నిజమైన పండుగ:- కోలా సత్యనారాయణ -విశాఖపట్నం -ఫోన్: 9676623939
  అదో మురికి వాడ.  అక్కడ అందరూ రెక్కాడితే గాని డొక్కాడని వారే! ‌ సీతమ్మ, వాళ్ళాయన రామయ్య రోజూ పనికి పోయి, తెచ్చిన డబ్బులతో ఏరోజు పబ్బం ఆరోజు గడుపుకునే వారు.  
        అమ్మవారి పండుగ దగ్గర పడుతుంది.   ఆ పండుగ వస్తుందనుకోగానే, ఆ మొగుడూ పెళ్ళాల కాళ్ళూ చేతులూ ఆడటం లేదు.  పండగ రోజు అందరూ డబ్బన్నోళ్ళు రకరకాల పిండివంటలు ఆరగిస్తూ, ఆనందంతో గడుపుతారు. మన పిల్లలు అడిగితే మంచి పిండి వంటైనా,  బిరియానీ ఐనా చేసి పెట్టలేని స్థితిలో ఉన్నాం.  డబ్బులు ఎక్కడ తేగలం?  పోనీ మనం పని చేస్తున్న ఇళ్ళలో ఏమైనా అడిగి చూద్దాం అని ఇద్దరూ బయలు దేరారు.  యజమానులు లేవు పొమ్మనగానే, నిరాశ తో ఇంటి ముఖం పట్టారు.
          తీరా, ఇంటికి వచ్చేసరికి, తమ గుడిసె ముందు ఒక పెద్ద కారు ఆగి ఉండటం చూశారు.  సీతమ్మ తన కళ్ళను తనే నమ్మలేక పోయింది.  సంశయిస్తూ కారు దగ్గరకు నడిచింది.
          అంతలో, కారు లోంచి ఇద్దరు వృధ్ధ దంపతులు దిగారు. తాము వృద్ధాశ్రమంలో ఉంటున్నామని, తమ పిల్లలు దూరంగా విదేశంలో ఉంటున్నారని, డబ్బుకు ఏమాత్రం కొదవ లేదని, ఈ ఏడాది అమ్మవారి పండుగ ఈ మురికివాడ లోనే జరుపుకుందామని వచ్చామని చెప్పారు.  
        కారు లోంచి రకరకాల స్వీట్స్, బట్టలు ఉన్న అట్ట పెట్టెలు దింపించి, ఆ వాడ లోని వారందరికీ పంచారు.  వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి, తమతో సరదాగా గడిపేలా చెయ్యమని సీతమ్మను అడిగారు.
        అలా అందరూ తూలుతూ, తుళ్ళుతూ, ఆరాత్రి  ఆ దంపతులిచ్చిన బట్టలు కట్టుకొని,  స్వీట్లు తిని  గుడికి బయలుదేరారు.  అక్కడ డప్పుల వాయింపు, పులి వేషాలు, బుట్ట బొమ్మ లాటలు, విచిత్ర వేష ధారణలు చూసి ఆనందించారు.
        ఆరోజు వాడ వాడంతా కబుర్లు, తుళ్ళింతలతో  నిండి పోయింది.  ఆ పేదోళ్ళ గుండెల్లో ఆనందం వెల్లి విరిసింది.  ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో?  రేపటి నుండి మా కూలి బతుకులు మావే! అనుకున్నారంతా.
ఆ వృధ్ధ దంపతులు ఆ రాత్రంతా ఆనందంగా గడిపి, మర్నాడు ఉదయం వెళ్ళిపోతూ ఒక శుభవార్త చెప్పారు.  "ఈ ఆనందం ఈ ఒక్క రోజుతోనే సరి అని అనుకోకండి.  మరలా సంక్రాంతికి వస్తాం.  ఈసారి పేద పిల్లలకు చదువుకోడానికి ధన సహాయం 
చేస్తాం" అని అనగానే జనమంతా బ్రహ్మానందంతో ఊగిపోయారు.
                 ****
**   ఇది నా స్వీయ రచన.  దేనికీ అనువాదం, అనుకరణ కాదు.

కామెంట్‌లు