శ్రీమద్భగవద్గీత వ్యాసములు 22: - పి.విఎల్.సుబ్బారావు-,విజయనగరం-9441058797

అంశము: - కర్మసిద్ధి
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా!
కరణం, కర్మ, కర్తేతి త్రివిధః
*కర్మ సంగ్రహః
ఓ మహా బాహూ!
సర్వ కర్మల సిద్ధికి ఐదు హేతువులు గలవని, కర్మలను అంతం చేయు ఉపాయములను తెలుపు సాంఖ్యశాస్త్రమునందు తెలిసికొనుట జరిగినది. వాటి నుండి ఇంకా స్పష్టముగా తెలిపెదనుఅని భగవానుడు పలికెను.
1అధిష్టానము--: కర్మలకు ఆశ్రయమైనది. 
2 కర్త--: చేసెడి వ్యక్తి. 
3 కరణములు--: కర్మలను ఆచరించుటకు ఉపయుక్త మగు సాధనములు.
4 నానా  విధ చేష్టలు-: వివిధ పనులు. 
5 దైవము--: పురా కృత శుభాశుభ కర్మలను, సంస్కారములను దైవం అని అందురు.
మానవుడు మనస్సు, వాక్కు, శరీరముతో ఆచరించు శాస్త్రానుకూలమైన (లేక) విపరీతమైన ఏ కర్మలైనను ఈ ఐదు హేతువులతో ఒప్పుచుండును.
అటు లేనప్పటికిని (సర్వ కర్మలకు ఐదు హేతువులే మూలమైనప్పటికిని) విపరీత బుద్ధి కారణమున ఏ మనుష్యుడు కేవలుడు (నిరంజనుడు), శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించునో అట్టి మలిన బుద్ధిగల అజ్ఞాని యదార్ధమును గ్రహింప లేడు. 
(సత్సాంగత్యం, శాస్త్రాధ్యయనం, భగవదర్థకర్మలు, ఉపాసనలు మొదలగు వాని ద్వారా మనుషుల ఋద్ధులు పవిత్రమగును. ఈసాధనలు చేయువాని బుద్ధిని "ఆకృత బుద్ధి"/ "విపరీత బుద్ధి "అని యుందురు)
ఏ పురుషునకు" నేనే కర్తను"అనుభావము ఉండదో అట్టివాని బుద్ధి ప్రాపంచిక పదార్థముల యందు, కర్మల యందు అంటుకొనదు. అట్టి పురుషుడు ఈ లోకములన్నింటిని హతమార్చి నను వాస్తవముగా చంపినవాడు కాదు. ఇతనికి ఎట్టి పాపములును అంటవు. అగ్ని ,వాయు ,జలముల ద్వారా ప్రారబ్ధవశమున ఏదైనా ఒక ప్రాణికి హింస జరిగినచో అది హింస యనబడదు. అట్లే దేహాభిమానములేకుండ, స్వార్థరహితముగా లోక హితము కొరకు కర్తవ్య కర్మలను ఆచరించు పురుషుని యొక్క శరీరేంద్రియముల ద్వారా లోక సృష్టిలో ఏదైనా ఒక ప్రాణికి హింస  జరిగినచో అది వాస్తవముగా హింస కాదు.ఏలనన అతని కర్మల యందు ఆసక్తి, స్వార్థం, అహంకారం,కర్తృత్వాభి మానముఉండవు. అట్టి కర్మలు వాస్తవంగా అకర్మలు. కావున అట్టి పురుషులకు పాపములు అంటవు.
జ్ఞాత-తెలిసికొనువాడు
జ్ఞానము--తెలుసుకొను రీతి. (సాధన మార్గము)
జ్ఞేయము--తెలియ బడువస్తువు.
అనునవి మూడు విధములైన కర్మ ప్రేరణములు.
"కర్త "--కర్మలను ఆచరించువాడు. 
"కర్మ"--క్రియ (ఆచరింపబడునది)
"కరణము"--సాధనము 
అనునవి మూడు కర్మ సంగ్రహములు.అని శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సిద్ధి గురించి తెలియజేసెను. దీనిని బట్టి మన వర్తమానస్థితికి పూర్వకర్మ లఫలితమైతే మనం పొందగోరేస్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చునని నిశ్చయమవుతుంది. పద్మం వికసించినప్పుడు దానిలోని మకరందం కోసం తేనెటీగలు వాటం తట అవే వస్తాయి. అదేవిధంగా మీలోని  సౌశీల్యం", అనే పద్మాన్ని వికసింప జేస్తే శుభ ఫలితాలు వాటంతట  అవే చేకూరుతాయి.
_______
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము*18
13నుండి18వ శ్లోకముల భావము వ్రాయబడినది
---------------------------
 
కామెంట్‌లు