అడవిలో వెన్నెల కాదు… ఆమె వెలుగు: - గుండవరం ప్రభాకర్ రావు ( మిత్రాజి )-ఫోన్ నం. 9949267638-అత్వెల్లి , మేడ్చల్ జిల్లా.

 రాధ చదువంటే ప్రాణం పెట్టే అమ్మాయి. MBA చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లోనే ఆమె జీవితానికి పెద్ద మలుపు వచ్చింది. ఇంకా చదువుకోవాలన్న ఆమె కోరికను పక్కన పెట్టి, “మంచి సంబంధం వచ్చింది, పెళ్లి తర్వాత చదివిస్తారు” అన్న తల్లిదండ్రుల మాటలతో పెళ్లి జరిగిపోయింది. కలలు మూటకట్టుకుని, ఆశలతో కొత్త జీవితంలో అడుగుపెట్టింది రాధ.
పెళ్లి తరువాత కొంతకాలం జీవితం ప్రశాంతంగానే సాగింది. ఒక బాబు, ఒక పాప పుట్టారు. పిల్లలతో రాధ జీవితం సంపూర్ణమైందని అనిపించింది. కానీ కాలం గడిచేకొద్దీ భర్తలో మార్పు మొదలైంది. మద్యం అలవాటు, మాటలతో హింస, నిత్యం గొడవలు—ఇవి రాధ జీవితాన్ని నెమ్మదిగా చీకటిలోకి నెట్టాయి. ఎన్ని సార్లు చెప్పినా మార్పు రాలేదు. పిల్లల కళ్లలో భయాన్ని చూసిన రోజు, రాధలోని తల్లి మేల్కొంది.
ఒక తెల్లవారుజామున పిల్లల చేతులు పట్టుకుని ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు కానీ అక్కడ ఉండలేనన్న నిర్ణయం మాత్రం గట్టిగా ఉంది. సిటీకి వచ్చి బంధువుల ఇంట ఒక మూల ఆశ్రయం తీసుకుంది. స్కూల్ లో టీచర్ ఉద్యోగం సంపాదించి, అదే స్కూల్ లో పిల్లలను చేర్పించింది. కష్టమైనా తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం మొదలుపెట్టింది.
అయితే గతం అక్కడికీ వెంటాడింది. తాగి వచ్చిన భర్త స్కూల్ లో రభస చేయడం ఆమెకు తీవ్రమైన అవమానంగా మారింది. ఆ రాత్రి రాధ చాలా సేపు నిద్రపోలేదు. తన జీవితాన్ని తానే కాపాడుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. విడాకులు తీసుకోవడం ఓటమి కాదని, అది బతకడానికి తీసుకున్న ధైర్యమైన అడుగని అర్థమైంది. పెద్దల అంగీకారంతో విడాకులు జరిగాయి.
అదే వీధిలో చిన్ననాటి స్నేహితుడు ప్రకాష్ ఆమె జీవితంలోకి మళ్లీ వచ్చాడు.నా భార్య పిచ్చిది అని తెలువక మా వాళ్ళు నాకు పెళ్లి  చేశారు. ఆమెతో నాకు సుఖం లేదు. ఇప్పుడు నువ్వు కూడా నీ భర్తతో విడాకులు తీసుకున్నావు కాబట్టి మనిద్దరం ఒకటిగా కల్సి జీవిద్దాం. సహజీవనం చేద్దాం కొంతకాలం. ఆ తరువాత నిన్ను నేను అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటాను అని రాధకు నచ్చజెప్పాడు. 
అతనికీ జీవితంలో గాయాలే. విడాకుల బాధ, ఒంటరితనం. ఇద్దరి బాధలు కలిసినప్పుడు కొంత ఊరట పుట్టింది. “నీకు నేనున్నాను” అన్న మాట రాధకు భరోసాగా అనిపించింది. కొన్నేళ్లు సహజీవనంగా జీవించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగ భయం, కోర్ట్ కేసు, కూతురి భవిష్యత్తు—ఈ అన్నింటి మధ్య ప్రకాష్ వెనకడుగు వేశాడు. రాధకు మళ్లీ ఒంటరితనం ఎదురైంది.
ఆఫీసులో భాస్కర్ అనే సహోద్యోగి రాధకు ధైర్యం చెప్పాడు. అతని మాటలు ఆమెకు కొంత బలమిచ్చాయి. కానీ అతనూ ఉద్యోగ మార్పుతో దూరమయ్యాడు. అప్పుడే రాధకు ఒక నిజం అర్థమైంది—ఇంతకాలం తాను ఎవరినో ఆధారంగా చూసిందని, కానీ తనకు నిజమైన బలం తనలోనే ఉందని.
ఒక రోజు ప్రకాష్ ను పిలిచి స్పష్టంగా చెప్పింది. “ఇక నా జీవితంలోకి రావద్దు. నా పిల్లలే నా ప్రపంచం.” ఆ మాటల తర్వాత ఆమె మనసు తేలికైంది. బాధ పూర్తిగా పోయిందని కాదు, కానీ తన మీద తనకు నమ్మకం పెరిగింది.
కాలం నెమ్మదిగా ముందుకు సాగింది. రాధ స్కూల్ లో తన పని పట్ల మరింత అంకితభావంతో పనిచేసింది. పిల్లల ఫలితాలు మెరుగయ్యాయి. ఆమె పేరు మంచి టీచర్ గా గుర్తింపు పొందింది. ఒక రోజు “ఉత్తమ ఉపాధ్యాయురాలు” అవార్డు ఆమె చేతుల్లోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి—అవి బాధవి కాదు, గర్వం, తృప్తి కలిసిన కన్నీళ్లు.
పిల్లలూ తమ జీవితాల్లో ముందుకు సాగారు. బాబు మంచి ర్యాంక్ తో ఇంజనీరింగ్ లో చేరాడు. పాప మెడిసిన్ చదవాలన్న కలను నిజం చేసుకునే దారిలో అడుగుపెట్టింది. ఒక సాయంత్రం ఇంటి బాల్కనీలో కూర్చుని పిల్లలను చూస్తున్న రాధకు, తన జీవితం వ్యర్థం కాలేదన్న సంతృప్తి తొలిసారి సంపూర్ణంగా కలిగింది.
అదే సమయంలో ఆనంద్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి అడుగుపెట్టాడు. సాదాసీదా మనసు, గౌరవం ఇచ్చే స్వభావం. హడావిడి లేదు, వాగ్దానాలు లేదు. ముందుగా స్నేహం, తరువాత నమ్మకం. రాధ ఈసారి భయంతో కాదు, అవగాహనతో ఆలోచించింది. పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్లు చిరునవ్వుతో చెప్పారు—“అమ్మా, నువ్వు సంతోషంగా ఉంటే మాకదే చాలూ.”
సాదాసీదా పెళ్లి జరిగింది. పెద్ద ఆర్భాటం లేదు. కానీ ఇంటంతా ప్రశాంతత నిండింది. ఆనంద్ రాధ జీవితంలోకి రక్షకుడిగా రాలేదు. తోడుగా వచ్చాడు. ఆమె వెలుగును ఆర్పడానికి కాదు—మరింత వెలిగించడానికి.
ఈ రోజు రాధ ఒంటరిగా కాదు. బలంగా ఉంది. గౌరవంగా ఉంది. తన పిల్లలతో, తన జీవితంతో సంతృప్తిగా ఉంది. ఒకప్పుడు “అడవిలో వెన్నెలలా” కనిపించిన ఆమె జీవితం, నిజానికి చీకట్లో వెలిగిన దీపమని అందరికీ అర్థమైంది.
ఆమె వెన్నెల కాదు
ఆమెనే వెలుగు.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice short story Pabbanna