శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 41
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా (షోడశాక్షరీ)
21. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా (షోడశాక్షరీ)
ఇరవైఒకటవ నామ మంత్రము - 
  ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయై నమః 
జయము! జయము! శ్రీమాత! ఈ అమ్మ ముఖసౌందర్యాన్ని వర్ణిస్తున్న వశిన్యాది వాగ్దేవతలు ఇప్పుడు అమ్మ శ్రవణేంద్రియాలు, అంటే చెవులను వర్ణిస్తూ "కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా" అని కీర్తించి అమ్మకు అమితమైన ఆనందాన్ని కలిగించారు.
శ్రీమాత! శ్రీమహారాజ్ని ని "కదంబవనవాసిని" అని, "కదంబకుసుమప్రియా" అని కీర్తించడం మనం విన్న విషయమే. రావి, తులసి, కదంబము, మారేడు పారిజాతము - అనే ఈ వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. వీటిలో "కదంబ వృక్షం" జగన్మాతకు ఎంతో ప్రియమైనది.
అమ్మకు ఎంతో ఇష్టమైన కదంబ వృక్షం, కాశీలో మాత్రమే వున్నట్టు చరిత్ర చెపుతోంది. అయితే, ప్రకాశంజిల్లా త్రిపురాంతకం లోనూ, ప.గో.జిల్లా ముక్కామలలోనూ వున్న త్రిపురసుందరి ఆలయములో ఈ కదంబ పుష్ప వృక్షాలు వున్నాయి. త్రిపురాంతకం లో చెరువు గట్టుమీద, ఏకంగా కందబ వృక్ష వనమే వుండేది అని చెప్తారు. జగన్మాతకు ప్రియమైన ఈ కదంబ పుష్పం, ఎర్రని రంగులో సుమారు 8అంగుళాల పొడవైన తొడిమ మీద గుత్తిగా వుంటాయి. ఇటువంటి తొడిమలు కదంబ వృక్షం నిండా ఉంటాయి. వీటిని "దైవ కదంబాలు" అంటారు. సాధారణంగా బయట కనిపించే కదంబాలు, బంతి పూవు పరిమాణంలో వుంటాయి. వీటిని రాక్షస కదంబాలు అంటారు. ఇవి, అమ్మకు ఇష్టమైనవి కావు.
పరమేశ్వరి తన చెవుల పైన కదంబ పూల గుత్తులు ధరించిందట. ఒక కదంబ పూవు కాదు, కదంబ పూల గుత్తి. అంటే అమ్మ చెవులు ఎంతో దృఢంగా ఉండి ఉంటాయి. అమ్మ కుడి, ఎడమ చెవులు "శ్రీ" ఆకారములో వున్న దృఢమైనవి. అందుచేతనే, కందంబ పూల గుత్తులు ధరించి పూర్ణచంద్రబింబము లాగా వెలిగి పోతున్న ముఖముతో, తన భక్తులను అనుగ్రహిస్తోంది.
అమ్మ కుడిచెవిని "ఉ" కారంతోను, ఎడమ చెవిని "ఊ" కారంతోనూ, మంత్ర పఠనంతో వివిధ దేవతలను ఆయా అవయాలవద్ద ఉంచినట్టు భావించి, న్యాసం చేయాలి.  ఇలా అంగన్యాస, కరన్యాసాలతో భక్తిగా తనను ఉపాసించే భక్తులను, జగన్మాత, వారి ఇండ్లను, పరివారాన్ని అత్యంత లక్ష్మీకరముగా చేస్తూ అనంత సౌఖ్యాలనూ ప్రసాదిస్తోంది.
పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు ఓం కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు