అంశము--:
విశ్వకర్త --విభూతి
(భగవంతుని శబ్ద సాక్షాత్కారం)
(భగవానునిఆడియో)
1భగవంతుని గురించి ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకుంటే ఫలం!
ఏతాం విభూతిం యోగంచమమ యోవేత్తి తత్త్వతః!
సోఅవికంపేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయః!*1భగవానుడు దేవతలకు, మహర్షులకు మూల కారణమైన వాడు. అతనిని జన్మ రహితునిగా అనాది యైన వానిగా
లోకమహేశ్వరునిగా తెలిసికొను వాడు మానవులలో జ్ఞాని. అతడు సర్వ పాప విముక్తుడు.
నిశ్చయాత్మక శక్తి ,యధార్థ జ్ఞానము, మోహరాహిత్యము, క్షమ, సత్యము, దమము, (ఇంద్రియనిగ్రహము) శమము (మనో నిగ్రహము) సుఖదుఃఖములు.
ఉత్పత్తి--ప్రళయము, భయము--, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి-అప కీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నియు భగవంతుని వలననే కలుగును.
సప్త మహర్షులు, వారి కంటేను పూర్వులైన సనకాది మహామునులు నలుగురు, చతుర్దశ మనువులు మొదలగు వారందరూ భగవానుని భక్తులే! భగవంతుని సంకల్పము వలననే జన్మించిరి.
ఈ జగత్తునందలి ప్రాణులందరునూ వారి ప్రజలే అని విషయము తెలియము.
భగవంతుని పరమైశ్వర్య విభూతిని, యోగ శక్తి తత్వము (దృశ్యమాత్ర జగత్తు మాయ అని, వాసుదేవుడు సర్వత్రా పరిపూర్ణుడై ఉన్నాడని తెలుసుకొనుట యే తత్వము.) తెలిసి కొన్నవాడు నిశ్చల భక్తియుక్తుడ గును. అను దానిలో ఏమాత్రమూ సందేహమే లేదు.
2భగవంతుడు ప్రసాదించేది:--సమస్త జగత్తు ఉత్పత్తికి వాసు దేవుడే మూల కారణము. వానివలననే జగత్తు అంతయు నడుచుచున్నది. ఈ విషయం బాగుగా ఎరిగిన జ్ఞానులైన వారు భక్తిశ్రద్ధలతో భగవంతునినే సేవింతురు. అతనియందే తమమనస్సులను లగ్నమొనర్చెదరు. తమ ప్రాణములను, కర్మలను సర్వస్వమును అతనికి అంకితమొనర్తురు. వారు పరస్పరం చర్చల ద్వారా భగవంతుని మహిమల గురించి ఒకరికొకరు తెలుసుకొనుచు, కథలు కథలు గా చెప్పుకొనుచు, నిరంతరము సంతుష్టుల గుదురు. భగవంతుని యందు సతతము రమించుచుందురు. అట్టివారికి భగవంతుడు బుద్ధి యోగమును ప్రసాదించును. అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదిస్తాడు. దాని ద్వారా భగవంతుని పొందుదురు. భౌతిక జగత్తులో కూడా ఏది పొందాలన్నా బుద్ధే ప్రధానం.
3 ఓ గొప్పఆడియో
మనిషి అంతఃకరణములో స్థితుడైయున్న భగవానుడు బుద్ధికి దీపమును వెలిగించి అజ్ఞానాంధకారమును పారద్రోలు తాడు.
అర్జునుడు భగవానుని అతని విభూతి గురించి విస్తృతంగా చెప్పమని కోరగా భగవంతుడు స్వయంగా ఇచ్చిన వివరణ అందుకే ఇదో గొప్ప వీడియో.
శబ్దంలో భగవంతుని సాక్షాత్కారం. చదువుచున్నంతసేపు ప్రత్యక్షంగా వింటున్న అనుభూతి. ఆయన జగద్గురువు కాబట్టి భగవంతుడు ఉన్నాడనే విషయానికి,ఆయన ఇచ్చిన వివరణ. ఉదాహరణ--శ్రోతలని మైమరిపిస్తాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
విభూతి యోగము--: 10వ అధ్యాయము
ఓ విధంగా గీతకి మధ్య అధ్యాయము శ్రవణానికి, శరీరము రోమాంచితం అవుతూ ఉంటుంది.
అర్జునా!
నా దివ్య విభూతులు విసృతికి అంతము లేదు. అనంతములు వారిలో ప్రధానమైన వానిలో కొన్నింటిని మాత్రము తెలుపుచున్నాను విను ము.
1సమస్త ప్రాణుల హృదయమునందున్న ఆత్మను నేనే.
2 అదితి యొక్క ద్వాదశ పుత్రులు--ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయస్వరూపులలో సూర్యుడను.49 మంది వాయు దేవతలలో తేజము నేను. నక్షత్రములకు అధిపతి చంద్రుడను నేను.
3. వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులలో చైతన్యము, ఏకాదశ రుద్రులలో శంకరుడు, యక్షరాక్షసులలో ధనాధిపతి కుబేరుడు, అష్ట వసువులలో అగ్నిని నేను, పర్వతాలలో సుమేరువు-- నేనే.
4. పురోహితులలో బృహస్పతి, సేనాపతులలో కుమారస్వామి, జలాశయములలో సాగరుడు-- నేనే
5. మహర్షు లలోభృగువు, శబ్దములలో ఓంకారము
యజ్ఞములలో,
జప యజ్ఞం, స్థావరములలో హిమాలయం --నేనే
6. వృక్షములలో అశ్వత్థము(రావి చెట్టు) దేవర్షులలో నారదుడు , గంధర్వులలో చిత్రరధుడు, సిద్దులలో కపిలముని--నేనే
7. అశ్వములలో పాలసముద్రం నుండి అమృతముతో పాటు పుట్టిన ఉఛ్చైఃశ్రవము,,
భద్ర గజములలో ఐరావతము, మనుష్యులలో ప్రభువు --, నేనే
8. ఆయుధములలో వజ్రాయుధం,,
పాడి ఆవులలో కామధేనువు, శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారకుడు మన్మధుడు, సర్పములలో వాసుకి-- నేనే
9. నాగజాతి వారిలో ఆదిశేషుడు, అనంతుడు, జలచరములకు అధిపతి వరుణుడు, పితరులలో ఆర్యముడు పితృగణప్రభువు) శాసకులలో యమధర్మరాజును-- నేనే!
10. ధైత్యులలో ప్రహ్లాదుడు, గణించు వాటిలో-- క్షణము, ఘడియ, ఘటిక, దినము ,పక్షము, మాసము --మొదలగు వానితో తెలుపుబడే కాలము, మృగములలో మృగరాజు సింహము, పక్షులలో పక్షిరాజు గరుత్మంతుడు-- నేనే
11. పవిత్ర మొనర్చువానిలో వాయువు, శస్త్రధారులలో శ్రీరామచంద్రుడు, మత్స్యములలో మొసలి, నదులలో గంగాదేవి --నేనే
12. సృష్టికి ఆది మధ్యంతములు, విద్యలలో ఆధ్యాత్మిక విద్య, అనగా బ్రహ్మవిద్య, పరస్పర వాద వివాదాలలో తత్వ నిర్ణయమునకై చేయువాదము -నేనే
13. అక్షరములలో "అ"కారం, సమాసములలో ద్వంద్వం", అక్షయ కాలము అనగా మహాకాలము, విశ్వతో ముఖుడైన విరాట్ పురుషుడు, అందరిని ధరించి పోషించు వాడు--నేనే!
14. ప్రాణులను హరించు మృత్యువు, సమస్త ప్రాణులలో ఉత్పత్తి హేతువు --నేనే!
15. స్త్రీలలో కీర్తి ,లక్ష్మి, వాక్కు ,స్మృతి ,మేధా, థృతి, క్షమ-- నేనే!
16. ఈ సప్త దేవతల పేర్లు శ్రీ వాచకాలు. ఇవి రెండు విధములుగా భగవంతుని విభూతులే!
17. గానము చేయుటకు అనువైన శ్రుతులలో బృహత్సామము, చందస్సులలో గాయత్రి, మాసాలలో మార్గశిరము, ఋతువులలో వసంతం--నేనే!
18. వంచకుల లో జూదము (మాయాబజార్" సినిమాలో కృష్ణునికి ఇష్టులైన వారంటే శకుని కనపడతాడు.). ప్రభావశాలుర ప్రభావము, విజేతలలో విజయము, నిశ్చయాత్మకులలో నిశ్చయము, సాత్విక పురుషులలో సాత్విక భావము--నేనే!
19. వృష్టివంశజులలో వాసుదేవుడు (, యాదవ వంశములలో వృష్టి వంశము కూడా ఒకటి.). పాండవులలో ధనంజయుడు, (అనగా నీవే) మునులలో వేదవ్యాసుడు, కవుల లో శుక్రాచార్యుడు--నేనే.
20. శిక్షించు వారిలో దండం (దండించే శక్తి), జయేచ్ఛ గలవారి నీతి, గోప్య విషయ రక్షణమున మౌనం, జ్ఞానుల తత్వజ్ఞానం-- నేనే!
21. సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజం --నేనే.
ఏలనన నేను లేని చరాచర ప్రాణి ఏమియును లేదు
సర్వం విష్ణుమయం జగత్
అని తేల్చి చెప్పాడు.
ఓ పరంతప!
నా దివ్య విభూతులకు అంతమే లేదు. అయితే నేను నా విభూతుల విస్తృతిని గూర్చి నీకు చాలా సంక్షిప్తంగా వివరించితిని. అని పరమాత్ముడు అన్నా పరమాత్మవిభూతి,
వివరించడానికి బహుముఖమైన ఈ వివరణ సరిపోతుంది..
ఆయన జద్గురువు కాబట్టి విషయాన్ని వినే వాడికి వివరించడానికి, అతని హృదయంలో దాన్ని నిక్షిప్తం చేయడానికి తగిన మెలకువలని ఉపయోగించారు. అందుకే ఇలా అంటున్నాడు.
విభూతి యుక్తము
అనగా ఐశ్వర్య యుక్తము., కాంతి యుక్తము, శక్తియుక్తము అయిన వస్తువు ఏదైనను నా తేజస్సు యొక్క అంశమునుండి యేకలిగినదిగా తెలుసుకొనుము.""అని పూర్తి చేస్తూ ఇంకో మాట అన్నాడు.
అధవా! ఓ అర్జునా!
ఇంతకంటెను విపులముగా
తెలుసుకుని ప్రయోజనమేమిటి? అని చక్కగా ప్రశ్నించాడు. ఈ సంపూర్ణ జగత్తు కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశ తోడనే ధరించుచున్నాను అని ప్రవచించిచాడు.
,విభూతి యోగం 10 అధ్యాయం
వినడం చదవడం మననం చేసుకోవడం మనిషికి ఆస్తికత్వ భావనను బలోపేతం చేయడానికి, భగవంతుని విభూతి దర్శించడానికి, భగవత్ తత్వం అర్థం చేసుకోవడానికి, అంతిమంగా భగవంతునితో మమేకం అవడానికి సేతువుగా నిలబడుతుంది.18 అధ్యాయముల గీతా సువర్ణమాలికలో 10వ అధ్యాయము మధ్యలో శమంతక మణి
లా కాంతులీనుతూ ఉంటుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..::..
_______
భగవద్గీత 10వ అధ్యాయం ---విభూతి యోగం 1నుండి42వరకు శ్లోకముల భావము వ్రాయబడినది
________
_______

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి