ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
 విముక్తి
         వందనగిరి రాజ్యాన్ని విశాల దత్తుడు అనే రాజు పరిపాలిస్తున్నారు. రాజ్యం నలువైపులా ఎలాంటి సమస్యలు ఉన్నా గడియలోపే తెలుసుకుని పరిష్కరించేవాడు. ప్రజలకు సమస్య తెలిసేలోపే పరిష్కారం కూడా జరిగిపోయేది. ప్రజలంతా సంతోషంగా ఉండేవారు.
           విశాల దత్తుడి బావమరుదులు రాజ్యంపై కన్నేశారు. ఎలాగైనా విశాల దత్తుడిని వశం చేసుకొని, రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకున్నారు. 
                నెమ్మదిగా విశాల దత్తుడికి దగ్గరై నమ్మకంగా ఉంటూ రాజ్యపాలనలో చోటు దక్కించుకున్నారు. విశాల దత్తుడిని మద్యానికి బానిస చేసి వారే రాజ్యపాలన చేయసాగారు. అప్పుడు రాజ్యంలో సమస్యలు పుట్టి రాజ్యం ఇబ్బందుల్లోకి వెళ్ళింది. ప్రజలంతా అయోమయ స్థితిలో ఉన్నారు. పోరుగు రాజ్యాల వారు కూడా వందనగిరి రాజ్యంపై దండెత్తి ఆక్రమించుకోవాలన్న ఆలోచన పుట్టింది.
                ఒకరోజు అర్ధరాత్రి మహారాజు విశాల దత్తుడు దాహం దాహం అంటూ అరవగా పాతికమంది ప్రజలు వచ్చి మహారాజుకు కషాయంతో పాటు నీళ్ళు తాగించి, దప్పిక తీర్చి,  విశాల దత్తుడిని మామూలు మనిషిగా చేశారు. మరుసటి రోజు ఉదయం మామూలు మనిషిగా మారిన విశాల దత్తుడు రాజమందిరంలో ప్రజలను చూసి ఆశ్చర్యపోయాడు. మహారాజా మేము సమస్యల్లో ఉంటే గడియలోపే రాజ్యం నలువైపులా మా సమస్యలు తీర్చావు. ఇప్పుడు రాజ్యమే సమస్యల్లో ఉంది. అందుకై మేము రాజమందిరంకు వచ్చి, మీ బావమరిదులను బంధించి, మీకు కషాయం తాగించి, మిమ్మల్ని మద్యం బానిస నుంచి విముక్తి చేశామన్నారు.
        ప్రజల మాటలు విన్న విశాల దత్తుడు చాలా సంతోషించాడు. రాజ్యం నలవైపుల సమస్యలను పసికట్టాను గాని నా చుట్టూ ఉన్నా సమస్యను నేను పసికట్టలేకపోయానని బాధపడ్డాడు. విశాల దత్తుడు తిరిగి రాజ్యం నలవైపులా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పొరుగు రాజ్యాల వారు సైతం రాజ్యాక్రమన నుండి వెనుకడుగు వేశారు. ప్రజలంతా సంతోషించారు.
 
నేను రాసిన " విముక్తి " కథ నా స్వీయ రచన ఎలాంటి అనువాదం కానీ అనుసరణ కానీ ఇతర పత్రికలకు పంపలేదని హామీ ఇస్తున్నాను.

కామెంట్‌లు