“పరమం యో మహత్తేజ: పరమం యో మహత్తప:
పరమం యో మహద్బ్రహ్మ పరమం య: పరాయణం
పవిత్రాణాం పవిత్రం యో మంగళవారం చ మంగళం
దైవతం దేవతానాంచ భూతానాంయో ఽవ్యయ: పితా”
రవి, పావని పక్క పక్క ఫ్లాటులో ఉంటారు. “విష్ణు సహస్రనామం” ఇద్దరు కలిసే నేర్చుకుంటున్నారు. ఆ ఆన్లైన్ క్లాసు అయ్యాక రవి, పావని కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవటానికి కూర్చున్నారు.
“ఇవ్వాళ శ్లోకాలు నీకు అర్థం అయ్యాయా?”అని అడిగింది పావని.
“నేను రోజు తాతగారితో వాటి గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇహం అంటే మనం మన కళ్లతో చూసే భౌతిక విషయాలు. అంటే మనుషులు, జంతువులు, చెట్లు, పక్షులు, క్రిమి కీటకాలు..అలాగే మన పుస్తకాలు, బట్టలు..ఇంకా ఇంట్లో ఉండే కుర్చీలు, టీవీలు అన్న మాట.”
“పరం అంటే ఈ భౌతిక మైన విషయాలన్నిటికీ అవసరమైన చైతన్యాన్ని ఇచ్చి నిలబెట్టేది, నడిపించేది, కాపాడేది. అదే లేకపోతే ఏది కదలదు, పెరగదు. అదే మనం అనుకునే అల్టిమేట్. దానికంటే ఎక్కువైంది, గొప్పది ఇంకేమీ లేదు. కానీ దాన్ని మనం అనుభవించగలమే కానీ భౌతికంగా చూడలేము. ఎలా అంటే గాలి, వెలుతురు, నీళ్ళల్లో ఉండే జీవ శక్తి..అవి మనం చేత్తో పట్టుకోలేం కదా. అలాగే జీవం లేని చెట్టుకి చిగురు రాదు. పువ్వులు పూయదు. కాయలు కాయదు. కరెంట్ లేనిదే బల్బులు వెలగవు, ఫ్యాన్ తిరగదు, ఏసీ పని చేయదు. కరెంట్ ని మనం చూడలేము కదా! అమ్మ అన్నం వండటానికి ఉపయోగించే గ్యాస్ మనకి కనపడదు కదా! కానీ సిలిండర్ లో గ్యాస్ అయిపోగానే స్టవ్ ఆరిపోతుంది”.
“గ్యాస్ భూమిలో నించి పైకి తీస్తారు. కరెంట్..నీళ్ళల్లో ఉండే శక్తినించి కూడా తయారు చేస్తారు. దాన్ని “హైడల్ పవర్” అంటారు. నీటిలో ఉండే శక్తి అంటే.. అందులో కనబడకుండా ఉండే ఖనిజాలు, లవణాలు. వాటి వల్లనే మనం నీటి బరువు తెలుసుకుంటాం. ఆ శక్తి వల్లనే మనం నీటిలో మునిగిపోవటం కూడా జరుగుతుంది. నీకు తెలుసా ప్రపంచంలో “డెడ్ సీ” అంటే “నిర్జీవ సముద్రం” అనేది ఒకటుందని” అన్నాడు రవి ఆరిందా లాగా.
“అవునా..ఆ ‘డెడ్ సీ’ ఎక్కడ ఉంది? దాని ప్రత్యేకత ఏమిటి?” అని అడిగింది పావని ఉత్సుకతతో తల ముందుకు పెట్టి!
“అది ‘మిడిల్ ఈస్ట్’ లో జోర్డాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉన్నది. దానిలో ఉండే నీళ్ళల్లో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందిట. అందువల్లే ఆ నీళ్లల్లో అసలు మునగరుట..లండన్ లో ఉండే మా కజిన్ వాళ్ళు సెలవుల్లో వెళ్లారుట. వాడే వచ్చి చెప్పాడు. భలే ఆశ్చర్యం కదా! ఇలా మనకి తెలియనివి, తెలిసినా కూడా చూడనివి ఇంకా ఎన్ని ఉన్నాయో” అన్నాడు రవి.
“పరమం యో మహత్తేజ: పరమం యో మహత్తప: అంటే…పైన మనం చెప్పుకున్న అన్నిటిలో ఉండే తేజస్సు, శక్తి కంటే కూడా పై స్థాయి వాడు శ్రీమన్నారాయణుడు. అంటే మనకి ఇంట్లో కరెంట్ సప్లై చేసే ట్రాన్స్ఫార్మర్ కి కరెంట్ సప్లై చేసే పవర్ హౌస్ లాంటి వాడన్న మాట.”
“పవిత్రం అంటే..శుభ్రం చెయ్యటం. అంటే మనం నీళ్ళు తాగే గ్లాస్, టీ తాగే కప్పు, తినే కంచం నీళ్లతో శుభ్రం చేశాకనే వాడుకుంటాం. అవునా? నీటితో కదా శుభ్రం చేస్తాం..ఆ నీటిలో ఉండే శక్తి గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా. అదే పవిత్రం అంటే! మంగళం అంటే..మనకి బాధ, దు:ఖం కలగక పోవటం. అలా పరిశుభ్రం చేసుకోవటానికి అవసరమైన భౌతిక పదార్థాలని, వస్తువులని సమకూర్చేవాడు, వాటిలో శక్తిని నింపేవాడు, అవి నిరంతరం మనకి అందుబాటులో ఉండి సంతోషం కలిగించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు అనే అలౌకికమైన శక్తి అని తాతగారు చెప్పారు. నాకు అర్థమయిందే నీకు చెప్పాను” అన్నాడు రవి.
“సరే..గబ గబా హోమ్ వర్క్ పూర్తి చెయ్యాలి, ఇందాకటి నించి మాట్లాడుకుంటూ ఉంటే టైం గడిచి పోయింది చూసుకోలేదు” అని ఇద్దరూ బుద్ధిగా తమ చదువులో పడ్డారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి