . అవి ఆవశ్యకముగా అనుష్టింపదగినవి. ఏలనన ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమొనర్చును. కావున ఓ పార్థా! యజ్ఞ దాన తపోరూప కర్మలను అన్నింటిని ఫలాసక్తులను త్యజించి అవస్యమాచరించవలెను. అనునది ఉత్తమమైన త్యాగం అని నా నిశ్చయా భిప్రాయం.!
శాస్త్ర విహిత కర్మాచరణం మోహ వశమున త్యజించుట తామసత్యాగము అనబడును. కర్మలన్నియును దుఃఖ కారణములే అని భావించి, శారీరక క్లేశానికి భయపడి కర్తవ్యకర్మలను త్యజించుట "రాజస త్యాగము "దీనివలననెట్టి ఫలము లభించదు.
శాస్త్ర విహిత కర్మలను కర్తవ్యములుగా భావించి, వాటి యందలిఫలా సక్తులను త్యజించి, చేయుటయే "సాత్విక త్యాగం".
అకుశ లకర్మలను ద్వేషింపనివాడు, కుశల కర్మల యందు ఆసక్తి లేని వాడు, శుద్ధ సత్త్వగుణ యుక్తుడు, సంశయరహితుడు, బుద్ధిమంతుడైన వాడు "నిజమైన త్యాగి."
కర్మఫలముత్యాగము చేయని మనుషుల కర్మలకైతే మంచి ,చెడు, మిశ్రమం ,అని మూడు విధములగు ఫలములుం డును. మరణానంతరము వాటిని వారు తప్పక అనుభవించి తీరవలెను. కాని కర్మఫల త్యాగులైన కర్మయోగులకు యే విధముగాను అనుభవించవలసిన పని యుండదు. అని శ్రీ కృష్ణ పరమాత్మ త్యాగ తత్త్వమును గూర్చి తెలియజేశాడు.
కావున మనిషి కేవలం త్యాగం ద్వారానే అత్యున్నతమైన స్థితికి చేరే పరిణామాన్ని సాధిస్తాడు. తన తోటి వారి కోసం ఎంతవరకు త్యాగం చేయగలడ
న్న దాన్ని బట్టి మనిషి అంత గొప్పవాడుగా కీర్తించబడతాడు.
-------------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము
18లోని1నుండి12వ శ్లోకముల భావము వ్రాయబడినది
---------------------------------
శ్రీమద్భగవద్గీతవ్యాసములు 21:-పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి