శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 45

 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
24. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారీ రదనచ్ఛదా (షోడశాక్షరీ)
25. శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా (షోడశాక్షరీ)
ఇరవైఐదవ నామ మంత్రము - 
  ఓం శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలాయై నమః
శుద్ధవిద్య అంటే శ్రీవిద్య లో వుండే 16 బీజాక్షరముల లాగా ప్రకాశిస్తున్న రెండు దంతవరుసలు కలిగిన పరమేశ్వరికి నమస్కారము.
శ్రీవిద్య యే శుద్ధ విద్య. శుద్ధ విద్య అంటే, నేను - ఇది అనే అజ్ఞానంను పోగొట్టి, జ్నానము వైపు నడిపించేది. బ్రహ్మ జ్ఞానమును కలిగివున్న వారు బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులను దంతములుగా కలిగి ప్రకాశిస్తున్నది పరమేశ్వరి. త్రిపురసుందరిని, షోడశీ మంత్ర స్వరూపిణి అంటారు. షోడశీమంత్రములో 16 బీజాక్షరములు వుంటాయి. షోడశీమంత్రములోని 16 బీజాక్షరములను "శుద్ధ విద్యాంకురములు"గా వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు. షోడశీ మంత్రములోని 16 బిజాక్షరములు, 16 అచ్చులు, 16 హల్లులు కలయికతో ఏర్పడ్డాయి. ఈ 16 జతలు, 32 అయి, అమ్మవారి రెండు పలువరుసలలోనూ, 32 దంతాలు గా, శుద్ధ విద్యాంకురాలు గా ఏర్పడ్డాయి.
మంత్రము ఉచ్ఛారణ అనేది "శబ్దము". శబ్దము అంటే "వాక్కు".   పరబ్రహ్మము ఏమిటి అని దానిని తెలుసుకునే ప్రయత్నం లో "వాక్కు" ను "పరా, విశ్రాంతి, మధ్యమ, వైఖరి" అని  నాలుగు విధాలుగా చెప్పారు. ఏదైనా ఒక పనిని తలపెట్టేటప్పుడు, ఆ ఆలొచన రావడానికి ముందు వున్న స్థితి "పరా వాక్కు"; వచ్చిన ఆలోచన "పశ్యంతీ వాక్కు"; ఆ ఆలోచన ఒక రూపం ధరించే ముందు వున్న స్థితి "మధ్యమ వాక్కు"; ఇంక, ఆ ఆలోచన కార్య రూపం పొందడం "వైఖరీ వాక్కు".
పైన చెప్పినదే విత్తనం మొలకెత్తే విషయంతో, అర్ధం చేసుకోవచ్చు. "పరా" అనేది విత్తనం మొలకెత్తడానికి ముందు వున్న స్థితి. అంటే, విత్తనం, భూమిలో పడి, మెత్తబడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా వున్న స్థితి. "పశ్యంతి" అంటే, మొలక విత్తనం నుండి బయటకు రావడం. అంటే, ఆలోచన మొలకెత్తడం అన్నమాట. అలా విత్తనం నుండి బయటకు వచ్చిన మొలక, వృక్షం గా మారడం "మధ్యమ" స్థితి. ఇంక, ఈ వృక్షానికి పూలు పూయడం, పళ్ళు కాయడం, పరిపుర్ణత చెందడం "వైఖరి" అన్నమాట.
జగన్మాత పలువరుసను, "ద్విజపంక్తి ద్వయము" అన్నారు వశిన్యాది వాగ్దేవతలు. ముందుగా పాలదంతాలు వచ్చి ఊడిపోయాక రెండవ మారు, దంతములు ఏర్పడతాయి. వేదములు, ఉపనిషత్తులు అపౌరుషేయాలుగా బ్రాహ్మణులను ఆశ్రయించి వున్నాయి. బ్రాహ్మణులను "ద్విజులు" అని అంటారు. "ద్విజులు" అంటే, రెండు సార్లు పుట్టిన వారు. తల్లి గర్భం నుండి బయటకు రావడం ఒక జన్మ అయితే, గర్భాష్టమం లో ఉపనయన సంస్కారం జరిపినప్పుడు రెండవ జన్మ అవుతుంది. అందుకే, బ్రాహ్మణులను "ద్విజులు" అంటారు. ఈ ద్విజులు గా పిలువబడే బ్రాహ్మణులు, తాము నేర్చుకున్న వేదములను, ఉపనిషత్తులను తమ శిష్యులకు వాక్కు, అంటే మాట ద్వారా నేర్పారు. ఆ శిష్యులు తమ శిష్యులకు, వారు తమ తమ శిష్యులకు, ఇలా నోటిద్వారా మాటతో నేర్పారు. అందువలన బ్రాహ్మణులు, "విద్యాంకుర స్వరూపులు". వేద స్వరూపిణి అయిన శ్రీమాత "శుద్ధ విద్యా స్వరూపిణి" కనుక శుద్ధవిద్య, వేద విద్యయే.  అందువలన, ద్విజులు అయిన బ్రాహ్మణులు, శుద్ధవిద్యాంకురాకారములు అయ్యారు.
అంతటి శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయముతో వెలుగొందుతున్న పరమేశ్వరిని, పూజించేటప్పుడు 
ఓం శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు