శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 35
   వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
14. కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండితా (షోడశాక్షరీ)
15. అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా (షోడశాక్షరీ)
పదునైదవ నామ మంత్రము - 
     ఓం అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయై నమః 
పరమేశ్వరి యొక్క నుదురు లేక లలాటము, అష్టమి తిథి నాటి చంద్రకాంతి కళలతో మెరసి పోతున్నదట. ఆవిధంగా ప్రకాశిస్తున్న నుదురు కలిగిన జగజ్జననికి నమస్కారము.
చంద్రుని కళలు 16 అంటారు, కదా! పాడ్యమి తిథి నుండి పౌర్ణమి / అమావాస్య వరకు 15 కళలు. 16వ కళ, పరమానందానికి, సత్యమైన, నిత్యమైన ఆనందానికి రూపముగా వున్న పరమేశ్వరి. పాడ్యమి నుండి పూర్ణిమ/అమావాస్య వరకు 15 తిథులకు, 15 మంది, అధి దేవతలు వున్నారు. వీరిని "తిథి నిత్యలు" లేదా "నిత్య దేవతలు" అంటారు. జ్వాలా మాలిని, విచిత్ర, సర్వమంగళ, కామేశ్వరీ, భగమాలిని అనే 15 పేర్లతో పిలవబడతారు"తిథి నిత్యలు.
ఈ "తిథి నిత్యలు" కళల రూపంలో వుంటారు. ఈ కళలు పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఎదుగుతూ వుంటాయి. మళ్ళీ, పాడ్యమి నుండి అమావాస్య వరకు తగ్గుతూ వుంటాయి. కురివిందమణులతో ప్రకాశిస్తున్న కిరీటముతో వెలిగిపోతున్న పరమేశ్వరి ఫాల భాగం లో వున్న చంద్రుడు శుక్ల పక్ష అష్టమి నాటికి సగము కళలలతో అర్థ చంద్రాకారములో కనిపిస్తాడు. పౌర్ణమి నాటికి పూర్ణ కళలతో పరిపూర్ణమైన  చంద్రుడు కనబడడు. మళ్ళీ కృష్ణ పక్షంలో అమావాస్య నాడు అమ్మవారి నుదుటిని అలంకరించి వున్న చంద్రుడు కనబడడు. అష్టమి నాటికి చంద్రబింబము అర్ధ చంద్రాకారములో వుండి కురువిందమణి కాంతులలో మెరసి పోతూ కనిపిస్తుంది. శుక్ల పక్ష అష్టమి నాడు, కృష్ణ పక్ష అష్టమి నాడూ చంద్రుడు ఒకేవిధంగా వుంటాడు. అందుకే, "అష్టమి నాటి చంద్రుని - సమచంద్రుడు" అని పిలుస్తారు.
ఇలా అష్టమి నాటి చంద్రుని శోభతో కాంతులీనుతున్న పరమేశ్వరి ఫాల భాగాన్ని చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను, "అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా" అని పిలిచారు.
పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు