నేతి బీరకాయ! పచ్చి వెలక్కాయ!:- డాపివిఎల్ సుబ్బారావు. విజయనగరం.-9442058797.
1
కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుందా! 

మనసు లేనప్పుడు ,
మాట మంత్ర మవుతుందా! 

కపటం. మన హృదయ, కవాటాలు తెరుస్తుందా! 

నటన తప్ప జీవించలేని, బతుకు చితికి పోదా !

మేడిపండు పొట్ట విప్పి, చూడాలనిపిస్తుందా!
2.
మనిషి కరగని శిలే ,
మంచి చెదిరిన కలే!

మాయ మాటల్తో సాటి,
 మనిషి గోయి తవ్వాలే!

పామో ,తేలో, విషం,
తలలో ,తోకలో,ఉండాలే!

ఖలుడైనాడు నిలువెల్లా,
విషమే పారుతుందిలే!,

వయోముఖవిషకుంభం, గోముఖవ్యాఘ్రం విధిలీలే!
3.
ఆధునికుడై,
 ఆకాశమంత ఎత్తు ఎదిగాడు !

స్వభావాన క్రూరుడై ,
పాతాళానికి దిగజారేడు!

 గ్రహాల దగ్గరవుతూ, 
భూమికే, దూరం అవుతాడు !

మానవ ప్రవృత్తి జాగృతి ,
వింత వికృత ఆకృతి !

ఏ క్షణాన ఎలా ఉంటుందో, మనకి తెలియని దుస్థితి!
4.
సౌహార్ద్రం, సౌభ్రాతృత్వం పునాదులు కదిలాయి! 

స్వార్థం, విద్వేషం అంతటా ,, కత్తులు నూరుతున్నాయి!

మానవసంబంధజ్యోతులు, మరి కొడిగడుతున్నాయి!

ఉన్నవి రెండే చేసేది,
 దోపిడీ చూసేది రాబడి!

వాదాలే అన్నీ, లేనిది,,
 కాన రానిది మానవతావాదం!
5.
కుటుంబమే ,
సమష్టి  దాటి వ్యస్టి!

ఎంతసేపూ,
అహమే తదేక దృష్టి!

అహర్నిశలు,
 కోరేది ఆర్థిక వృష్టే!

హృదయం రసహీనం ,
మెదడు వికాస సృష్టి!

తెలివే కృత్రిమం,
 ఆ క్రమం కాలాన ఆక్రమం! 
_________


కామెంట్‌లు