పుస్తక వింజామరలు :- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
ఉక్కపోతలో గది తలుపులు మూసుకున్న ప్రపంచంలో
తెరుచుకన్న వెంట్ 
గోడలకు మొలిచిన చిన్న కిటికీ

హస్త భూషణంగా నాలో ఒక జీవిత స్నేహం జుగలబందీ
స్వేచ్ఛ గంధం పూసిన ప్రక్షాళన దాతి 
రాగ పరాగాల ఆకాశవిజ్ఞాన పొది ఖ్యాతి కాదు బాధల ముళ్ళ బతుకు బాటల చదివే చకోరాలు 

మృదువుగా మునివేళ్ళు సున్నితంగా మెత్తని పేజీల్లోకి పంపిన సంగీతం
నా బతుకు తెరిచిన సిరుల గనులు

చేతిలో నువ్వు చెలి
చెలిమి బుగ్గలను నునువెచ్చగా మీటిన జ్ఞాన పథాలు
నాలోని నవ్వు బతుకున పోసిన ఆకుపచ్చ పూల వసంత వాకిలి

సంబురం అక్షరాలదా లేక చదివే నాదా సరదాలో భూమ్యాకాశాలను ఏకం చేసిన 
జ్ఞాన సుధల పంచే ప్రదర్శన వేదికదా 
ఎక్కడైనా ఎప్పుడైనా ప్రపంచమంతా గాలించినా 
కనిపించదే 
చీకట్ల ఛేదన వేదిక బహుముఖ అక్షర దుందుభి
నాడిని తట్టిలేపే బొడ్డుతాడు అమ్మ నేర్పిన జ్ఞాన నాళిక 
అక్షరాల వెలుగు ముగ్గులు దిద్దిన బడిలో 
మెరుపుల కాంతి పుస్తక ప్రదర్శన 

చేతి ఆభరణం మూసిన పిడికిట ఆయుధం 
తెరిచి చూస్తే జ్ఞాన విజ్ఞాన విస్ఫటనాల పచ్చ చిగురు
బతుకు గాలితిత్తుల ఊపిరి
నా గుండె స్పందన పుస్తక వింజామర
హైదరాబాద్ బుక్ ఫేయిర్...

==================================


(38వ,హైదరాబాద్ బుక్ ఫేయిర్ 19-12-2025న మొదలయే సందర్భాన...)
కామెంట్‌లు