మహాకవి
పండితశిరోమణి
పోతనామాత్యుడు—
కవికుల ప్రపంచానికందించిన
ఓ వెలుగుబాట ఓ శుభసందేశమిదే
పలికే కవి పోలననోట కవి పోతనమాట..!
కలం…కాలం…
కవిచేతి కాగడాలై కాంతిని పంచాలని…
భూపతుల కీర్తి కిరీటాల కన్నా...
కవి హలాన్ని…పొలాన్ని…భూఫలాన్ని
కార్చే చెమట చుక్కల్నే నమ్ముకోవాలని…!
తల్లి సరస్వతి సాహితీ వరాలుగా
ప్రసాదించిన అపూర్వ అద్వితీయ
బృహత్ గ్రంథాలను కావ్య ఖండికల్ని
మహారాజులిచ్చే బంగారు హారాలకు
అగ్రహారాలకు ఆశపడి అమ్ముకోరాదని...
కావ్య కన్నికలు కన్నీరు కారుస్తాయని...
పలికే కవి పోలననోట కవి పోతనమాట..!
కష్టించి కండలు కరిగించి...
కందమూలాలు పండించి...
కవి కడుపు నింపుకోవాలని...
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి...
నిస్వార్థ శిఖరంగా నిలిచి ఉండాలని...!
కనక కాంతా కీర్తికాంక్షలు...
కవి నెత్తిన మెరిసే ముళ్ల కిరీటాలని...
విజయశిఖరాలధిరోహించేందుకు...
చరిత్రలో చిరస్థాయిగా నిలిచేందుకు...
విజ్ఞానమే విత్తనమని...
ఆత్మగౌరవమే ఆయుధమని...
పలికే కవి పోలననోట కవి పోతనమాట..!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి