శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 43
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
22. తాటంకయుగళీభూత తపనోడుప మండలా (షోడశాక్షరీ)
23. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః (షోడశాక్షరీ)
ఇరవైమూడవ నామ మంత్రము - 
  ఓం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభువే నమః
ఎంతో నునుపుగా, ప్రకాశవంతంగా వుండే పద్మరాగ శిలలను, అద్దాన్ని కూడా తీసిరాజు అనిపించేటటువంటి నున్నన్ని, అందమైన చెక్కిళ్ళను కలిగి వున్న పరమేశ్వరికి నమస్కారము.
పద్మరాగ మణులతో చేయబడిన అద్దము లో తమ ముఖము చూచుకొనిన వారికి, తమ ముఖముఎంతో ప్రకాశవంతంగా, నిర్మలంగా, అందంగా కనిపిస్తుంది. అమ్మ ముఖ చెక్కిళ్ళను చూచినప్పుడు, వశిన్యాది వాగ్దేవతలకు పద్మరాగమణుల అందము ఏమాత్రం ఆనలేదు. వారి మనసు పరవశం చెందలేదు. అందువలన త్రిపురసుందరిని వారు "పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః" అని వర్ణించి వారు తరించారు. జగన్మాత సంతోషపడింది.
స్త్రీల చెక్కిళ్ళను వర్ణించేడప్పుడు కవులు "ఎరుపు రంగు చెక్కిళ్ళు" అనడం వింటుంటాము. పద్మరాగమణులు "పండుదానిమ్మ గింజ" రంగులో "ఎర్రగా" మెరుస్తూ వుంటాయి. ఈ రంగు ప్రేమకూ, అనురాగానికి గుర్తుగా వుంటూ, అవి అందంగా కనిపిస్తాయి. కానీ, అమ్మ నిత్య యవ్వనం కలది కదా. యుక్తవయసులో ఏ స్త్రీ అయినా అతి లావణ్యంగా వుంటారు కదా! అమ్మ పరమేశ్వరి, నిత్యలావణ్యవతీ. అందుకే, అమ్మ కపోలాలు/చెంపలు, పద్మరాగమణులతో చెయబడిన అద్దము కంటే మించిన అందంతో వున్నాయి, అని అమ్మను ప్రత్యక్షంగా చూసిన వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు.
సూర్య చంద్రులు అమ్మ చేవికమ్మలుగా వున్నారు. అమ్మ చెక్కిళ్ళు మిలమిలా నున్నగా మెరసి పోతున్నాయి. వెనుక వున్న చెవి కమ్మలు, ముందు వున్న చెక్కిళ్ళు, అందముగా ఎంతో అతిశయముతో మెరిసిపోయే ముఖము - మొత్తం కలిసి అందగాడైన మన్మధుని రధం చూస్తున్న అనుభూతి కలుగుతోంది.
పరమేశ్వరుడు, దక్షయజ్ఞం లో ఆహుతి అయిన అంబను తిరిగిపొందడానికి తపస్సులో వుంటే, అమ్మను దగ్గర చేయడానికి తన మరుబాణాలు వేసి, పరమేశ్వరుని మూడవకంటి అగ్నికి ఆహుతి అయ్యాడు మన్మధుడు. ఇప్పుడు మళ్ళీ, సూర్య చంద్రులు, చెక్కిళ్ళూ చక్రాలుగా గల అమ్మ ముఖము అనబడే తన మన్మధ రధాన్ని ఎక్కి, అమ్మ యొక్క ఓరచూపులను తన బాణాలుగా చేసుకొని, పరమేశ్వరునిపై ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నట్లు వుంది. అయితే, పరమేశ్వరుడు పరమేశ్వరికి వశమైనా, అది మన్మధుని పనితనంచేత కాదు, అమ్మ యొక్క సౌందర్యాతిశయం చేతనే.
పద్మరాగ మణులు కానీ, అద్దం కానీ, నిరంతరమూ శుభ్రపరచబడాలి. లేకపోతే మసక బారి, మట్టి కొట్టుకు పోయి ప్రతిబింబము సరిగా కనపడదు. కానీ, అమ్మ చెక్కిళ్ళకు ఏ మలినమూ అంటదు. ఆమె నిత్య యవ్వని కదా. పరమేశ్వరి కపోలాలు ఎల్లప్పుడూ నిర్మలంగానే వుంటాయి. అందువలననే, ముజ్జగద్ధాత్రి "పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః" అనబడింది.
అంతటి అందమైన కపోలాలతో, పరమేశ్వరుని తనవానిగా చేసుకున్న  పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు 
ఓం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభువే నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు