కందనవోలు రాజుకు పెద్ద తలనొప్పి ఒకటి వచ్చి పడింది. ఒక నెలనుంచి తన గదిలో విలువైనవి మాయం కాసాగాయి. అంతఃపురంలో దొంగతనాల గురించి బైటికి చెబితే అందరూ నవ్వుకుంటారు. 'ఇంటినే కాపాడుకోలేని వాడు దేశాన్ని ఏం కాపాడుతాడు' అంటూ తలా ఒక మాట అంటారు. ఎంత నిఘా పెట్టినా దొంగ దొరకడం లేదు. దొంగతనాలు ఆగడం లేదు. రాజు అన్నాక ఎప్పుడూ గదిలోనే వుండలేడు గదా... అనేక పనులుంటాయి... సభకో, వేటకో, యుద్ధానికో, విహారానికో పోయినప్పుడు దొంగతనం జరగుతూ వుంది.
ఒకరోజు రాజు సేనాధిపతితో కలిసి వేటకు పోయాడు. ఇద్దరూ వేటాడి అలసిపోయి ఒక చెట్టు కిందికి చేరారు. అక్కడ ఎవరూ లేరు. సైనికులంతా దూరంగా వున్నారు. ఆ సమయంలో రాజు చిన్నగా సైనికాధికారితో "ఓ సేనాధిపతి... గత కొన్ని నెలలుగా అంతఃపురంలోని నా గదిలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఎంతో నమ్మకమైన భటులు, దాసీలు, రాచ బంధువులు తప్ప ఎవరూ గదిలో అడుగుపెట్టలేరు. వీరిలోనే ఒకరు దొంగ అని తెలిసిపోతుంది. కానీ ఒక్క దొంగను పట్టుకోవడం కోసం అంతమందిని విచారించి వారి మనసులను బాధ పెట్టడం పద్దతి కాదు. అలా అని తెలిసి తెలిసి దొంగనూ వదిలేయగూడదు. పోతున్నవి చిన్నచిన్నవే గదా అని వదిలి పెడితే ఏదో ఒక రోజు ఎంతో విలువైనవి మాయం కావడం ఖాయం. కాబట్టి ఎలాగైనా సరే నువ్వా దొంగని కనిపెట్టాలి. గోడలకు కూడా చెవులుంటాయి అంటారు గదా పెద్దలు. అందుకే రాజభవనంలో కాకుండా నీకీ విషయం ఇక్కడ చెబుతున్నాను" అన్నాడు.
సైనికాధికారి "సరే మహారాజా... నాకు ఒక వారం సమయం ఇవ్వండి" అన్నాడు.
వారం తరువాత సేనాధిపతి రాజుకు ఒక ఎర్రని సంచీ తెచ్చి ఇచ్చాడు. “రాజా... దీనిని మీ గదిలో ఎక్కడైనా ఒక మూలకు కనిపించేటట్టు పెట్టండి. ఆ తరువాత దాని గురించి అసలు పట్టించుకోనట్టు నటించండి. ఎరుపు రంగు చూడగానే ఆకట్టుకుంటుంది. దొంగ కన్ను ఖచ్చితంగా దీని మీద పడుతుంది. ఆ సంచీ దొంగతనం అయిన వెంటనే దొంగ మనకు పట్టుబడతాడు" అన్నాడు.
“ఏముంది సేనాధిపతి ఇందులో" అన్నాడు మహారాజు.
సేనాధిపతి చిరునవ్వు నవ్వి “ఓ వారం రోజులు ఓపిక పట్టండి రాజా. నా ఉపాయం ఫలించి దొంగ పట్టుబడితే అప్పుడు చెబుతాను" అన్నాడు.
రాజు "సరే" అన్నాడు. దానిని తీసుకుపోయి గదిలో అందరికీ కనబడేటట్టు ఒక మూల పెట్టాడు. దాని మీద ఒక కన్ను వేసి వుంచాడు.
పది రోజుల తరువాత ఆ సంచీ మాయమైంది. వెంటనే రాజు సైనికాధికారికి విషయం తెలియజేశాడు.
తరువాత రోజు పొద్దున్నే సైనికాధికారి తలుపు వద్ద కాపలాగా వుండే ఒక భటున్ని పట్టుకొచ్చి “మహారాజా... ఇన్ని రోజులు మిమ్ములను ముప్పు తిప్పలు పెడుతున్న దొంగ వీడే. నాలుగు తన్నేసరికి నిజం ఒప్పుకోవడమే గాక ఇంతవరకు దొంగిలించిన సామానులన్నీ తెచ్చి ఇచ్చాడు" అంటూ రాజభవనంలో దొంగిలింపబడినవన్నీ రాజు ముందుంచాడు.
రాజు చాలా సంబరపడి "వీడు చాలా మంచిగా, నమ్మకంగా వుంటాడే. అయితే అదంతా ఉత్త నటన అన్నమాట. సరే ఇంతకీ వీడే దొంగ అని ఎలా కనిపెట్టావు" అని అడిగాడు.
“మహారాజా... ఆ ఎర్రని సంచీలో అత్తరు నింపిన ఒక పలుచటి గాజు సీసా వుంచాను. కొంచం వత్తిడి చేసినా ఆ గాజు సీసా పగిలి అత్తరు అంతా కింద పడుతుంది. అది అలాంటిలాంటి మామూలు అత్తరు కాదు. దాని సువాసన ఒక్క నిమిషంలో వీధి వీధంతా ఘుమ్మని పాకుతుంది. సంచీ మూత సులభంగా తీయడానికి వీలు లేకుండా గట్టిగా
ముడులు మీద ముడులు వేశాను. దానితో ఈ దొంగ సంచిలో ఏముందో అనే ఆతృతతో ముడి విప్పడానికి దానిని గట్టిగా పట్టుకున్నాడు. అంతే అది భళ్ళున పగిలిపోయింది. అత్తరు వాసన వీధి చివరిదాకా ఘుమ్మనింది.
మీ అంతఃపురంలో పని చేసే భటులు, దాసీలను కనిపెట్టి వుండమని ఒక్కొక్కరికి ఒక్కొక్క గూఢాచారిని నియమించాను. అంతే అత్తరు వాసన బైటపడిన వెంటనే మన గూఢచారులు అది వచ్చిన ఇంటిని చుట్టుముట్టారు. దొంగ పట్టుబడ్డాడు" అన్నాడు.
“శభాష్... సేనాధిపతి. అంతఃపురంలో ఎవరి మనసునూ నొప్పించకుండా దొంగను పట్టేశావు. నా మనసును గెలిచేశావు" అంటూ సంబరంగా మెడలోని పగడాల హారాన్ని తీసి సైనికాధికారికి కానుకగా ఇచ్చాడు.
**********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి