శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 46

 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
25. శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా (షోడశాక్షరీ)
26. కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా (షోడశాక్షరీ)
ఇరవైఆరవ నామ మంత్రము - 
  ఓం కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరాయై నమః
కర్పూరవీటిక = తాంబూలము
భోజనానంతరం తాంబూలం వేసుకోవడం మన మానవులకు చాలా గొప్పగా అబ్బిన అలవాటు. ఈ తాంబూలం వేసుకోవడం వలన మన శరీరం లో జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. తాంబూలం లో వేసే, కవిరి పొడి ( కాచు పొడి), పచ్చి పోక, వక్కపొడి, పచ్చకర్పూరం, ఏలకులు, లవంగాలు, చల్లని మిరియాలు, నాగకేసరములు, జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు, ఎండుకొబ్బరి వంటి సుగంధ ద్రవ్యాల వలన వచ్చే మంచి సువాసన ఎదుటి వారిని ఎంతో ఆకర్షిస్తుంది. నోరు ఎర్రగా పండి అందంగా కనిపిస్తుంది.
ఇటువంటి తాంబూలం వేసుకోవడం వలన ఎర్రగా పండిన పరమేశ్వరి నోటి నుండి వస్తున్న సుగంధ పరిమళము చేత ఆకర్షించబడిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా" అని మనస్ఫూర్తిగా పిలిచి ప్రార్ధిస్తూ..... పరవశించి పోయారు.
తాంబూలం లో వేయబడిన ఘనరూపంలో వున్న "కర్పూరం" ద్రవ రూపంలోకి మారకుండానే వాయు రూపంలోకి మారి అన్ని లోకాలలో విహరించడానికి దోహదపడుతుంది.
అమ్మ జగన్మాత ఈ తాంబూలం వేసుకోవడం వల్ల, నోరు ఎర్రటి ఎరుపురంగు లో కనిపిస్తూ కమ్మటి సువాసనలు వెదజల్లుతూ వుంది. ఈ సువాసనలకు ఆకర్షితులైన తుమ్మెదలు, ఆ వాసన వచ్చిన దారి పట్టుకుని వెళితే వాటికి ముందుగా ఎర్రగా పండిన అమ్మ నోరు కనిపించంది. తరువాత, అమ్మ తలకొప్పు లో వున్న, చంపక, పున్నాగ, అశోక, సౌగంధిక పుష్పాలమీద వాలి, ఆ పరిమళాలను గ్రహించాయి. అమ్మ అనుగ్రహం కోసం ఆరాటపడే భక్తులు కూడా, తాంబూలం యొక్క సువాసన అమ్మ అంతరంగం అయితే, త్రిపురసుందరి యొక్క సహస్రనామములు పారాయణ చేయడం అనే మకరందంను ఆస్వాదిస్తూ, ఈ సహస్రనామ స్తోత్రము అనే సుగంధము ద్వారా అమ్మను చేరుకుంటాడు భక్తుడు.
అమ్మ తాంబూల ప్రసాదం కోసం సామాన్య భక్తులే కాకుండా దేవతా సమూహం కూడా అర్రులు చాచి ఎదురు చూస్తారు. అమ్మ చేతి గోరుముద్దలు పసిపిల్లలకు అమృతం. అదే అమ్మ తన నోటిలో పెట్టుకున్న ముద్దలో కొంత పిల్లవానికి పెడితే అది అమృతాన్ని మించి అత్యంత ఇష్టంగా వుంటుంది పిల్లలకు.
ఒకానొకప్పుడు రాక్షసుల పీడ ఎక్కువ అయినప్పుడు, పరమశివుడు, స్కందుని, ఇంద్రుని, విష్ణుమూర్తిని ఆ దానవుల పని పట్టడానికి పంపుతాడు. సుధీర్ఘమైన యుద్ధం తరువాత గెలుపు స్కంద త్రయానికి దక్కుతుంది. చక్కటి విజయలక్ష్మి తో వచ్చిన స్కంద, ఇంద్ర, విష్ణుమూర్తులను పరమశివుడు గొప్ప గొప్ప కానుకలను ఇచ్చి సత్కరించాలి అనుకుంటాడు, కానీ "శివ ప్రసాదం నందిశ్వరుని సొంతం " అని అనుకున్న ఆ ముగ్గురూ, లోపల హంసతూలికా తల్పము మీద సేద తీరుతూ, తాంబూలం వేసుకున్న పరమేశ్వరి దగ్గరకు వెళ్ళి, తమ కిరీటాలు పక్కన పెట్టి, అమ్మ పాదాలకు నమస్కరించారు. అమ్మ వారిని పలుకరించడానికి నోరు తెరిచింది. వెంటనే, అమ్మ నోటి నుండి తాంబూలపు ముద్దలు క్రింద పడ్డాయి. వెంటనే, మన విజయులు ముగ్గురూ, ఆ తాంబూలము ముద్దుల కోసం పోటిపడి తీసుకుంటారు.
ఈ మూడు భువనాలలోని సకల చరాచర సృష్టికే కాకుండా, ముక్కోటి దేవతలకు కూడా త్రిపురసుందరియే తల్లి కదా! అందువల్ల, ఆ తల్లి ఎంగిలి ముద్ద అందరికీ ఆహ్లాదకరమే. అందరినీ ఉత్తేజపరచేదే.
ఇలా తాంబూలము తినడం వల్ల ఎర్రబడిన నోరు కలిగి, అపరిమితమైన సువాసనలు పంచుతూ లోకాలను పరవశింప జేస్తున్న పరమేశ్వరిని, పూజించేటప్పుడు 
ఓం కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు