వినరో భాగ్యము విష్ణు కథలు: (3):- ఎం బిందుమాధవి

 “కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం
స్తువంత: కం కమర్చంత: ప్రాప్నుయూర్మానవాస్సుభం
కో ధర్మ సర్వ ధర్మాణాం భవత: పరమో మత:
కిమ్ జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్”

“ఎవరిని స్తుతించటం వల్ల దు:ఖాలు తొలగి, శుభాలు కలుగుతాయి? పాపాలు తొలగి పవిత్రం అవుతాము? అన్ని ధర్మాలలో ఉత్తమమైన, పావనమైన ధర్మమేది? ఏది జపిస్తే సంసార బంధనాలు తొలగుతాయి?”
“శాస్త్ర ప్రకారం లోకం మొత్తానికి ఏకైక దేవుడు ఎవరు? ఎవరిని ధ్యానిస్తే హృదయంలోని అజ్ఞానం తొలగి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది? అవిద్య తొలగి పోతుంది? ‘పర’ అంటే ఏది పొందాక ఇతరములేవీ అక్కరలేదో అదే పరం. ఆ జ్ఞానమే పరాయణం. అలాంటి పరాయణం గురించి చెప్పమని” అని ధర్మ రాజు భీష్మ పితామహుడిని అడిగిన ప్రశ్నకి..
అప్పటికే నిర్దేశించబడిన ఉత్కృష్టమైన ధర్మాలను పాటిస్తూనే.. భీష్ముడు చెప్పబోయే ధర్మాలని పాటిస్తే సంసార బంధనాలు తొలగుతాయి అని చెప్పాడు.
శ్రీమహావిష్ణువును ఒక్కడిని పట్టుకుని ఆయన్ని అర్చించి, పూజిస్తే మనిషికి ఉన్న పాపాలు తొలగి, జన్మ చక్రం నించి బయటపడి మోక్షం వస్తుంది.
@@@@@
ఆ రోజు టీచర్ నేర్పించిన విష్ణు సహస్రనామ శ్లోకాలు మననం చేసుకుంటూ వచ్చిన రవి, హాల్లో టీవీలో తాతగారు వింటున్న సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం మధ్యలో ఆపి..”తాతగారు నాకు అర్థమయ్యేలా ఇవన్నీ చెప్పగలరా” అని అడిగాడు.
“ఓహ్..నీకు ఆ స్తోత్రాల అర్థం తెలుసుకోవాలని ఉందా? సరే చెబుతా విను” అని తాతగారు ప్రారంభించి..
“నీకు గణితం అర్థం కానప్పుడు..మనసులో భయం, ఆ సబ్జెక్టు అంటే అయిష్టం ఉంటుంది. ఒక సారి తెలుసుకోవటం మొదలు పెట్టాక..ఓష్ లెక్కలంటే ఇంత తేలికా అనుకుంటావు. అంటే నీ మనసులో లెక్కలంటే ఉండే భయం పోయింది అన్నమాట. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే..నిన్న రాత్రి, చీకటిలో సరిగా కనపడక తాడుని చూసి పాము అనుకుని భయపడ్డావు. గట్టిగా అరిచావు. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. అవునా? అంటే తాడుని నువ్వు పాము అనుకోవటంవల్లనే భయపడ్డావు. అమ్మ వచ్చి లైట్ వేసి, తాడుని చేత్తో పట్టుకుని చూపించాక నీలో భయం పోయింది. అంటే వస్తువు గురించిన నిజం తెలిసాక ధైర్యం వచ్చింది. లెక్కలు కూడా అంతే”!
“అన్ని వాస్తవాలని అర్థం అయ్యేలా చేసేది జ్ఞానం..అవునా? ఆ జ్ఞానం.. మనకి విద్య వల్ల కలుగుతుంది. ఆ విద్యే దైవం అనుకో..శ్రీమన్నారాయణుడు అనుకో! సృష్టిలోని విద్య, శక్తి, చైతన్యం అన్నీ భగవంతుడే అయినప్పుడు..ఆయనని నమ్ముకుని ఏకాగ్రతతో ధ్యానిస్తే శక్తి, జ్ఞానం వాటంతట అవే సిద్ధిస్తాయన్నమాట! అదే పరాయణం అంటే!”
“పిల్లలకి చిన్న వయసులో పెద్దల మాట పాటించటం, చదువుకోవడం, ఆటపాటలు, ఇంటి పనుల్లో అమ్మా నాన్నలకు సహాయం చెయ్యటం, స్కూల్ నించివచ్చాక ఇక్కడి వస్తువులు అక్కడ పడేయకుండా..షూస్ షూ రాక్ లో పెట్టటం, పుస్తకాల సంచి అలమరల్లో పెట్టటం, బయట తిరిగి వచ్చాక కాళ్ళు చేతులు కడుక్కోవటం..అనేవి ధర్మాలు.”
“పెద్ద వాళ్లకి తమ తల్లిదండ్రులైన పెద్దలని గౌరవించటం, పిల్లలని సరిగ్గా చూడటం, చదివించటం పరమ ధర్మం. అందరూ తమకి నిర్దేశించిన ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలి. తమ ధర్మం తాము పాటిస్తూ..ఏకైక దైవమైన శ్రీమన్నారాయణుని అర్చిస్తూ ఉంటే వారికి అర్హమైన అన్ని లాభాలు పొందుతారు.”
వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. కాంప్లెక్స్ లో ఉండే వాచ్ మాన్..”అయ్యా మన మూడో ఫ్లోర్ లో ఉండే అయ్యకి మన ఇంటి ముందు యాక్సిడెంట్ అయింది. ఎవరో స్పీడ్ గా స్కూటర్ మీద వచ్చి గుద్దేసి వెళ్లిపోయారు. పక్క ఫ్లాట్ అయ్య అప్పుడు అక్కడే ఉన్నారు. హాస్పిటల్ కి తీసుకెళుతూ, మీకు చెప్పమన్నారు” అని ఇంటర్ కం లో చెప్పాడు.
“చూశావా..ఎవరి ధర్మం వారు పాటిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. ధర్మాచరణ తప్పితే తనకి ఇబ్బంది..ఎదుటి వారికి ఇబ్బంది! స్కూటర్ నడిపే వాళ్లు కొన్ని ధర్మాలు పాటించాలి. ఉదాహరణకి..స్కూటర్ లో అన్ని పార్ట్స్.. అంటే బ్రేక్ అన్నమాట, ఇంజన్ సరిగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఇంజన్ ఆయిల్ ఉందో లేదో చూసుకుని, ట్యాంకులో పెట్రోల్ పోసి, తాళం తీసి స్టార్ట్ చేసి, దాని మీద కూర్చుని హాండిల్ బార్ చేత్తో పట్టుకుని..జనాలని, ఇతర వాహనాలను జాగ్రత్తగా తప్పించుకుంటూ, రాష్ డ్రైవింగ్ చెయ్యకుండా, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ఏ దారిలో పోనిస్తే ఆ దారిలో ప్రయాణించి స్కూటర్ తనని గమ్యం చేరుస్తుంది. అలా అన్నీ సరి చూసుకుని జీవిత వాహనాన్ని నడిపితే గమ్యాన్ని చేరడమే భగవంతుడిని చేరి మోక్షం పొందటం అన్నమాట! ఇప్పుడు అర్థం అయిందా” అన్నారు.
“తమకి నిర్దేశించిన ఏ పని అయినా..అది చదువైనా, ఆటలైనా, దైవ చింతన అయినా..చిత్త శుద్ధితో..నియమం ప్రకారం ధర్మబద్ధంగా చేస్తే అనుకున్న లక్ష్యం సాధించటమే మోక్షం అంటే” అని ముగించారు తాతగారు.
కామెంట్‌లు