శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 34
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
13. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా (షోడశాక్షరీ)
14. కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా (షోడశాక్షరీ)
పదునాలుగవ నామ మంత్రము - 
     ఓం కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితాయై నమః 
కురువింద మణి = పద్మరాగ మణి
కురువింద (పద్మరాగ) మణులతో ప్రకాశిస్తున్న కిరీటముతో దర్శనము ఇస్తూ శోభిల్లుతున్న పరమేశ్వరికి నమస్కారము.
ఈ నామంతో జగజ్జనని యొక్క కిరిట వర్ణన చేశారు వశిన్యాది వాగ్దేవతలు.
కురువింద లేక పద్మరాగ మణులు, రావణ గంగ అనే నదిలో కురువింద రాళ్ళనుండి దొరుకుతాయి. ఈ నదిలో పద్మరాగమణులతో బాటు, సౌగంధికాలు, స్ఫటికాలు కూడా దొరుకుతాయి. కానీ, పద్మరాగ మణులు ఉత్తమమైనవి. ఈ పద్మరాగ మణులు, అనురాగము, కామము తమ గుణాలుగా కలిగివుంటాయి. ఈ పద్మరాగ మణులు మంకెనపువ్వు, ఆరుద్రపువ్వు, మందారపువ్వు మొదలైన రంగులలో ఎర్రగా ప్రకాశిస్తూ వుంటాయి.
ధాత , అర్యమ్న, మిత్ర, వరుణ, ఇంద్ర, త్వష్ట, విష్ణు మొదలైన నామాలతో ద్వాదశాదిత్యులు వున్నారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు, మండే గుణము కలవాడు అవడం వలన ఎవరూ కూడా దగ్గరకు రానివ్వలేదు, ఆశ్రయము ఇవ్వలేదు. సూర్యునికి కాంతిని ప్రసాదించింది అమ్మే కదా. ఎవ్వరిచేతా ఆశ్రయము ఇవ్వబడని సూర్యుని పరిస్థితికి జాలిపడి, పద్మరాగ మణులతో ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న తన కిరీటాన్ని ఆశ్రయించి వుండమని, ద్వాదశ ఆదిత్యులనూ అనుగ్రహించింది జగజ్జనని. సూర్యునికి, తనచేతే ఇవ్వబడిన వేడిని భరించడం అమ్మకు ఇబ్బంది అవదు కదా!  అలా అమ్మ యొక్క పద్మరాగ మణికిరిటన్ని ఆశ్రయించడంతో, ద్వాదశ ఆదిత్యుల శోభ, రెండింతలు అయ్యింది.
"కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా" అంటే "పద్మరాగ మణులు వరుసగా పొదగబడిన కిరిటముతో పరమేశ్వరి శోభిల్లుతున్నది" అని అర్థము.
అమ్మా! నీ మాణిక్య కిరీట కాంతులను వివరించడానికి పొలికయే దొరకట్లేదు, తల్లీ. ద్వాదశ ఆదిత్యులకు నెలవైన నీ మాణిక్య కిరీటము మా కన్నులకు పండుగ చేస్తోంది, మాతా! నీ తలలో పువ్వు లాగా ఒదిగిపోయిన నెలవంక, పద్మరాగమణుల ప్రకాశము ప్రతిఫలించడం చేత, మాకు ఇంద్రధనుస్సు లాగా, కనువిందు చేస్తోంది, పరమేశ్వరి.
పద్మరాగ మణులతో ప్రకాశిస్తున్న కిరీటముతో, భక్తులను అనుగ్రహిస్తున్న పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు