శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్- భాగం - 37
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
16. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా (షోడశాక్షరీ)
17. వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా (షోడశాక్షరీ)
పదిహేడవ నామ మంత్రము - 
   ఓం వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికాయై నమః 
స్మర = మన్మధుడు
చిల్లి = కనుబొమల మధ్య భాగము
మన్మధుని యొక్క మంగలమయ శుభ గృహాన్ని బోలిన పరమేశ్వరి ముఖానికి గృహ తోరణాలు గా ప్రకాశిస్తున్న కనుబొమలు కలిగిన జగన్మాత కు నమస్కారము.
మన్మధుడు అంటేనే అందానికి ప్రతిరూపం. ఇక, మన్మధుని ఇల్లు ఎంత అందంగా వుంటుందో, కదా. ఆయింటికి ముఖద్వారం ఇంకెంత సుందరంగా వుంటుందో. ఆ అత్యంత సుందర ముఖద్వారానికి తోరణాలు కడితే, ఆ శోభ ఇంకా ఇంకా పెరుగుతుంది.
పరమేశ్వరి కనుబొమలు ప్రాతః సంధ్య, సాయంసంధ్య ల వలన ఏర్పడ్డాయి. అమ్మ కనుబొమలు మన్మధుని విల్లు లాగా కనిపిస్తున్నాయి. నీలి రంగులో వున్న అమ్మ కనులు ఆ విల్లుకు కట్టిన నార లాగా కనిపిస్తోంది. అమ్మ కనుబొమల మధ్య భాగమును ఎడమచేతితో పట్టుకుని మన్మధుడు విల్లును చేతబట్టి నట్టుగా అనిపిస్తోంది.
అందమైన మన్మధుని ఇంటినిబోలిన అమ్మ ముఖకమలానికి, ఆమె కనుబొమల తోరణము కట్టినట్టు వున్న కన్నులతో కలిసిన అమ్మ ముఖమును చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా" అని పిలిచారు.
మన్మధుని ఇల్లుగా పోల్చబడిన అమ్మ ముఖము ఖచ్చితముగా కామేశ్వరీ కామేశ్వరుల శోభాయమానమైన ఇల్లే. సమస్త జీవరాశుల భయాన్నీ పోగొట్టే జగజ్జననీ, నీ కనుబొమలు, వాటి క్రింద వున్న కళ్ళ తో కలిపి నీ చేతిలో నీవు పట్టుకున్న విల్లు లాగానే మాకు కనిపిస్తోంది. నీవు అన్ని భువనాలకూ కలిగే ఉపద్రవాలను పోగొట్టాలి అనే నిశ్చయంతో వున్నదానివి. అభయంకరివి, కదా!
మనకు ఏ ఆపదా రాకుండా నిరంతరం కాపాడుతున్న, పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు