శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 30
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
9.క్రోధాకారాంకుశోజ్జ్వలా(అష్టాక్షరీ)
10.మనోరూపేక్షుకోదండా(అష్టాక్షరీ)

పదవ నామ మంత్రము -   ఓం మనోరూపేక్షుకోదండాయై నమః 

ఎడమవైపు క్రింది చేతిలో  "అనురాగము" అనే పాశమును పట్టిన తల్లి, తన కుడివైపు క్రింది చేతిలో "క్రోధము" అనే అంకుశాన్ని వుంచుకుని, ఈ చరాచర జగత్తును పట్టి పీడిస్తున్న దుష్టశక్తులను శిక్షిస్తున్నది. అమ్మ , "తన మనసును చెరుకు గడ విల్లు రూపముగా చేసికుని తన కుడివైపు పై చెతిలో పట్టుకుని వుంది." అటువంటి, జగజ్జననికి నమస్కారము.

మనః + రూపః + ఇక్షు=
                       మనోరూపేక్షు
కోదండః = బాణము
మనోరూపేక్షుకోదండః =
        మనసు అనే చెరుకుగడ విల్లు

మనోరూపేక్షుకోదండా : మనసు అనే చెరుకు విల్లును, పరమేశ్వరి తన ఎడమవైపు ఉన్న పై చేతిలో పట్టుకుని తన భక్తులను అనుగ్రహిస్తున్నది. "మనసు" కనపడనిది - చెరుకు గడ - కనిపించేది - చెరుకు రసం లోని తీయదనం కారణ రూపము. లలితా పరాభట్టారక తన మనసులోని మమతను, మాధుర్యాన్ని తీయని మధురమైన ధారలుగా తన భక్తులకు అనుగ్రహించడానికి చెరుకు విల్లును పట్టుకుని దర్శనం ఇస్తోంది, అమ్మ. మనలను కన్న తల్లి మనసే వెన్న లాగా సుతిమెత్తగా వుంటుంది కదా. మరి మన అమ్మను కన్న పరమేశ్వరి అయిన జగన్మాత మనసు ఇంక ఎంత కరుణా రస పూరితమై వుంటుందో కదా. అందుకే అమ్మ చెరుకు గడను విల్లుగా చేసుకుంది

చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు - జ్ఞానేద్రియాలు అలాగే, మాట, చేతులు, పాదములు, పాయువు, జననేంద్రియము - ఇవి కర్మేంద్రియాలు. ఈ పదీ కాక, "మనసు" అనే 11వ ఇంద్రియము కూడా వుంటుంది మనిషికి. ఈ మనసుకు, ఏపని తప్పు, ఏపని ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏదారి మంచిది, ఏదారి చెడ్డది అని తెలుసుకోగల విచక్షణ వుంటుంది. ఈ విచక్షణ యొక్క స్థాయి పూర్వ జన్మల సుకృతముల మీద ఆధారపడి ఉంటుంది.

ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అమ్మ మనసైతే, పరమేశ్వరి చేతిలో ఉన్న చెరుకుగడ విల్లు "క్రియాశక్తి" అవుతుంది. అమ్మ రెండు కనుబొమల మధ్య "ఆజ్ఞాచక్రము" వుండే ఆకారము కూడా విల్లును పోలి ఉంటుంది. ఈ "ఆజ్ఞాచక్రము" లోనే మంచి చెడులను విచక్షణ చేసే జ్ఞాననేత్రం వుంటుంది. ఈ జ్ఞాననేత్రం తెరుచుకోవడానికి అమ్మను ధ్యానం చేయాలి. ఈ ధ్యాన శక్తిని  బట్టి, విచక్షణ శక్తి పెరుగుతుంది. దీని ఆధారంగా మనం కర్మలను చేస్తూ, ఫలితాలను అనుభవిస్తూ వుంటాము. ఈ చేయబడుతున్న కర్మలన్నిటికీ మూలకారణం, అమ్మ మనసు రూపంలో వున్న ఇక్షు ఖండమే. 

అందుకే అమ్మను, "మనోరూపేక్షుకోదండా" అని పిలిచారు వశిన్యాది వాగ్దేవతలు.

జగన్మాతను స్మరించి నమస్కరించేడప్పుడు ఓం మనోరూపేక్షుకోదండాయై నమః అని అనాలి.

"ఓం మనోరూపేక్షుకోదండాయై నమః"అనే నామాన్ని జపం చేస్తే, జీవిత లక్ష్యం చేరుకోగల మార్గము, ధైర్యము తెలుస్తుంది. ఆ లక్ష్యం సిద్ధిస్తుంది.

శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....

...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు