శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 38
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
17. వదనస్మరమాంగల్య గృహతోరణ చిల్లికా (షోడశాక్షరీ)
18. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా (షోడశాక్షరీ)
పదిఎనిమిదవ నామ మంత్రము - 
   ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనాయై నమః
ముఖకాంతి యొక్క ప్రవాహము అనే సరోవరంలో చలించే మీనములు (చేపలు) వంటి కన్నులు కలిగిన పరమేశ్వరికి నమస్కారము.
ఈ నామము ద్వారా వశిన్యాది వాగ్దేవతలు, అమ్మ యొక్క కన్నుల సౌందర్యాన్ని చెప్తున్నారు. మన్మధుని ధనుస్సు ను మరపించే అమ్మ కనుబొమల క్రింద కాటుక కన్నులు, ఆ ధనుస్సు యొక్క వింటినారి లాగా శోభిల్లు తున్నాయి. చిదగ్నికుండం నుండి అమ్మ ఆవిర్భవిస్తున్నప్పుడు, అగ్నిభట్టారకుని తేజస్సు వలన, అమ్మకు నేత్రములు కలిగాయి. కుడి కన్ను - "ఈ" కారము - "ఇంద్రుడు" అధిష్టాన దేవత. అలాగే, ఎడమ కన్ను - "ఈ" కారము - అధిష్టాన దేవత "విరాట్పురుషుడు".
ప్రకృతి లేదా స్త్రీ యొక్క కన్నులను చేపలతో పోల్చడం కవితా లక్షణాలలో ముఖ్యమైనది. చేపలు ఏవిధంగా కొలనులో ఒకచోట స్థిరంగా వుండకుండా ప్రతీక్షణమూ అటూ ఇటూ తిరుగుతూ వుంటాయో, ఒకానొకప్పుడు ఒకపక్కు తిరిగి అర్ధ చంద్రాకారంలో ఒక్క క్షణం పాటు నిలుస్తాయో, అలాగే, స్త్రీ కన్నులు కూడా నిలకడ లేక తిరుగుతూ వుంటాయి. అప్పుడప్పుడు స్థిరంగా ఒక మూలకు చూస్తూవుంటయి, ఓరకంట చూసినట్టు.
మరి, అమ్మ కన్నులు చేపలైతే సరోవరం ఏది? అంటారా. ఉందండోయ్!! అమ్మ ముఖమే ఎంతో సుందరంగా కనిపించే సరోవరం. త్రిపురసుందరి అందమైన ముఖమే ఒక దివ్యమైన సరస్సు. అందమైన అమ్మ ముఖము అనబడే సరస్సులో, అమ్మ కన్నులు అనే చేపలు, అతిసుందరంగా కదులుతున్నాయి. అందుకే, వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా" అని పిలిచి సేవించారు.
అమ్మ కుడికన్ను చలువతో సూర్యుడు, జగత్తు అంతటికీ ప్రతీ రోజూ వెలుగులు ఇస్తున్నాడు. అమ్మ ఎడమ కన్ను కాంతి తనపైన ప్రతిఫలించడం వలన లోకాలకు చల్లని వెన్నెలల కాంతిని, చల్లదనాన్ని ఇస్తున్నాడు, చంద్రుడు. కనుబొమల మధ్య వున్న మూడవ కన్ను వలన ప్రాతః సంధ్య, సాయంసంధ్య లు ఏర్పడుతున్నాయి. అమ్మ చూపుల వలననే, పూటలు, రోజులు, పక్షాలు, నెలలూ, ఇలా కాలచక్రం అంతా ఏర్పడుతోంది. కానీ, అమ్మ తాను మాత్రం ఈ కాలచక్ర గతికి అతీతురాలు.
అమ్మ కన్నుల కాంతి ప్రసరించడం వల్లనే, సర్వోత్కృష్టమైన విజయనగరం వంటి ఎనిమిది పురాలు ఏర్పడ్డాయి. చేపలలాగా చంచలంగా వుండే అమ్మ కన్నులు - ఒక కన్ను దయను, కరుణను కురిపిస్తూ తన భక్తులను కాపాడుతోంది - మరొక కన్ను నుండి క్రోధం చూపుతూ తన భక్తులకు, ప్రకృతికీ నష్టం, కష్టం కలిగించే వారిని శిక్షిస్తోంది.
ఇంతటి కరుణామయి అయి కృపాధారలను మనకు అందిస్తూ, ఏ ఆపదా రాకుండా నిరంతరం మనల్ని కాపాడుతున్న, పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు