పద్యమే ప్రాణం:- సాకి, 9949394688.
జానపదులు కూడ జాగరూకతతోడ
హృద్యమందు నిల్పె పద్యములను
పల్లెపల్లెనుండె భజనమంటపముల
పద్యమనిన పల్లె భక్తిపాట

పద్యకవులు పెరిగి పద్యమ్ము బ్రతికేను
పద్యమున్నవరకు బ్రతుకు తెలుగు
పద్యమే మనదగు బంగారుపంటరా
పద్యమనిన పల్లె భక్తిపాట

పద్యమే తెలుగుకు ప్రాణమ్ముజేకూర్చు
పద్యమే తెలుగును పదిలపర్చు
పద్యమే తెలుగుకు వైభవమును నిల్పు
పద్యమనిన పల్లె భక్తిపాట

ఆటవంటి రచన ఆటవెలదియేను
తేటగుండు రచన తేటగీతి
చిత్తమందు నిల్చు వృత్తములన్నియు
పద్యమనిన పల్లె భక్తిపాట

పద్యమేదియైన పదుగురినోటుండు 
వంకబెట్టుటెవని వశముగాదు
వంకబెట్టువాన్కి వాతరోగముయేమొ
పద్యమనిన పల్లె భక్తిపాట


కామెంట్‌లు