ప్రేమ, వేదన, చైతన్యం..గణేష్ 'వర్ణం':- అనిల్ కుమార్ శిఖా- 9010070540

 జీవితం ఒక కాన్వాస్. సప్త వర్ణాల కలబోత.. అది రోజుకో రంగును పులుముకుంటుంది. ఎరుపులో చైతన్యం, పసుపులో ఆశ, ఆకుపచ్చలో నమ్మకం, నీలంలో నిశ్శబ్దం, ఊదాలో ఊహలు. ఇంకా.. కొన్నిసార్లు తెలుపు లాంటి ప్రశాంతత ఉంటుంది.. మరి కొన్నిసార్లు నలుపు లాంటి బాధ ఉంటుంది.. కానీ రంగు లేని రోజు లేదు.. ఈ సత్యాన్ని అవగతం చేసుకున్న ఈ యువ కవి అక్షరాలకు రంగులద్ది కాగితం అనే కాన్వాస్ పై అద్భుతమైన భావాలను సృష్టించారు. పేరు బోణం గణేష్.. వృత్తి పాత్రికేయం, ప్రవృత్తి సాహిత్య సాంగత్యం. ఆయన రాసిన తొలి కవితా సంకలనమే ఈ వర్ణం.
అతనికి ప్రపంచం ఉంది. నాదో ప్రపంచం అంటూ పుస్తకం ముఖచిత్రం మీదే చెప్పేశాడు. అతని ప్రపంచంలో ఎన్నో వర్ణాలు, వాటిలో మరెన్నో భావాలు ఉన్నాయి. గణేష్ పశ్చిమ గోదావరి జిల్లాలోని రామన్నగూడెం అనే ఓ పల్లెటూరిలో పుట్టారు.  గోదావరి గుండెల్లో తీపి గురుతులెన్నో.. అంటూ ఆయన గోదారమ్మ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పచ్చని చేల మధ్య, నిశ్చలమైన కొలను చుట్టూ పూబంతిలా ఉండే మా ఊరు.. అంటూ తొలి పలుకుల్లో తన ఊరిని వర్ణించారు. ‘పచ్చని పొలాల మట్టిలో సాగెను రైతు పయనం.. ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు వందనం..’ అని ఆయన తన కవితల్లో మట్టి వాసన చూపించారు. గణేష్ రాసిన వర్ణం కవితా సంపుటిలో చైతన్యం, ప్రేమ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. సహజంగా కలం యోధుడైన ఆయన ఎన్నో సందేశాత్మక కవితలను ఇందులో పొందుపరిచారు. వృక్షవిలాపం కవితలో పర్యావరణంపై ఆయనకు ఉన్న ప్రేమను వివరించారు. ‘వృక్షవిలాపం లోక వినాశనం.. పూజించు అదే కనిపించే దైవం’ అని ఆయన వివరించారు. ఇది ఒక్కటే కాదు.. విలువైన ఓటు గురించి, మాతృభూమిని పరిరక్షించే వీర సైనికుల గురించి, ఆడవారిపై జరుగుతున్న అకృత్యాల గురించి ఆయన తన కవితల ద్వారా చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. 
వర్ణం కవితా సంపుటి రెండు అధ్యాయాలుగా ఉంది. మొదటి దానిలో భిన్న కోణాలలో రాసిన కవితలు ఉండగా.. రెండో అధ్యాయంలో ప్రేమ భావాల సమాహారంగా సాగింది. ఇందులో మొత్తం 22 కవితలు ఉన్నాయి. అందులో ఆకర్షణ, తపన, వియోగం, ఆనందం, బాధ, ఆశ, నిరాశ.. ఇవన్నీ వివిధ వర్ణాలు గా కనిపిస్తాయి. అందుకేనేమో ఈ కవితా సంపుటికి వర్ణం అని నామకరణం చేసింది. ఇందులో ఒక్కో కవిత పరిశీలిస్తే చాలా లోతుగా ఉంటుంది. ఏమని చెప్పను ఎలా చెప్పను, నీకై వేచి ఉంటాను, నేను విడిపోతున్నా, రాయిలా పడి ఉన్నా.. ఈ కవితలన్నిటిలో ఓ భగ్న ప్రేమికుడి ఆవేదన విరహ వేదన కనిపిస్తుంది. 90వ దశకంలో ఇటువంటి భావావేశం కలిగిన కవితలను విని ఉన్నాం. కాలం మారిపోయింది..  సెల్ ఫోన్ ప్రపంచాన్ని తీసుకు వచ్చి అరచేతిలో పెట్టింది.. ప్రేమలు కనుమరుగయ్యాయి.. స్పందనలు కరువయ్యాయి. అయినా ఇటువంటి కాలంలో గణేష్ రాసిన కవితలు, వాటిలోని ప్రేమ ఆర్ధత చదివించేలా చేస్తాయి. ఏఐ కాలంలో ప్రేమ భావాలను ఇలా కవితల రూపంలో కూర్చడం గణేష్ వంటి అతి కొద్ది మంది యువ కవులకు సాధ్యం అవుతుందోమో..?
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన బోణం గణేష్ లో విభిన్న కళలు ఉన్నాయి. ఓ వైపు పాత్రికేయుడిగా విధులు నిర్వర్తిస్తూనే రచనలు చేస్తున్నారు. రెండు వైపులా అక్షరం సేద్యం కొనసాగిస్తున్నారు. మరోవైపు డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలింలు తీశారు. ఈ క్రమంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘తెలుగు భాష సేవారత్న’ అవార్డును అందుకున్నారు. అభ్యుదయం, ప్రేమ, నిండిన ఆయన కలం నుంచి మరిన్ని రచనలు రావాలి. తెలుగులో యువ కవులకు ప్రేరణగా నిలవాలి. 
==================================

పుస్తకం పేరు :  వర్ణం
రచన            :  బోణం గణేష్
వెల             :  రూ.100
ప్రతులకు      :   అమెజాన్ 
రచయిత       :  9553955798

============

కామెంట్‌లు