శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 32
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
11.పంచతన్మాత్రసాయకా
                                  (అష్టాక్షరీ)
12. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా 
                                 (షోడశాక్షరీ)
పన్నెండవ నామ మంత్రము - 
ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః 
తన ఎర్రని శరీర కాంతులతో నిండివున్న బ్రహ్మాండము అంతటినీ తనలోనే నిలుపుకున్న పరమేశ్వరిని వశిన్యాది వాగ్దేవతలు "నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా" అని కీర్తించారు. అటువంటి జగజ్జననికి నమస్కారము.
ఈ చరాచర జగత్తును సృష్టి చేసిన పరమేశ్వరి అయిన అమ్మ శరీరము, సహజంగానే "అరుణ" కాంతులతో వెలుగొందుతుంది. అమ్మవారి చెవి పోగులు లేదా కుండలములు "సూర్యచంద్రులు". సూర్య -చంద్ర-అగ్నులు అమ్మవారి మూడు కన్నులు. అమ్మచేత సృష్టించబడిన జగత్తు అంతా అమ్మ శరీర కాంతి వలనే ప్రకాశిస్తోంది. జగన్మాత శరీర కాంతికి, సూర్య చంద్రులు, అగ్నిభట్టారకుడు కారణం కాదు.
అమ్మ పాదాల నుండి ప్రసరిస్తున్న ఎర్రని కాంతికిరణాల కారణంగానే, పగలు సూర్యుడు ప్రకాశవంతంగా వుంటున్నాడు, రాత్రి చంద్రుడు చల్లదనాన్ని, వెన్నెల వెలుగులను కురిపిస్తున్నారు. ఈ జగత్తు మొత్తంలో ఏదైనా ఒక వస్తువు ప్రకాశిస్తోంది అంటే అది అమ్మ శరీర కాంతి వలననే గాని, తన స్వభావం చేత కాదు.
బ్రహ్మాండములు అన్నీ పరమేశ్వరి పాదాల నుండి ప్రసరిస్తున్న ఎర్రని వెలుగు వలన కళకళలాడుతున్నాయి కనుక జగజ్జనని "నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా" అని పిలువబడింది.
తన అనంతకోటి ఎర్రని తేజస్సు లలో బ్రహ్మాండములను ముంచిన పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలాయై నమః అని అనాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు