శ్రీమద్భగవద్గీత వ్యాసములు 25:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797

అంశము: -భక్తి సహిత "నిష్కామకర్మయోగం" 
శ్లోకము--:
సర్వ కర్మాణ్యపి సదా కుర్వాణోమద్వ్యపాశ్రయః!
మత్ప్రసాదాద వాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్!
సమస్త కర్మల యందు కర్తృత్వభావమును వీడి, ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి, నన్నే ఆశ్రయించిన "కర్మయోగి" కర్మలను అన్నింటిని సర్వదా చేయుచును, నా అనుగ్రహము చే సనాతనమైన శాశ్వతమైన పరమపదమును పొందును.
సర్వ కర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధి రూపయోగము అవలంబించి, మత్పరాయుణుడవై సతతము చిత్తమును నా యందే నిలుపుము. 
పైన తెలుపబడిన విధముగా నా యందు చిత్తమును నిలిపినచో నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండియు అనాయాసముగా బయటపడగలవు. ఒకవేళ అహంకార కారణమున నా వచనములను పెడచెవిన పెట్టిన చో నష్టముల పాలగుదువు. అనగా పరమార్థ పదము నుండి భ్రష్టుడవగుదువు. అహంకారావశమున నేను యుద్ధమును చేయను అని నిశ్చయించుకొనుట వృధా! ఏలనన నీ స్వభావమే యుద్ధము చేయుటకు నిన్ను పురి కొల్పును.
*ఓ అర్జునా! కౌంతేయా!*మోహ ప్రభావమున నీవు చేయుటకు ఇష్టపడని కర్మను కూడా నీ పురాతకృత స్వాభావిక (క్షత్రియ స్వభావం) కర్మలచే సంస్కారములచే బంధింపబడి, తత్ప్రభావమున నీవు అవశుడవై  చేయుదువు.
*అర్జునా!*శరీర రూప యంత్రములను అధిరోహించిన సర్వప్రాణుల హృదయములయందు అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి కర్మలను అనుసరించి భ్రమింప చేయుచున్నాడు. !
ఓ అర్జునా! అన్ని విధములుగ ఆ పరమేశ్వరునేశరణు జొచ్చుము. సంపూర్ణ శరణాగతి-లజ్జ ,భయము, దుర భిమానము, గౌరవం, ఆసక్తి మొదలగువానిని త్యజించి, శరీరము లౌకిక విషయములయందు, అహంకార మమకారములు వదిలి, కేవలం పరమాత్ముడు ఒక్కడే పరమాశ్రయుడు, పరమగతి, సర్వస్వము అని భావించుట, అనన్యభావముతో మిక్కిలి భక్తిశ్రద్ధలతో, నిరంతరం భగవంతుని భజన ,స్మరణలు చేయుచు, తదా జ్ఞానుసారము కర్తవ్య కర్మలను నిస్వార్ధ భావముతో కేవలం పరమాత్మ కొరకే ఆచరించుట --"ఇవి అన్నియు సర్వవిధముల పరమాత్ముని పొందుటయగును."అతని కృప చేతనే పరమ శాంతిని ,శాశ్వతమైన పరమపదమును పొందగలవు. ఈ విధంగా అత్యంత రహస్యమైన జ్ఞానం  నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపుము.
సమస్త గోప్య విషయములయందు పరమ గోప్యమైన నా వచనములను మరొకసారి వినుము. నీవు నాకు అత్యంత ప్రియుడవు అగుట వలన నీకు మిక్కిలి హితము గూర్చు వచనములను చెప్పుచున్నాను.
నీవు నా యందే మనస్సును నిలుపుము. నా భక్తుడవుకమ్ము. నన్నే సేవింపుము .నాకు ప్రణమిల్లుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకముగా నేను చెప్పుచున్న మాట.!ఏలనన నీవు నాకత్యంత ప్రియుడవు.
సర్వ ధర్మాన్ పరిత్యజ్య(సర్వధర్మములను అనగాసమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించి) సర్వశక్తి మయుడను, సర్వాధారుడను, పరమేశ్వరుడను అయిన నన్నే శరణు జొచ్చుము. అన్ని పాపముల నుండియు నిన్ను నేను విముక్తుని గావించెదను. నీవు శోకింపకుము. 
అని శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన యోగము యొక్క పరాకాష్టయైన భక్తి సహిత నిష్కామ కర్మ సిద్ధిని పొందు విధమును, తద్వారా మనుష్యుడు బ్రహ్మ ప్రాప్తినొందు రీతిని అర్జునునకు తెలియజేసెను.
దీనిని బట్టి మానవుడు దివ్యుడు. ఆ దివ్యత్వపు జ్ఞాన ఫలితమేవిశ్వాసం! ఆత్మవిశ్వాసం! భగవంతునిపై విశ్వాసం! 
ఇదే ఔన్నత్యానికి రహస్యం. అని తెలుసుకుంటే మహాకార్యాలు సాధించబడతాయి.
---------------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము 18
54నుండి66 శ్లోకముల భావము వ్రాయబడినది
---------------------------------

కామెంట్‌లు