తలకు మించిన భారం! తప్పదు తన వారి కోసం!: - డా పివిఎల్ సుబ్బారావు.-విజయనగరం- 9441058797 .
1
ఎంతైనా బరువు ఈ బతుకు! 

ఏదైనా ఇది వరమే మనకు! 

బతుకన్నది మోయుట కొరకు!

మోయాలి మరి చివరి వరకు!

మోయలేనని ఎన్నడూ అనకు! 
2.
తల్లి రక్తం క్షీరంగా,
 మార్చి ఇస్తుంది!

 స్వేదం జీవంగా ,
మార్చి నడుస్తుంది!

 తనయుల కోసం ,
ధరణిలా సహిస్తుంది !

ప్రాణం పణంగా ,
పెట్టి అడుగేస్తుంది !

కన్నవాళ్ళని ,
కంటికి రెప్పలా కాస్తుంది!
3.
పిల్లలే ఆమెకున్న లోకం !

వారి దరికి చేరనీదు శోకం!

ఏ పని కాదు ఆమెకు భారం!

ఆమె బతికేదే మరి వారికోసం!

ఆ పేగు బంధం,
 కొనసాగు జీవితాంతం! 
4.
పిల్లలు పెరిగి ,
పక్షులై ఎగిరిపోతారు!

 పక్షిలా ఎగరలేని ,
తల్లి మిగిలిపోతుంది !

నూనె లేని ,
దీపంలా కొడిగడుతుంది, 

వసంతం వెళ్లిపోయిన,
 వనమై వెలవెల పోతుంది !

ఓనాటికి తెలియని,
 లోకానికి చేరిపోతుంది!
5
ప్రతిఫలాపేక్ష లేనిది ,
అమ్మ కర్మ! 

ఇల కనిపెం(పిం)చే,
సృష్టికర్త అమ్మ! 

మానవజాతికి ,
ప్రాణం పోసేది అమ్మ!

మనం తీర్చలేని ఋణం,,
మాతృఋణమేనమ్మా!

అమ్మ నివాసం ,
దిగి వస్తుంది స్వర్గం!
6.
హమ్ అనేక్ , మా ఏక్! 

అమ్మ పెద్దయినా లక్!

యోగక్షేమకరం ఆ దృక్! 

దుఃఖ ఉపశమనం ఆ వాక్!

మా మహాన్ సదా ఈమాన్! 
_________


కామెంట్‌లు