యతస్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే
యస్మించ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే
విష్ణోర్నామ సహస్రం మే శృణుపాపభయాపహం
‘భూత’ అనే పదం కలిగినది, ఉన్నది అని అర్థం. సృష్టి ఉన్నంత వరకు అన్ని చోట్ల, అన్ని సమయాల్లో ఉన్నది, ఉండేది అంటే..దాని ఉనికిని తెలియజేసే శక్తి. ఉదాహరణకి పువ్వు ఉన్నది అంటే దానికి ఒక రూపం, రంగు, సువాసన ఉన్నాయి. అవే మనకి పువ్వు ఉనికి తెలియజేస్తాయి. అలా తెలియజేసేది వాటిలోని ఆ శక్తే!
ప్రళయం వచ్చి సృష్టి అంతా నశించి, జలమయమైనప్పుడు కూడా ఉండే ఏకైక శక్తి నారాయణుడే! మన వేదం ప్రకారం యుగాలు నాలుగు. కృత యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇలాంటి నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. అలా ఒక్కొక్క మహా యుగం తరువాత ప్రళయం వచ్చి ఈ సృష్టి అంతా జలమయమైన తరువాత కూడా ఉండే శక్తి నారాయణుడొక్కడే! ఆ నారాయణుడే మళ్లీ జీవరాశిని సృష్టిస్తాడు.
ఇంతకు ముందు చెప్పుకున్నాం..లోకం అంటే శాస్త్ర జ్ఞానం అని..అలాంటి లోకానికి అంతటికీ..మూలమైన వాడు, ముఖ్యమైన వాడు, సృష్టికి అధిపతి అయిన విష్ణువు యొక్క నామాలు వింటే, స్మరిస్తే భయాలు అన్నీ పోతాయి.
@@@@
“తాత గారు మీరు రోజు రవికి, పావనికి సాయంత్రం కథలు చెబుతున్నారట. ఇవ్వాళ మేము కూడా వింటాం చెప్పరా” అని అడిగాడు అభిరామ్.
“సరే రండి” అని పిలిచి తాతయ్య వాళ్ళందరికీ తలా ఒక బిస్కెట్ ఇచ్చి చెప్పటం మొదలు పెట్టారు.
“మీరు చంద మామ కథలు చదువుతూ ఉంటారు, కామిక్స్ చూస్తూ ఉంటారు అవునా. చంద మామ కథల్లో భూతాలు, దయ్యాలు అని చదువుతూ ఉంటారు. మనలో ఎవరమైనా వాటిని చూశామా? అవి ఎలా ఉంటాయో మనకి తెలుసా? కానీ మనకంటే భిన్నంగా ఉంటాయని, అవి మనకంటే గొప్పవి, మనకి చేతకాని పనులని కూడా తేలికగా చేసేస్తాయని ఒక ఊహ చేస్తాం. అలా చేసిన ఊహతో వాటికి ఒక రూపం..అంటే మనకంటే భిన్నంగా ఉండే రూపాన్ని చిత్రిస్తాము. అవునా అంటే..మన మనసులో ఉండే జ్ఞానం, తెలివి మనకి ఆ ఊహని ఇచ్చాయన్నమాట.”
“మళ్లీ ఆ జ్ఞానం, తెలివి అనేవి అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. ఒకరికి చిత్రలేఖనం, ఒకరికి కథ మరియు సాహిత్య రచన, ఒకరికి శిల్పం, ఒకరికి మట్టితో..కొయ్యతో బొమ్మలు చెయ్యటం, వస్త్రాలు తయారు చెయ్యటం..వాటి మీద బొమ్మలతో అద్దకం పని, మరొకరికి సంగీతం, ఒకరికి ఆటల్లో నైపుణ్యం..ఇలా అందరికీ తలా ఒక రకం ప్రతిభ ఎలా వస్తున్నాయి. పుట్టుకతో వచ్చే ఆ ప్రతిభని సాధనతో పదును పెడతాం. అదే భగవంతుడి శక్తి అంటే!”
“సృష్టిలో రంగు రంగుల పువ్వులు, కాయలు, రుచులు లేకపోతే సృష్టి అందంగా ఉండదు..అవునా? అలాంటి అందాలు మనకి అందించిన దేవ దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పటం మన బాధ్యత.”
“కృతజ్ఞత అంటే మనకి అవి అందించిన వారికి, వాటి వల్ల మనకి కలిగిన ఆనందాన్ని వ్యక్త పరచడమే! ఉదాహరణకి మనం ఫ్రెండ్ దగ్గర పెన్సిల్ తీసుకుని వాడికి thanks అని చెబుతాం. కొత్త షూస్ కొని పెడితే నాన్నకి thanks చెబుతాం. మనకి ఇష్టమైన పదార్థం వండి పెట్టిన అమ్మకి thanks చెబుతాం. మరి ఆ వస్తువులకి, ఆ పదార్థాలకి మూలమైన శక్తిని ఇచ్చిన నారాయణుడికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి, మన ఆనందాన్ని వ్యక్త పరచాలి కదా!”
“మీరు స్కూల్ నించి వస్తుంటే కింద పడ్డారనుకోండి మీరు అప్రయత్నంగా ‘అమ్మా’ అని అరుస్తారు. అంటే అమ్మని తలుచుకుంటే నొప్పి వల్ల కలిగే బాధని ముందుగా అమ్మకి చెప్పినట్టు మీకు తెలియకుండానే భావిస్తారు. అలాగే మీరు కొత్త చోటికి వెళ్ళినప్పుడు, కరెంట్ పోయి చీకటిలో ఒంటరిగా ఉన్నప్పుడు భయపడతారు. తరువాత ఆ సంఘటన తలచుకుని, ఇంకొక సారి భయపడి.. ‘అమ్మా అప్పుడు ఎంత భయపడ్డామో, నిన్ను తలచుకుని నువ్వు మా పక్కనే ఉన్నావని అనుకుంటే కొంచెం భయం పోయింది’ అని అమ్మతో చెబుతారు అవునా? అలాగే భయం కలిగినప్పుడు కొందరు ‘నారాయణా’ అని, కొందరు ‘శివ శివ’ అని తలచుకుంటారు. అంటే ఏదో తెలియని శక్తి మనని కాపాడుతుందని నమ్ముతాం!”
“అదే “విష్ణోరామ సహస్రం మే శృణుపాపభయాపహం” అంటే! ఆయన నామాన్ని ఎప్పుడు తలచుకుంటే ఉంటే మనకి అమ్మ అనే వ్యక్తి ఇచ్చే భరోసా ఆయన ఇచ్చి భయాన్ని పోగొడతాడు అని అర్థం. ఇప్పుడు మీకు దేవుడి లోని ప్రత్యేకత, ఆయన శక్తి, ఆయన ప్రేమ బాగా తెలిశాయా” అని తాతగారు సాయంత్రం వాక్ కి పార్కుకి వెళ్లారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి