శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 47
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
26. కర్పూరవీటికామోద సమాకర్ష ద్దిగంతరా (షోడశాక్షరీ)
27. నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపా (షోడశాక్షరీ)
ఇరవైఏడవ నామ మంత్రము - 
  ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః
సంగీత, సాహిత్యములకు అధిదేవత "సరస్వతి". ఆమె ధరించే వీణ ను "కచ్ఛపి" అని పిలుస్తారు. ఆ కచ్ఛపి అనే వీణ నుండి వచ్చే మధురమైన వీణానాదము కంటే "మృదు మధురమైన కంఠస్వరముతో" సంభాషణ చేసే మధురత్వాన్ని కలిగిన పరమేశ్వరికి నమస్కారము.
విష్ణుమూర్తి ఆయుధాలైన శంఖం, చక్రం, గద, ఖడ్గం, విల్లు లను వరుసగా "పాంచజన్యం, సుదర్శనం, కౌముది, నందకం, శారజ్న్గము" అని, పరమశివుని విల్లును "పినాకము" అని పిలుచుకున్నట్లే; దేవతలు ధరించే వీణలకు కూడా పేర్లు వున్నాయి. యాజ్నవలక్యుని శిష్యుడు "విశ్వావసు" ధరించే వీణను "బృహతి" అని, "తుంబురుని" వీణను"కళావతి" అని, "నారదుని" వీణను "మహతి" అని "సరస్వతి దేవి" వీణను"కచ్ఛపి" అని పిలుస్తారు. ఈ "కచ్ఛపి" వీణ మన దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెంది, ఎక్కువ గా వాడుకలో వుంది. "కచ్ఛపి" వీణకు 24  మెట్లు వుంటాయి. అందువలన ఎక్కువగా స్వర స్థానాలు వుండి వాయుద్యంలో, స్పష్టత, రాగ భావంలో అందం చక్కగా కనిపించి, వినిపిస్తాయి.
వశిన్యాది వాగ్దేవతలు, తమతో అమ్మ మాట్లాడిన మాటలు విన్నప్పుడు, ఆ మాటలలో కచ్ఛపి వీణా గానం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ మాధుర్యం వినిపించింది. అందుకే, అమ్మను "నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపా" అని కీర్తించారు. "నిజసల్లాప" అంటే అమ్మ చేసే సంభాషణ అన్నమాట. "వినిర్భర్త్సిత" అంటే తోసిరాజు/ధిక్కరించిన అని అర్థం.  అంటే, కచ్ఛపి వీణా మాధుర్యాన్ని ధిక్కరించే స్వర మాధుర్యం అమ్మ మాటలలో వుంది, అని వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు. అమ్మ పలుకులలోని మాధుర్యం, తేనె లోని తీయదనాన్ని కాదంటోంది. అమృత బిందువులకన్నా, స్వాతి చినుకులు చేసే శబ్దం కన్నా గొప్పది, అమ్మ మాట.
జగదంబ ఒకరోజు సమస్త దేవీ దేవతలు, వారి గణాలతో సభ చేసింది. అంతటి సభలో, పరమేశ్వరిని ఆనందిపజేయడానికి, సరస్వతి తన వీణ కచ్ఛపిని వాయిస్తూ, పాటలు పాడుతోంది. పరమేశ్వరి కూడా ఆ నాదయజ్నాన్ని ఆస్వాదిస్తూ, తలవూచింది. ఆ తలవూపు చూసిన సరస్వతిని , తన గానం, వీణానాదం అమ్మను తృప్తి పరాచాయి అనే చిన్న గర్వం తో కూడిన భావన ఆవహించింది. కొంత సమయం తరువాత అమ్మ చాలా సంతోషం కలిగింది అని చెప్తూ "సాధు!" "సాధు!" అంటుంది. అంతే! కోకిలమ్మ కంఠం కంటే తీయని కంఠంతో అమ్మ పలికిన ఆ రెండు మాటలు సరస్వతి చెవిలో పడగానే, "నిద్రమత్తు" వదలినట్టు, సిగ్గుపడి, "సరిగ్గా పాడలేనమ్మ, వచ్చిందమ్మా వీణ వాయించడానికి" అనుకుంటారేమో అని, తన చీర చెంగు చాటున దాచిందట కచ్ఛపిని.
అంబ పలికిన "సాధు!" "సాధు!" అనే రెండు మాటలే అంత మధురంగా వుంటే,  తన బిడ్డలైన భక్తులను లాలిస్తూ మాట్లాడితే, మధుర రసధారలే పొంగి ప్రవహిస్తాయి కదా! అమ్మా, నీ కరుణారసపూరిత చూపల కిరణాలలో తడిసి ముద్ద అయ్యే మాకు, నువు మాతో మాట్లాడుతూ వుంటే, వేరే ఏ కోరికా గుర్తు రాదు, తల్లీ!
ఇలా అత్యంత మధురంగా మాట్లాడుతూ, మూడు భువనాలనూ పరవశింప జేస్తున్న పరమేశ్వరిని, పూజించేటప్పుడు 
ఓం నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు