అంశము: నై ష్కర్మ సిద్ధి-- జ్ఞానమహిమ(బ్రహ్మ ప్రాప్తి పొందు రీతి)
శ్లోకము--:
అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః!
నైష్కర్మ సిద్ధిం పరమా సన్యాసేనాధిగచ్చతి!
2.భక్త్యా మామభిజానాతియావాన్యశ్చాస్మితత్త్వతః!
తతోమాంతత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్!
ఓ అర్జునా!
ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడు ను, స్పృహారహితుడును, అంతఃకరణమును జయించినవాడును, అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమ శ్రేష్టమైన నైష్కర్మ సిద్ధిని పొందును.
ఓకౌంతేయా!
జ్ఞాన యోగము యొక్క పరానిష్టయైన నైష్కర్మసిద్ధిని పొందు విధమును తద్ద్వారా మనుష్యుడు బ్రహ్మ ప్రాప్తి నొందు రీతిని సంగ్రహముగా తెల్పెదను వినుము.
1. విశుద్ధమైన బుద్ధి గలవాడై, తేలికైనా సాత్త్వికమైన ఆహారము మితముగా భుజించాలి.
2. శబ్ద, స్పర్శ,రూపాదులైన విషయాలను త్యజించాలి.
3. పరిశుద్ధమైన ప్రదేశంలో ఏకాంతంగా నివసించాలి.
4. సాత్త్విక ధారణ శక్తి ద్వారా అంతఃకరణమును, ఇంద్రియములను సంయమము కలిగి ఉండేటట్లు చేయాలి.
5 మనోవాక్కాయములను అదుపులో ఉంచాలి.
6. రాగద్వేషాలను సర్వదా త్యజించాలి.
7. దృఢమైన వైరాగ్యాన్ని సంపూర్ణంగా ఆశ్రయించాలి.
8. అహంకారము, బలము, దర్పము, కామ క్రోధాలు, పరిగ్రహమునువదిలి పెట్టాలి.
9. నిరంతరమూ ధ్యానయోగ పరాయణుడై ఉండాలి.
10. మమకార రహితుడ వ్వాలి.
11. శాంతి యుతుడై ఉండాలి.
అట్టి పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మమునందు అభిన్న భావముతో పాత్రుడగును. అట్టి
(సచ్చిదానంద పరబ్రహ్మ యందు ఏకీభావ స్థితుడై) ప్రసన్న మనస్కుడైన యోగి,
1దేనికిని శోకింపడు.
2. దేనిని కాంక్షించడు.
3. సమస్త ప్రాణుల యందును సమభావమును కలిగి నా పరాభక్తిని పొందును.
(ఇది తత్త్వజ్ఞానము యొక్క పరాకాష్ట. దేనిని పొందిన పిదప ఇక తెలిసికొనవలసినది ఏమియు మిగలదు. దీనినే పరాభక్తి, జ్ఞాన పరానిష్ట, పరమ నైష్కర్మ సిద్ధి, పరమసిద్ధి మున్నగు పేర్లతో వ్యవహరించుట జరిగినది.)
ఆ బ్రహ్మభూతుడైన యోగి ఈ పరాభక్తి తో నేనెవరినో? నేనెంతటి వాడినో? యథాతథముగా నా తత్త్వమును తెలిసికొనును. ఆ విధముగా భక్తితో నా తత్త్వమును గ్రహించిన వెంటనే (తక్షణమే )నాలో లీనమగును.
ఓ అర్జునా
జ్ఞానమహిమను తెలిపెదను వినుము.
"జ్ఞానము ఉత్తమం". అందుకే ఉత్తమమైన జ్ఞానం తెలుసుకోవాలి. సామర్థ్యమే జ్ఞానం. (Knowledge is Power). అందువలన భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానమే జీవితంలో నిజమైన సామర్థ్యం.
భగవానుడు అంటున్నాడు--: జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానము తెలుసుకునిన మునులు సంసారబంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపాన్ని పొందుదురు. అట్టి పురుషులు సృష్ట్యా ది యందు మరల జన్మింపరు. ప్రళయ కాలమున వ్యధనొందరు.
ఓఅర్జునా!
నామహద్బ్రహ్మరూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. (స్థాపన చేసెదను) ఆ జడ చేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును.
నానా యోనుల యందు జన్మించిన ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయునేను తండ్రిని. అనగా సర్వప్రాణులకు ప్రకృతియే తల్లి నేనే జనకుడను. శ్రీకృష్ణ పరమాత్మ నైష్కకర్మ సిద్ధి,(బ్రహ్మ ప్రాప్తి పొందురీతిని) జన్మ రహస్యము, జ్ఞాన మహత్యమును తెలియజేసెను
కాబట్టిమనం ధన్యులం. మన తల్లి ప్రకృతి. మన తండ్రి భగవానుడు. అందువలన మానవ జన్మ సార్థకం చేసికొని జనన మరణ చక్రము లోనికి పడకుండా మోక్ష ప్రాప్తికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అని తెలుసుకోవాలి లేకుంటే నరజన్మ లభించిన అవకాశం వృధా అయిపోతుంది.
దుర్లభమైన మానవ జన్మను వ్యర్థ పరుచుకోకుండా, దీనిలోని విషయ జ్ఞానము కొంతైనా ఆచరించగలిగితే, మహత్తర శక్తి అయిన పవిత్రమైన జీవనం గడిపిన జన్మ సాఫల్యం, ఆనందమయం, కాగలదు .పరమాత్మ దర్శనం చేసుకోగలుగుతాము. పరమాత్మ సన్నిధికి చేరుకోగలుగుతాము..
-------------------------------
శ్రీమద్భగవద్గీత
అధ్యాయము 18లోని
49నుండి55వ శ్లోకముల భావము, మరియు అధ్యాయము14లో
1నుండి4వ శ్లోకముల భావము వ్రాయబడినది.
---------------------------------
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 26:- పి.విఎల్.సుబ్బారావు-విజయనగరం-9441058797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి