“జగత్ప్రభుం దేవ దేవం అనంతం పురుషోత్తమం
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దు:ఖాతి గోభవేత్
లోకాధ్యక్షం బ్రహ్మణ్యం..లోకానాం కీర్తి వర్ధనం
లోకనాథం మహద్భూతం సర్వ భూత భవోద్భవం
పుండరీకాక్షం..”
ఇవన్నీ శ్రీ మహావిష్ణువుకి ఉన్న అనేక నామాలు. జగత్తుకి ప్రభువు..అంటే ఆయనే అందరి కంటే ఉన్నతుడు, జగాన్ని శాసించేవాడు , దేవతలకు దేవుడు, పురుషులలో ఉత్తముడు, సృష్టి ప్రారంభం నించి అందరికీ,అన్ని విషయాలకి, అవసరాలు తీర్చే నిధి వంటి వాడు, నాశనం లేని వాడు, లోక నాథుడు..అంటే అన్ని లోకాలకు రక్షకుడు, అవిద్యని పోగొట్టి జ్ఞానరేఖలు ప్రసరింప జేసి చీకట్లని పారద్రోలేవాడు, అన్ని జీవరాశులు తానే అయి, వాటిలో చైతన్యం తానే అయిన పుండరీకాక్షుడు.. అంటే కమలముల వంటి కన్నులతో మనలో ఆత్మగా ఉండి మన నిత్య కర్మలని, చర్యలని గమనిస్తూ ఉండి మన కర్మలకి సాక్షి వంటి వాడు, .. అయిన ఆ దేవ దేవుడిని ఎప్పుడు జాగరూకుడవై, రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్న లోపం లేకుండా త్రికరణ శుద్ధిగా అర్చించటమే పరమ ధర్మం అని భీష్ముడు..ధర్మ రాజు ప్రశ్నకి సమాధానం చెప్పాడు.
“తాతగారూ.. నిన్న ధర్మం గురించి, భయాన్ని పోగొట్టే జ్ఞానం గురించి చెప్పారు కదా! ఇప్పుడు దేవుడికి ఉండేమరి కొన్ని గొప్ప లక్షణాలేవో చెప్పి..అలాంటి దేవుడిని ఎలా పూజించాలి అని నాకు అర్థం అయ్యేట్లు చెప్పండి” అన్నాడు రవి..బుద్ధిగా బాసింపట్టు వేసుకుని కూర్చుని.
“నువ్వు నేర్చుకోవాలి అని అంత శ్రద్ధగా అడుగుతున్నప్పుడు చెప్పటం పెద్దవాడిగా నా బాధ్యత. సరే చెబుతా విను.”
“లోకాలని సృష్టించిన వాడు ఆయనే. అంటే ఈ సృష్టిలో మనం చూస్తున్న జీవరాశులన్నీ..అంటే ఈ భూమి, క్రిమి కీటకాలు, పక్షులు, జంతువులు, చెట్టు చేమ, నదులు, గాలి, కొండలు, సూర్య చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, ఖగోళం..ఇలా అవన్నీ మనం, అంటే మనిషి సృష్టించలేదు. కానీ అవన్నీ ఉన్నాయని మనం చూస్తున్నాము.”
“అలాగే చరాచర జీవులన్నిటికీ పరస్పర ఆశ్రయం కల్పించి..క్రిమి కీటకాలు పక్షులకి ఆహారం, భూమిని ఆధారం చేసుకుని పెరిగే చెట్లు ఇచ్చే పంటలు, నదుల్లోని నీరు మనిషికి ఆహారం..ఇలా అన్నిటి అవసరాలు తీర్చేది ఆయనే. ఆయన సూర్యుడి రూపంలో మనిషికి శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. పంటలు పండటానికి అవసరమైన వేడిని తన కిరణాల ద్వారా ప్రసరింపజేస్తాడు. ప్రకృతి విపత్తుల నించి కాపాడుకోవటానికి ఇల్లు కట్టుకోవటానికి అవసరమైన కలప ఇంకా ఇతర సామగ్రిని సమకూర్చేది ఆయన సృష్టించిన చెట్లే కదా. తన కిరణాల తాపాన్ని తట్టుకోలేక బడలి పోయిన వారికి నీడనిచ్చే చెట్టు ఆయనే! భూమి లోని ఖనిజాలు మనం సృష్టించి పెట్టలేదు. అలా లోక నాధుడు..లోక రక్షకుడు, ఉత్తమ నిధి వంటి వాడు అన్నమాట.”
“అంత గొప్ప వాడైన దేవుడిని..నిరంతరం అలసత్వం లేకుండా, ఏకాగ్రతతో, మనసు, వాక్కు, నమస్కార రూపంగా (త్రికరణ శుద్ధి అంటే అదే) ఉత్సాహంగా స్మరిస్తూ ఆయనకి కృతజ్ఞత తెలియచెయ్యటమే మనం చెయ్యవలసిన పరమ ధర్మం. అప్పుడే మన లక్ష్యమైన మోక్షం మనకి లభిస్తుంది.”
“ఉదాహరణకి ఒక ఆటగాడు తను అనుకున్న లక్ష్యం..అంటే అత్యుత్తమమైన ఆటని ప్రదర్శించటం ద్వారా ఒలింపిక్స్ లో పతకం సాధించటం, పోటీల్లో ప్రపంచ కప్పు బహుమతిగా గెలుచుకోవడం కోసం అనుక్షణం తపన పడతాడు. అంత శ్రద్ధ, ఏకాగ్రత, అకుంఠిత దీక్ష తన లక్ష్యం మీద ఉంటేనే అనుకున్నది సాధిస్తాడు. తినేటప్పుడు, తాగేటప్పుడు, మాట్లాడేటప్పుడు..ఆఖరికి నిద్రించేటప్పుడు కూడా తన లక్ష్యం గురించే ఆలోచిస్తూ మనసు లగ్నం చేస్తూ ఉంటాడు. ఏ మాత్రం అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపించినా తన గమ్యం చేరలేడు.”
“అలాగే చదువులో కూడా, తాను అనుకున్న సంస్థలో సీట్ సాధించాలంటే..అనుక్షణం ధ్యాస దాని మీదే ఉండాలి. నిరంతర కృషి, పట్టుదలతో సాధన, అధ్యయనం అవసరం. బద్ధకం, నిర్లక్ష్యం ఉంటే తను అనుకున్నది సాధించలేడు. భగవంతుడి అనుగ్రహం కోసం కూడా అలాంటి తపనే ఉండాలి. మనం చూపే ఏకాగ్రత, భక్తి, అర్చన ఆయన్ని మెప్పిస్తే ఆయన అనుగ్రహం దొరికినట్లే అని భీష్ముడు ధర్మ రాజుతో చెప్పిన మాటల సారాంశం” అన్నారు తాతగారు.
తాతగారు చెప్పింది అర్థమైనట్లు తల ఆడించి, తన హోమ్ వర్క్ చేసుకోవటానికి లేచి వెళ్ళాడు రవి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి