శ్రీమద్భగవద్గీత వ్యాసములు-- 9-:- పి.విఎల్ సుబ్బారావు-విజయనగరం-9441058797

 భాగము --2
అంశము --విశ్వకర్త-- విశ్వరూప సాక్షాత్కారం
కాలోస్మి లో క క్షయకృత్. ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః!
ఋతేపిత్వాంనభవిష్యంతి సర్వే యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః!
ఓ అంతర్యామీ!
ఈ ధృతరాష్ట్ర పుత్రులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు ,కర్ణుడు, అట్లే మన పక్షమందలి ప్రధాన యోధులు అందరు ను భయంకరమైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతివేగముగా పరుగులు తీయిచూ ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్య పడి  నుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వేలాడుతున్నారు. 
అనేకములైన నదీనదముల ప్రవాహములన్నియు సహజముగా సముద్రమున కభి ముఖముగా ప్రవహించుచు, అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్టులైన సమరయోధులు (నరలోక వీరులు) కూడా జ్వలించుచున్న నీ ముఖముల యందు ప్రవేశించుచున్నారు. మిడుతలన్నియు మోహవశమున బాగుగా మండుచున్న అగ్ని వైపు అతివేగముగా పరుగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ వీరులందరును తమ నాశనమునకై అతివేగముగా పరుగెత్తి నీ వక్రములందు ప్రవేశించుచున్నారు. 
హే విష్ణో!
ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను కబళించుచు అన్ని వైపుల నుండి మాటిమాటికిని ఆస్వాదించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతట ను నిండి జగత్తును తపింపజేయుచున్నవి.
ఓ పరమాత్మా!
నీకు నా నమస్కారములు.  ప్రసన్నుడవు కమ్ము! ఉగ్ర రూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొన గోరుచున్నాను.ఏలనన నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. అని అనిన అర్జునుని మాట విని
శ్రీ భగవానుడు పలికెను---::-
నేను లోకములన్నింటిని తుద ముట్టించుటకై విజృంభించినమహా కాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షాన ఉన్న ఈవీరులెవ్వరు మిగలరు. నీవు నిమిత్తమాత్రుడవు. యుద్ధము చేయుము. కర్తవ్యం నిర్వర్తించుము.
అంత సంజయుడుఅంటున్నాడు--: ఓ రాజా! 
అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ మాటను విని వణుకుచు చేతులు జోడించి నమస్కరించి మిక్కిలి భయముతో గద్గ దస్వరముతో శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.
ఓ అంతర్యామి!*కేశవ!
నీ నామ గుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకు పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారె ల్లరును ప్రణమిల్లుచున్నారు.
*ఓ మహాత్మా!*నీవు సర్వ శ్రేష్టడవు. సృష్టికర్త యైన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక వారు ( సిద్ధులందరును) నీకు నమస్కరించక ఎట్లుండగలరు. ?
ఓ అనంతా, ఓ దేవేశా ఓ జగన్నివాసా!*సత్,--అసత్ నీవే. వాటికంటెను పరమైన అక్షర స్వరూపడవు. అనగాస చ్చిదానందఘన పరబ్రహ్మవు నీవే. ఓఅనంత రూపా!
నీవు ఆది దేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తుకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వ వేద్యుడవు, ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమై యున్నది. నీవేవాయు దేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు. చంద్రుడవు, ప్రజాపతి యైన బ్రహ్మవు. బ్రహ్మకు జనకుడవు, నీకు వేలకొలది నమస్కారములు. మరల మరల అనేక నమస్కారములు.
అనంత సామర్థ్యము గలవాడా!
నీకు ఎదురుగా ముందు నుండి వెనుక నుండి నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! అన్ని రూపాలు నీవే నీ మహిమ ఎరుగుక నిన్ను నా సఖునిగా భావించి, చనువు చేగాని, పొరపాటున గాని, ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ మిత్రా అనుచు  , ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. (అలాపలుకుట జరిగి ఉండవచ్చు).
*ఓ అచ్యుతా!*విహార శయ్యాసన భోజనాది సమయములయందు, ఏకాంతమున గాని, అన్య సఖుల సమక్షమున గాని, సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను  కించపరచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను.ఓ
అనుపమ ప్రభావా! ఈ సమస్త చరాచర జగత్తుకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వ శ్రేష్ఠుడవు, ఈ ము ల్లోకముల యందు ను నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటే అధికుడెట్లుండును?
ఓ ప్రభూ! నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడ వుఅయిన నీవు నా యందు ప్రసన్నుడవగుటకై ప్రార్థించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపును. 
మును పుఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి మిక్కిలి సంతషించితిని. కానీ భయముచేనా మనస్సు కలవర పాటు పొందినది. కనుక  చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపం తోడనే నాకు దర్శన మిమ్ము. దేవేశా! జగన్నివాసా! ప్రసన్నుడవకమ్ము. అని ప్రార్థించెను.
ఓ అర్జునా!
నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ -రూపమును ప్రదర్శించితిని.
వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణల చేతగాని, తదితర పుణ్య కర్మల చేగాని, తీవ్ర తపశ్చర్యల చేతగాని, ఈ మానవలోకమున నా ఈవిశ్వరూపమును నీకు తప్ప మరి యెవ్వరికిని చూడశక్యము కాదు.
నీవు భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లు నా రూపము ను మరల చూడుము అని శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి యై తన కృష్ణ రూపము స్వీకరించి భయపడుతున్న అర్జునుడికి ధైర్యము చెప్పెను.
_______
శ్రీమద్భగవద్గీత వ్యాసములు 9 లోని 2వభాగము విశ్వరూప సాక్షాత్కారము వ్రాయబడినది
_______
11వ అధ్యాయము. ఈ క్రింది శ్లోకము ల భావ ము వ్రాయబడినది.
25to50వరకు
_______

కామెంట్‌లు