వినరో భాగ్యము విష్ణు కథలు: (7):- ఎం బిందుమాధవి
 

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మాన:
ఋషిభి: పరిగీతాని తానీ వక్ష్యామి భూతయె
ఋషిర్ణామ్నాం సహస్రస్య వేదవ్యా:- ఎం బిందుమాధవిసో మహాముని:
ఛందో ఽనుష్ఠుప్ తథా దేవో భగవాన్ దేవకీ సుత:

భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు. అయినప్పటికీ తాను సృష్టించిన ఈ జగత్తుని నిర్వహించటానికి, అవసరాన్ని బట్టి, భక్తుల కోరికలననుసరించి అనేక గుణాలతో వ్యక్తమవుతాడు.
అలా అనేక మంది ఋషులు తమ తపస్సు ఫలితంగా భగవంతుడిని దర్శించి, ఆయన గురించిన అనుభూతి పొంది తత్ఫలితంగా గానం చేయగా ఏర్పడినవే మంత్రాలు. మంత్రాలకు ఒక పద్ధతి, క్రమం అనేవి ఉంటాయి. దాన్ని ఛందస్సు అంటారు. అలాంటి మంత్రాలన్నీ భగవంతుడి గుణాలని ప్రతిపాదిస్తాయి. అలాంటి అనేక మంత్రాలను ఒక చోటికి చేర్చి మనకి అందించిన వాడు వ్యాసుడు.
@@@@
“జీవులు తమ తమ విశేష లక్షణాలతో ప్రఖ్యాతి పొందుతారు. ఒకరిలో ఒక లక్షణమే ఉండదు. అందం, దాన గుణం, విశేషమైన శాస్త్ర జ్ఞానం, కరుణ, సందర్భోచితంగా ప్రవర్తించే ప్రతిభ..ఇలా అనేక లక్షణాలతో ఉన్నప్పుడు..వారి గురించి చెప్పవలసి వస్తే..ఎవరి అనుభవాన్ని బట్టి వారు ఆ వ్యక్తి గురించి ఉటంకిస్తారు.”
“శ్రీ మహావిష్ణువు ఒక్కొక్కరిని అనుగ్రహించేటప్పుడు ఆయన ప్రదర్శించిన ఒక్కొక్క లక్షణాన్ని..అలా అనేక మంది దర్శించిన ఆయన అనేక గుణాలని ఆయన నామాలుగా కీర్తించారు” అని ప్రవచనం వింటున్న తాతగారి పక్కనే కూర్చున్న పిల్లలకి బోలెడన్ని సందేహాలు కలిగాయి.
“అయితే తాతయ్యా..మాకు ఇప్పుడు అర్థమయ్యేట్లు చెబుతావా” అన్నాడు పవన్.
“సరే వినండి..మీరు రామాయణం చదివారు కదా..అందులో రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మ గారిని తనకి మరణం లేని వరం ఇవ్వమనీ,అమరత్వం ప్రసాదించమని కోరాడు. అలా కుదరదు అని బ్రహ్మ అన్నప్పుడు సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల పేర్లు, దేవతలు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులతో సహా అందరి గురించి చెప్పి ..వారి నించి తనకి మరణం రాకూడదు అని అడుగుతాడు. నరుల గురించి గానీ, వానరుల గురించి గానీ నాకు భయమే లేదు..వారు అల్పులు అంటాడు. అలా రాక్షస లక్షణాలతో విజృంభించి ప్రజలని పీడించేవాడి నించి వారిని రక్షించటానికి, అతనని చంపటానికి..రావణుడే మినహాయించిన నర రూపం దాల్చి విష్ణు మూర్తి ఆయనని దండించడానికి రాముడిగా వచ్చాడు.”
“అలాగే హిరణ్యకశిపుడు తనని సంహరించేవాడు ఎలా ఉండాలో చెప్పిన విధంగా నరసింహరూపం ధరించాడు” అన్నాడు తాతయ్య, తన చుట్టూ చేరిన పిల్లలతో!
“ఇంకా వివరంగా చెప్పాలంటే ..గాలిని మనం పవనం, వాయువు, గాలి, మారుతం..ఇలా అనేక పేర్లతో పిలుస్తాం. అలాగే వీడి పేరు పవన్..వాడి పేరు మారుతి. ఆ పేర్లు కూడా లక్షణాలు, గుణాలను బట్టే వస్తాయి. అలాగే అగ్నిని నిప్పు, అనలం, కీలం అని కూడా చెప్పొచ్చు.”
“ఇంకా తేలికగా చెప్పాలంటే..మీ నాన్నని మీరు నాన్న అంటారు. ఆయన తన తల్లికి కొడుకు, మీ అమ్మకి భర్త, తన అక్క చెల్లెళ్లకి, అన్నదమ్ములకి..అన్నయ్య, తమ్ముడు, ఆఫీసులో తన పై అధికారులకి సబార్డినేట్ మాటే క్రింది ఉద్యోగి, తన క్రింద పని చేసే వారికి ఆఫీసరు, తన మిత్రులకి మిత్రుడు, ఎవరికైనా డబ్బు సహాయం చేస్తే దాత, చదువు చెబితే ఉపాధ్యాయుడు, వైద్యం చేస్తే డాక్టరు,..అలా అనేక గుణాలు, లక్షణాలు అన్నమాట. పరిమిత గుణాలు ఉన్న మనుషులకే ఇన్ని పేర్లు ఉంటే మనందరినీ కాపాడి, పెంచి పోషించే దేవుడికి అన్ని పేర్లు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది” అని ముగించాడు తాతయ్య.
“తాతయ్య చెప్పే పద్ధతి భలే ఉంది కదా! రేపు ఇంకేం చెబుతారో” అనుకుంటూ పిల్లలు ఆడుకోవటానికి కింద ఉన్న పార్కుకి వెళ్లారు.
కామెంట్‌లు